మానవత్వం మంటగలిసింది... బంధాలు బరి తెగిస్తున్నాయి.. స్నేహాలు చెడుమార్గంలో నడుస్తున్నాయి.. సంబంధాలు అవసరాలకు పరిమితమవుతున్నాయి.. క్షణక్షణం అనుమానంతోనే స్నేహం.. ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం పాకులాట.. అంతిమంగా ప్రాణం తీసేందుకు వెనకాడని తత్వం.. అందులోనూ ఓ మహిళ కక్ష కట్టింది.. నమ్మకంగా స్నేహితుడిని ఇంటికి తీసుకెళ్లింది.. కసితీర కత్తితో నరికి దారుణంగా హత్య చేసింది. ఘటన తంగిళ్లబీడులో గురువారం సంచలనం రేపింది.
సాక్షి, తిరువూరు(కృష్ణా) : వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ వ్యక్తిని స్నేహితురాలు అతిదారుణంగా హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది. సీఐ ప్రసన్న వీరయ్యగౌడ్ తెలిపిన వివరాలు.. విజయవాడ పోరంకికి చెందిన అవనిగడ్డ గణేష్ (46) గతలో ఆగిరిపల్లి మండలంలో గ్రామ రెవెన్యూ అధికారిగా పనిచేశాడు. అప్పట్లో తిరువూరు సమీపంలోని తంగిళ్లబీడుకు చెందిన రేణుకతో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. కొంతకాలం ఇద్దరు బాగానే ఉన్నారు. అయితే ఇటీవలే గణేష్‌కు బదిలీ కావడంతో ఉద్యోగానికి సెలవు పెట్టి ఇంటి వద్ద ఉంటున్నాడు. ఇద్దరి మధ్య మనస్పర్థలతో దూరంగా ఉంటున్నట్లు చెప్పారు. ఏడాదిన్నరగా సంబంధం కొనసాగుతోంది. అయితే జనవరి నుంచి రేణుకకు డబ్బులు ఇవ్వడం లేదని సమాచారం. దీనికితోడు అనారోగ్యంతో గణేష్ మెడికల్ లీవ్‌లో ఉన్నాడు.
పథకం ప్రకారమే హత్య
ఇంటి ఖర్చులకు డబ్బులు ఇవ్వని గణేష్ మీద రేణుక కక్షపెంచుకుంది. తరుచూ ఫోన్‌లో డబ్బులు ఇవ్వాలని కోరుతోంది. అయితే జనవరి నుంచి డబ్బులు సర్దుబాటు చేయకపోగా గణేష్ కనిపించకుండా తిరుతున్నాడు. ఫోన్‌లో సంప్రందించినా పట్టించుకోవడం లేదని రేణుక భావించింది. దీంతో తోటి వారి సాయం తీసుకుంది. విస్సన్నపేట నుంచి ఇద్దరు మహిళలు, మరో ఇద్దరు యువకులను కారులో ఎక్కించుకుని విజయవాడ పోరంకి వెళ్లింది. గణేష్‌ను మాయమాటలు చెప్పి తీసుకురావాలని వారికి పని అప్పగించింది. అందరు కలసి పథకం ప్రకారం ఇంటికి వెళ్లి కారులో గణేష్‌ను ఎక్కించుకున్నారు.
తరువాత కారును నేరుగా తిరువూరు తంగిళ్లబీడులోని తన ఇంటికి తీసుకెళ్లింది. విస్సన్నపేట నుంచి తీసుకొచ్చుకున్న కిరాయి వ్యక్తులతో కలసి గణేష్‌ను కత్తితో నరికి చంపేశారు. నిందితులు పరయ్యారు. విస్సన్నపేటకు చెందిన కారు డ్రైవరును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. గతంలోనూ రేణుక పలు హత్యానేరాల్లో నిందితురాలు. ఆమె భర్తను కూడా హత్య చేసిన కేసులో నిందితురాలుగా ఉంది. ఆమెపై తిరువూరు పోలీసుస్టేషన్ రౌడీషీటు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment