
సిద్దిపేటజోన్: అధునాతన హంగులతో షాపింగ్‌మాల్‌ను తలదన్నే రీతిలో రూపుదిద్దుకున్న సిద్దిపేట మోడల్ రైతుబజార్ ప్రారంభానికి ముస్తాబైంది. ఇరుకైన స్థలం.. గాలివీస్తే ఎగిరిపోయే రేకుల షెడ్లు.. వానొస్తే బురద.. నిన్నటి వరకు పాత రైతుబజార్‌లో రైతులు, వినియోగదారులు పడిన ఈ ఇబ్బందులు ఇక నేటితో తీరిపోనున్నాయి. భారీనీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు మార్కెటింగ్ శాఖను కూడా పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో ప్రత్యేక శ్రద్ధతో సిద్దిపేటలో ఆధునిక మోడల్ రైతుబజార్‌కు రూపకల్పన చేశారు. ఇందుకోసం రూ.6 కోట్లు కేటాయించారు. ఇటువంటి తరహా రైతుబజార్ నిర్మాణం రాష్ట్రంలోనే మొదటిదని మార్కెటింగ్ శాఖ అధికారులు అంటున్నారు. దీని నిర్మాణానికి దాదాపు ఏడాది పట్టింది. సోమవారం మంత్రి హరీశ్‌రావు దీనిని ప్రారంభించి రైతులకు,వినియోగదారులకు అంకింతం చేయనున్నారు.
అంతా ఆధునికమే..
కొత్త రైతుబజార్‌లో ఎన్నెన్నో సదుపాయాలను ఆధునిక హంగులతో కల్పించారు. రైతులు సరుకు అమ్ముకునేందుకు ఎత్తయిన ప్లాట్‌ఫాంలు నిర్మించారు. దీనివల్ల భూమిపై ఉండే సూక్ష్మజీవులు కూరగాయలు, ఇతర సరుకుల్లోకి చేరవు. దుమ్ము, ధూళి కూడా అంటదు. కూరగాయల నిల్వకు కోల్డ్ స్టోరేజీ సదుపాయం సైతం రైతుబజార్‌లోనే కల్పించారు. 24 గంటలూ సీసీ కెమెరాల నిఘా ఉండనుంది. కూరగాయల ధరలు తెలిపే డిస్‌ప్లే బోర్డులు ఆకట్టుకుంటున్నాయి. అలాగే, కూరగాయలు, పండ్లలో పోషక విలువలు, వాటిని ఆహారంలో తీసుకోవడం కలిగే ప్రయోజనాలను స్క్రీన్‌పై డిస్‌ప్లే అయ్యేలా ఏర్పాటు చేశారు. దళారులను రైతుబజార్‌లోకి అడుగుపెట్టనివ్వకుండా బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తారు.
నేడు మంత్రి చేతులమీదుగా ప్రారంభం
మంత్రి హరీశ్‌రావు సోమవారం మధ్యాహ్నం 12.30కి మోడల్ రైతుబజార్‌ను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా రైతు సంఘాలు, రైతు రక్షణ సమితులు, మహిళా రైతులు భారీ ర్యాలీ నిర్వహించనున్నాయి. పాత బస్టాండ్ నుంచి బతుకమ్మలు, బోనాలతో సాగే ర్యాలీ అనంతరం రైతుబజార్‌ను మంత్రి ప్రారంభిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment