నో టికెట్స్‌ | No tickets for Sankranti | Sakshi
Sakshi News home page

నో టికెట్స్‌

Published Tue, Jan 9 2018 11:02 AM | Last Updated on Fri, Jul 6 2018 3:36 PM

No tickets for Sankranti - Sakshi

నెల్లూరు (సెంట్రల్‌) : సంక్రాంతి రోజుల్లో ప్రయాణం కష్టతరం కానుంది. దూరప్రాంత ప్రయాణాలకు సంబంధించి రైళ్లు, బస్సుల్లో టికెట్లు నెల రోజుల ముందే బుక్‌ అయిపోయాయి. ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు వెయిటింగ్‌ లిస్ట్‌ సైతం లేకుండాపోయింది. మిగిలిన రోజులకు సంబంధించి కొన్ని రైళ్లలో మాత్రమే వెయిటింగ్‌ లిస్ట్‌ అందుబాటులో ఉంది. దీంతో దూర ప్రాంతాల్లోని వారు సొంతూళ్లకు వచ్చేందుకు అవస్థలు తప్పని పరిస్థితి నెలకొంది.

కన్ఫర్మేషన్‌ కష్టమే
తెలుగు వారికి అతి పెద్ద పండగ కావడంతో సంక్రాంతికి నగరాలు, పట్టణాల నుంచి సొంత ఊళ్లకు వెళ్లేవారి సంఖ్య లక్షల్లో ఉంటోంది. కొందరైతే మూడు నెలల ముందుగానే రైళ్లలో రాను, పోను టికెట్లు బుక్‌ చేసుకున్నారు. ప్రతి రైలుకు వెయిటింగ్‌ లిస్ట్‌లో వందలాది మంది నమోదై ఉన్నారు. సాధారణ రోజుల్లో కొన్ని రైళ్లలో వెయిటింగ్‌ లిస్ట్‌ 200 వరకు ఉన్నా రిజర్వేషన్‌ కన్‌ఫర్మ్‌ అయ్యేది. ఇప్పుడైతే వెయిటింగ్‌ లిస్ట్‌ చాంతాడులా పేరుకుపోయి చివరకు అవికూడా నిలిచిపోయాయి. వెయిటింగ్‌ లిస్ట్‌లో 50లోపు నమోదైన వారికి కూడా టికెట్‌ కన్‌ఫర్మ్‌ అయ్యే పరిస్థితి లేదు. క్యాన్సిల్‌ అయ్యే టికెట్లు ఏవీ ఉండటం లేదని, అందువల్ల వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్నవారికి టికెట్‌ దొరికే అవకాశం లేదని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. దీంతో సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణాలు సాగించే వారు ఏంచేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

వెయిటింగ్‌ లిస్ట్‌లు పేరుకుపోయాయి
పండగల దృష్ట్యా ఏ రైలులోనూ సీట్లు ఖాళీ లేవు. రిజర్వేషన్‌ టికెట్లు దొరకడం లేదు. వందల కొద్దీ వెయిటింగ్‌ ఉంటోంది. టికెట్లు బ్లాక్‌లోకి వెళ్లకుండా పటిష్ట చర్యలు తీసుకున్నాం. ఎక్కడైనా ఇలాంటి పరిస్థితి ఉన్నట్టు తెలిస్తే వెంటనే మాకు సమాచారం ఇవ్వండి. తక్షణ చర్యలు తీసుకుంటాం. రైల్వే రిజర్వేషన్‌ కౌంటర్‌ వద్ద ప్రత్యేక నిఘా కూడా ఏర్పాటు చేశాం.
–డి.సతీష్, టికెట్స్‌ ఇన్‌స్పెక్టర్, నెల్లూరు రైల్వే స్టేషన్‌

బస్సుల్లో 50 శాతం అ‘ధనం’
నెల్లూరు(క్రైమ్‌): పండగ వేళ ప్రయాణ మంటేనే సామాన్యులు హడలిపోతున్నారు. ఆ రోజుల్లో అటు ప్రైవేట్‌ బస్, ఇటు ఆర్టీసీ యాజమాన్యాలు ప్రయాణికుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. ప్రైవేట్‌ బస్సుల్లో సాధారణ టికెట్‌ ధరపై 100 నుంచి 200 శాతం ధర పెంచేయగా.. ఆర్టీసీ సైతం స్పెషల్‌ బస్సుల పేరుతో సాధారణ చార్జీపై 50 శాతం అదనపు వసూళ్లకు  రంగం సిద్ధం చేసింది. రైళ్లలో టికెట్లన్నీ బుక్‌ అయిపోవడంతో ప్రయాణికులంతా ఆర్టీసీపై పడ్డారు. దీంతో చార్జీలు అమాంతం పెరిగిపోయాయి. ఇతర ప్రాంతాల నుంచి ఈనెల 10 నుంచి 13వ తేదీ వరకు, తిరిగి ఈనెల 15 నుంచి 17వరకు ప్రయాణానికి డిమాండ్‌ అధికంగా ఉంది. ఇప్పటికే ఆయా ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో సీట్లు అన్నీ రిజర్వ్‌ అయిపోయాయి.

282 ప్రత్యేక సర్వీసులు
సంక్రాంతి సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ నెల్లూరు రీజియన్‌ ఈనెల 10నుంచి 282 ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు నిర్ణయించింది. సాధారణ బస్సులతో పాటు ప్రత్యేక సర్వీసులు సైతం అందుబాటులో ఉంటాయి. ప్రధానంగా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కడప, రాజంపేట రూట్లలో డిమాండ్‌ ఉండటంతో ఆ ప్రాంతాలకే ప్రత్యేక బస్సులు నడపనున్నారు. హైదరాబాద్‌కు 150, బెంగళూరుకు 60, చెన్నైకు 48, కడపకు 20, రాజంపేటకు 4 అదనపు సర్వీసులను ఆర్టీసీ అధికారులు సిద్ధం చేశారు. ఈ బస్సుల్లో సాధారణ టికెట్‌ చార్జీపై 50 శాతం అదనంగా వసూలు చేస్తారు.

ప్రైవేట్‌ రాజ్యం
ప్రస్తుత పరిస్థితిని ప్రైవేట్‌ ట్రావెల్స్‌ యాజమాన్యాలు తమకు అనుకూలంగా మలచుకున్నాయి. ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ను బ్లాక్‌ చేసి.. ఇష్టానుసారంగా చార్జీలు నిర్ణయించి నిలువు దోపిడీ చేస్తున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే రెండింతలు అదనంగా వసూలు చేస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో ప్రయాణికులు అదనంగా చెల్లించి టికెట్లు కొనుగోలు చేయాల్సి వస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement