
సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి
సాక్షి, కొడవలూరు: ఇరిగేషన్, ఉపాధిహామీ పనుల్లో గడిచిన ఐదేళ్లలో చోటు చేసుకున్న అవినీతిపై విచారణ జరిపిస్తామని ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం జరిగిన సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లలో నీరు–చెట్టు పథకంలో భారీగా అవినీతి జరిగిందన్నారు. ఈ విషయాన్ని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకుపోవడం జరిగిందని తెలిపారు.
విచారణలో అవినీతిని నిగ్గుతేల్చి అక్రమార్కుల భరతం పడతామన్నారు. నీరు–చెట్టులోని అవినీతి కారణంగా రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు. ఎంతో మంది అధికారులు బలయ్యారని తెలిపారు. ఉపాధి పనుల్లోనూ భారీగా అవకతవకలు జరిగాయని, వీటిపై తహసీల్దార్, ఎంపీడీఓలతో విచారణ జరిపిస్తామన్నారు. గతంలో జరిగిన అవినీతికి, ఏకపక్ష నిర్ణయాలకు విసిగిపోయిన ప్రజలు తనను 40వేల మెజార్టీతో గెలిపించారన్నారు. గత ప్రభుత్వం మహిళా తహసీల్దార్‌పై ప్రజాప్రతినిధి దాడికి పాల్పడిన చర్యలు తీసుకోకుండా నిరంకుశంగా వ్యవహరించిందన్నారు. ప్రభుత్వ వైద్యులు మండల కేంద్రాల్లోనే నివాసం ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో వైద్యులు మానవతతో వ్యవహరించాలన్నారు.
ఊటుకూరులో బోరు బావిలో పడిన బాలికను కొనఊపిరితో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొస్తే వైద్యులు అందుబాటులో లేరన్నారు. అనంతరం కోవూరు వైద్యశాలకు తీసుపోయినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా వైద్యులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. అమ్మఒడి పథకాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఇప్పటికీ గిరిజనులు బడులకు పోవడం లేదని తెలిపారు. ఎంఈఓ, ఐసీడీఎస్, పంచాయతీ కార్యదర్శులు సమైక్యంగా కృషి చేసి అమ్మఒడిని ప్రజల్లోకి తీసుకుపోయి ప్రతీబిడ్డా చదివేలా చేయాలన్నారు. గృహనిర్మాణ శాఖలో లబ్ధిదారులను ముప్పతిప్పలు పెట్టారన్నారు. అందువల్లే గృహాలన్నీ వివిధ దశల్లో నిలిచిపోయి ఉన్నాయన్నారు.
సమావేశం ప్రారంభమైనా ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ అందుబాటులోకి రాకపోవడంపై ఆయన స్పందిస్తూ పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచించారు. ఎంపీపీ నల్లావుల వెంకమ్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తహసీల్దార్ ఎన్వీ ప్రసాద్, ఎంపీడీఓ డీవీ నరసింహారావు, వైస్‌ఎంపీపీ కొండా శ్రీనివాసులురెడ్డి, ఎంఈఓ వసంతకుమారి, వైద్యాధికారులు రామకృష్ణ, సుచిత్ర, ఎస్సై శ్రీనివాసులురెడ్డి, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment