తిరువనంతపురం: కేరళలోని ఎర్నాకులం ఎంపీ హిబీ ఈడెన్ భార్య ఫేస్‌బుక్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, పెద్ద ఎత్తున వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. విధిని అత్యచారంతో పోలుస్తూ.. మంగళవారం ఆమె చేసిన వ్యాఖ‍్యలు దుమారాన్ని లేపాయి. ‘విధి అత్యాచారం వంటిది, మీరు దానిని అడ్డుకోలేకపోతే.. ఆస్వాదించడానికి ప్రయత్నించండి' అంటూ ఆమె వేసిన జోక్ చెత్తగా ఉందంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ పోస్టుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో ఎంపీ భార్య తన వివాదాస్పద పోస్టును తొలగించారు. అంతేగాక తాను చేసిన వ్యాఖ‍్యలకు వివరణ ఇస్తూ.. మలయాళంలో క్షమాపణలు తెలిపారు.
వివరాల్లోకి వెళితే.. ఎర్నాకులం ఎంపీ భార్య అన్నా లిండా ఈడెన్.. కుండపోత వర్షాలు కొచ్చిని ముంచెత్తుతున్న తరుణంలో తమ పిల్లాడు ఇంట్లో సురక్షితంగా ఉన్నాడన్న వీడియోతో పాటు.. భర్త హిబీ ఈడెన్ డెజర్ట్ ఆస్వాదిస్తున్న వీడియోలను పోస్ట్ చేశారు. అయితే ఈ పోస్ట్‌లకు ఆమె జత చేసిన వ్యాఖ్యలతో వివాదం రాజుకుంది. ఈ క్రమంలో అన్నా చేసిన పోస్టుకు స్పందించిన నెటిజన్లు.. రేప్ జోక్‌లు వద్దని, ఇటువంటి వ్యాఖ్యలు అత్యాచార బాధితులు, వారి కుటుంబాలను ఇబ్బంది పెట్టేలా ఉన్నాయని చురకలు అంటించారు. దీంతో తన పోస్టును వెనక్కు తీసుకున్న ఆమె.. ఎవరినీ కించపరిచే ఉద్దేశం తనకు లేదని, తాను చేసిన పోస్టును తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment