
మీడియాతో మాట్లాడుతున్న రేవతి, కుటుంబసభ్యులు,బిందు, రాధాకృష్ణన్, శ్రీజిత్, శ్రీరామ్
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, బుచ్చిరెడ్డిపాళెం: ‘రేణుకను చున్నీతో గొంతు నులిమి చంపారు, రేణుకది ముమ్మాటికి హత్యే, మృతిపై అనుమానాలున్నాయి’ అని రేణుక సోదరి రేవతి ఆవేదన వ్యక్తం చేశారు. రేణుక కేరళకు బయల్దేరే సమయంలో శ్రీజిత్, శ్రీరామ్ అడ్డుపడుతున్నారని చెప్పిందని రేవతి పోలీసులకు, మీడియాకు వివరించింది. బుచ్చిరెడ్డిపాళెం బలరాంనగర్‌లోని ఓ ఇంటిలో కేరళకు చెందిన ఉపాధ్యాయురాలు రేణుక(23) అనుమానాస్పద స్థితిలో శనివారం మృతి చెందిన విషయం విధితమే. ఈ మేరకు.. కొట్టాయం నుంచి ఆదివారం సాయంత్రం రేణుక సోదరి రేవతి, కుటుంబసభ్యులు బుచ్చిరెడ్డిపాళేనికి చేరుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ తన చెల్లెలిది హత్యేనని అనుమానం వ్యక్తం చేశారు. సంక్రాంతి సెలవులకు వస్తున్నాని శుక్రవారం ఫోన్ చేసి తల్లి వాసంతికి చెప్పిందన్నారు.
మళ్లీ శనివారం మధ్యాహ్నం ఫోన్ చేసి తాను ఇంటింకి బయల్దేరాలని చూస్తుంటే బిందు కుమారులు శ్రీజిత్, శ్రీరామ్ గదిలోనే ఉన్నారని, బయటకు వెళ్లడం లేదని తెలిపిందన్నారు. శ్రీజిత్, శ్రీరామ్ తల్లిదండ్రులు విషం తీసుకుని ఆస్పత్రిలో ఉన్నారని తనతో శ్రీజిత్, శ్రీరామ్ అన్నట్లు ఫోన్లో రేణుక చెప్పిందన్నారు. దీంతో రావడం కుదిరే అవకాశం లేదని చెప్పిందని తెలిపారు. అనంతరం కొద్దిసేపటికే మళ్లీ రేణుక సెల్ నుంచి ఫోన్ వచ్చిందని, అయితే బిందు మాట్లాడిందన్నారు. రేణుకకు సీరియస్‌గా ఉందని చెప్పిందన్నారు. ఇదిలా ఉంటే గతంలో రేణుక బిందు ఇంట్లో ఉన్న సమయంలో బిందు భర్త రాధాకృష్ణ మద్యం సేవించి వచ్చి కొట్టాడని తమకు ఫోన్లో తెలిపిందన్నారు. రేణుకకు ముక్కులో రక్తం కారుతున్నట్లు తమకే తెలియదని, మరి బిందు కుటుంబ సభ్యులు ముక్కులో రక్తం వస్తుందని చెప్పడం అనుమానాలకు తావిస్తోందన్నారు. మొత్తానికి రేణుకది హత్యేనని, పోలీసులు విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు.
శ్రీజిత్–రేణుకల మధ్య ప్రేమ వ్యవహారం
శ్రీజిత్–రేణుకల మధ్య ప్రేమ వ్యవహారం ఉంది. తన డైరీలో ఇద్దరి ప్రేమ విషయాన్ని రేణుక రాసి ఉంది. ఐ లవ్ యూ అంటూ , ఐలవ్‌యూ కన్నా అంటూ శ్రీజిత్‌ను సంబోధిస్తు రాసి ఉంది.
ఆర్థిక లావాదేవీలే కారణమా...
రేణుక మృతికి ఆర్థిక లావాదేవీలు కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రేణుక మెడలోని బంగారు చైన్ బుచ్చిరెడ్డిపాళెంలోని ఓ నగల దుకాణంలో కుదువపెట్టింది. అందుకు సంబంధించి నగదును బిందు కుటుంబసభ్యులకు రేణుక ఇచ్చినట్లు సమాచారం. కేరళకు వెళ్లే క్రమంలో తన తల్లి ఎక్కడ అడుగుతుందోనని రేణుక అలాంటి రోల్‌గోల్డ్ చైనే కొనుక్కుంది. రేణుక తన వేతనంలో ఇంటికి ఏమీ పంపించిన దాఖలాలు లేవని సోదరి రేవతి చెబుతోంది. ఈ నేపధ్యంలో తన చైన్‌తో పాటు ఆర్థిక లావాదేవీలను ప్రశ్నించినందుకు బిందు కుటుంబీకులు రేణుకను హత్యచేసి ఉంటారని రేవతి కుటుంబసభ్యులు పోలీసులు, మీడియాకు తెలిపారు.
అన్నీ అనుమానాలే..
బిందు–రాధాకృష్ణ దంపతులు, వారి కుమారులు శ్రీజిత్, శ్రీరామ్‌ల మాటల తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. రేణుక అడగకుండానే శ్రీరామ్, శ్రీజిత్‌లు శనివారం ఉదయం టిఫిన్, మధ్యాహ్నం బిరియానీ తీసుకెళ్లి ఇచ్చారు. అనంతరం కొద్దిసేపటికే మృతిచెంది పడి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment