సాక్షి, హైదరాబాద్ : కేరళను ఒకవైపు వరద, మరోవైపు నకిలీ వార్తలు ముంచెత్తుతున్నాయి. కేరళకు వరదసాయం అందించడంలో సోషల్ మీడియా క్రియాశీల పాత్ర పోషిస్తోందన్న విషయం తెలిసిందే. అయితే విరాళాల విషయంలో ఫేస్‌బుక్, వాట్సాప్‌ల్లో విపరీతంగా సర్క్యులేట్ అవుతున్న కొన్ని నకిలీ వార్తలు, కేరళ ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. ముఖ్యంగా సినీ హీరోలు, క్రికెటర్ల అభిమానులు నకిలీ పోస్ట్‌లతో జనాలను పక్కదారి పట్టిస్తున్నారు. తమ అభిమాన హీరో ఇంత సాయం చేశాడంటే.. మా హీరో ఇంత చేశాడని, నా అభిమాన క్రికెటర్ ఎవరూ చేయని సాయం చేశారని ఫేక్ న్యూస్ సృష్టిస్తున్నారు. ఇవి ఆ హీరోలకు కూడా పెద్ద తలనొప్పిగా మారాయి. నిజానికి వారు చేసే సాయానికి.. అభిమానులు ప్రచారంలో చెబుతున్న దానికి పొంతనే లేకుండా పోతుంది. ఇది వారి అభిమాన హీరోల పరువుతీస్తోంది. స్వయంగా వాళ్లే మీడియా ముందుకు వచ్చి ఎంత సాయం చేశానో చెప్పేలా ఉందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. (చదవండి: కేరళ వరదలు : కదిలిన టాలీవుడ్)
అలాంటి కొన్ని వార్తలు..
టీమిండియా కెప్టెన్ విరాట్ రూ.80 కోట్ల ఆర్థిక సాయం.. చేశాడంటూ ఓ పోస్ట్ ఫేస్‌బుక్, వాట్సాప్‌ల్లో చక్కర్లు కొడుతోంది. నిజానికి కోహ్లి కేరళ సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి సాయం ప్రకటించలేదు. కేరళ ప్రజలు ధైర్యంగా ఉండాలని, అక్కడ సేవలందిస్తున్న ఎన్టీఆర్‌ఎఫ్, భద్రతా బలగాలకు హ్యాట్స్‌ఫ్ అంటూ ఒక ట్వీట్ మాత్రమే చేశాడు.
బాలీవుడ్ నటి సన్నీలియోన్ రూ. 5కోట్లు ఆర్థిక సాయం, టాలీవుడ్ హీరో ప్రభాస్ రూ. కోటి రూపాయలు, తమిళ హీరో విజయ్ రూ.14 కోట్లు, జనసేన అధ్యక్షుడు రూ.2 కోట్లు ప్రకటించినట్లు వారి అభిమానులు పోస్ట్ చేస్తున్నారు. నిజానికి ప్రభాస్ రూ.25 లక్షలు సాయం చేయగా.. తమిళ హీరో విజయ్ రూ.70 లక్షల విరాళం ప్రకటించారు. ఇక పవన్ కల్యాణ్, సన్నీలియోన్‌లు మాత్రం ఇప్పటి వరకు అధికారికంగా తమ సాయన్ని ప్రకటించలేదు. ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డ్ రూ. 77 కోట్ల విరాళం ప్రకటించాడని కూడా ఓ వార్తను సృష్టించారు. నిజానికి రోనాల్డో విరాళం ఏమో కానీ కనీసం వరదలకు సంబంధించిన ట్వీట్ కూడా చేయలేదు. ఇలా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, క్రికెట్, టెన్నిస్, ఫుట్‌బాల్ స్టార్ల అభిమానులు ఒకరిని చూసి మరొకరు తమ హీరో గొప్పంటే.. తమ హీరో గొప్ప అని ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment