పుట్టగానే తల్లిని కోల్పోయింది... ఇంకో ఇరవై రోజులు గడవకముందే తండ్రి కూడా ఆమెకు దూరమయ్యాడు... అన్నీ కోల్పోయినా ఆ చిన్నారిని దేవుడు మరోసారి చిన్నచూపు చూశాడు.. బుడిబుడి అడుగులు వేయాల్సిన వయసులో నడవలేని పరిస్థితి కల్పించాడు.. అయినా ఆ చిన్నారి మోముపై చిరునవ్వు చెరగలేదు.. ఆ చిరునవ్వే నేడు ఆమెను సమస్య నుంచి బయటపడేలా చేసింది. అంతేకాదు.. సోషల్ మీడియా అంటే కేవలం అనవసరపు చర్చలు, ట్రోలింగ్స్‌కు మాత్రమే వేదిక అనే భావనను తప్పని మరోసారి నిరూపించింది.
ఆరుషి మహారాష్ట్రలోని సతారాకు చెందిన చిన్నారి. 70 ఏళ్ల బామ్మా తాతయ్య, కవల సోదరుడితో కలిసి జీవిస్తోంది. నిరుపేద కుటుంబానికి చెందిన ఆరుషికి ఏడాది వయసు ఉన్నపుడు కాన్‌జెన్షియల్ సుడత్రాసిస్(కాలి ఎముక వంగిపోవడం) అటాక్ అయింది. అప్పటికే కొడుకు కోడలిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆరుషి బామ్మాతాతయ్యలు ఈ ఘటనతో మరింత కుంగిపోయారు. ఆరుషి కూడా అందరు చిన్నారుల్లాగే లేడి పిల్లలా గెంతాలంటే ఆపరేషన్ చేయించాలని.. అందుకోసం 16 లక్షల రూపాయలు అవసరమని తెలిసి హతాశయులయ్యారు.
ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్న ఆ వృద్ధ దంపతులకు ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ అండగా నిలిచింది. వారి కన్నీటి గాథను తమ ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేయడంతో పాటు ఆరుషి కోసం ఫండ్‌రైజింగ్ క్యాంపెయిన్‌ని ఏర్పాటు చేసింది. కాలికి పింక్ బ్యాండేజ్ ఉన్న చిన్నారి ఆరుషి ఎంతో హృద్యంగా నవ్వుతున్న ఫొటోతో కూడిన ఈ పోస్టు నెటిజన్ల హృదయాలను కదిలించింది. అందుకే 980 మంది దాతలు ముందుకొచ్చి కేవలం ఆరు గంటల్లోనే ఆరుషి ఆపరేషన్‌కు కావాల్సిన 16 లక్షల రూపాయలు సమకూర్చారు. సోషల్ మీడియా పవరేంటో మరోసారి నిరూపించారు.
Comments
Please login to add a commentAdd a comment