ఆమ్రపాలి మన ఆడపడుచే! | special story on IAS officer amrapali | Sakshi
Sakshi News home page

ఇంటిల్లిపాదీ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్‌ఎస్‌లే..

Published Wed, Jan 31 2018 12:15 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

special story on IAS officer amrapali - Sakshi

తల్లి పద్మావతి, సోదరి మానస గంగోత్రిలతో ఆమ్రపాలి

ఒంగోలు సబర్బన్‌: ఆమ్రపాలి.. రెండు మూడేళ్లుగా సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారంలో ఉన్న డైనమిక్‌ లేడీ. టెలివిజన్‌ చానళ్లలోనూ తరచూ దర్శనమిచ్చే యువ కలెక్టర్‌ మన ఆడపడుచే. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న ఐఏఎస్‌లలో ఆమె  ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు నగర శివారులోని నరసాపురం అగ్రహారం ఆమె స్వగ్రామం. దీనిని స్థానికంగా అగ్రహారం రైల్వే గేటు అని వ్యవహరిస్తారు. రైల్వే గేటు దాటాక రెండు కిలో మీటర్ల దూరంలో ఉంది ఎన్‌.అగ్రహారం గ్రామం. తెలంగాణ రాష్ట్రం వరంగల్‌ అర్బన్, రూరల్‌ కలెక్టర్‌గా తనదైన శైలిలో విధులు నిర్వహిస్తున్న కాటా ఆమ్రపాలి  ఒంగోలు వాసికావడం గర్వకారణం. 2010 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఆమ్రపాలి 39వ ర్యాంక్‌ సాధించి, ఐఏఎస్‌లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం ట్రైనీ ఐఏఎస్‌గా, జాయింట్‌ కలెక్టర్‌గా, నగర కమిషనర్‌గా పనిచేసి ప్రస్తుతం వరంగల్‌ జిల్లా అర్బన్, రూరల్‌ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

తండ్రి కాటా వెంకటరెడ్డి ఫ్రొఫెసర్‌..
ఎన్‌.అగ్రహారానికి చెందిన ఆమ్రపాలి తండ్రి కాటా వెంకటరెడ్డి చిన్నతనంలో అగ్రహారంలోనే చదువుకున్నారు. మేనకోడలు పద్మావతిని వివాహం చేసుకున్నారు. పద్మావతి స్వగ్రామం టంగుటూరు మండలం ఆలకూరపాడు గ్రామం. ఆయన చిన్నతనంలో ఎలిమెంటరీ విద్య ఆలకూరపాడు పాఠశాలలోనే జరిగింది. హైస్కూలు విద్య టంగుటూరు, ఇంటర్మీడియేట్, డిగ్రీ సీఎస్‌ఆర్‌ శర్మ కళాశాలలో, పీజీ విద్య విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సీటీలో పూర్తి చేశారు. అదే యూనివర్సిటీలో ఎకనమిక్స్‌ ఫ్రొఫెసర్‌గా ఉద్యోగంలో చేరారు. ఆమ్రపాలి కుటుంబానికి చెందిన సొంత ఇల్లు ఎన్‌.అగ్రహారంలో ఉంది.


ఎన్‌.అగ్రహారంలోని ఆమ్రపాలి కుటుంబానికి చెందిన ఇల్లు, ఆమ్రపాలి తండ్రి కాటా వెంకటరెడ్డి 

కుటుంబమంతా ఉన్నతాధికారులే..
ఆమ్రపాలితో పాటు ఆమె సోదరి కూడా ఐఆర్‌ఎస్‌. ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌(ఐఆర్‌ఎస్‌)కు ఎంపికయిన ఆమ్రపాలి సోదరి మానస గంగోత్రి ప్రస్తుతం కర్ణాటక కేడర్‌లో ఇన్‌కంట్యాక్స్‌ విభాగంలో పనిచేస్తోంది. మానస గంగోత్రి 2007 ఐఆర్‌ఎస్‌ బ్యాచ్‌కు చెందిన అధికారిణి. ఐఆర్‌ఎస్‌లో 184వ ర్యాంక్‌ సాధించింది. ఆమె భర్త ప్రవీణ్‌ కుమార్‌ తమిళనాడుకు చెందిన వ్యక్తి. ఆయన కూడా 2010 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌. తమిళనాడు ఐఏఎస్‌ కేడర్‌కు చెందిన ప్రవీణ్‌ కుమార్‌ ప్రస్తుతం ఉమెన్‌ వెల్ఫేర్‌లో డైరెక్టర్‌గా చేస్తున్నారు. తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత చనిపోయిన తరువాత జరిగిన ఉపెన్నికకు రెండు సార్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు.

ఫిబ్రవరి 18న వివాహం
వరంగల్‌ అర్బన్, రూరల్‌ జిల్లాల కలెక్టర్‌గా పనిచేస్తున్న అమ్రపాలికి ఈ ఏడాది ఫిబ్రవరి 18వ తేదీన వివాహం నిశ్చయమయింది. ఆమ్రపాలి చేసుకోబోయే వ్యక్తి కూడా ఐపీఎస్‌ అధికారి. 2011 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన షమీర్‌ శర్మ జమ్మూ పట్టణానికి చెందిన వ్యక్తి. ప్రస్తుతం ఆయన డయ్యూ–డామన్‌లో సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌(ఎస్పీ)గా విధులు నిర్వర్తిస్తున్నారు. జమ్మూలో ఫిబ్రవరి 18న వివాహం జరగనుంది. ఫిబ్రవరి 25న సికింద్రాబాద్‌లోని సికింద్రాబాద్‌ క్లబ్‌లో రిసెప్షన్‌ నిర్వహిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement