ముంబై : సాధరణంగా మొబైల్, వాలెట్ వంటివి పోతే దొరకడం చాలా కష్టం. మన అదృష్టం బాగుంటే తప్ప తిరిగి మన చేతికి రావు. క్రెడిట్ కార్డు, ఏటీఎం కార్డులు అన్ని ఆ వాలెట్‌లోనే ఉంటాయి. దొరికితే బాగుండని.. దొరకాలని కోరుకుంటాం. మనం కోరుకున్నట్లు జరిగితే.. ఇదిగో ఇలా ప్రచారం చేస్తాం. ట్విటర్ యూజర్ దర్థ్ సియర్ర తాను కలిసిన ఓ నిజాయితీపరుడైన క్యాబ్ డ్రైవర్ గురించి ట్విటర్ ద్వారా ఎంతో మందికి పరిచయం చేశాడు. ప్రస్తుతం ఈ స్టోరీ తెగ వైరలవుతోంది. ఐదు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన గురించి దర్థ్ సియర్ర ఇలా చెప్పుకొచ్చాడు.
‘ఈ నెల 10న నా పుట్టిన రోజు సందర్భంగా నేను, నా భార్య పబ్‌కు వెళ్లి ఎంజాయ్ చెద్దామని భావించాము. అందుకోసం ఓలా క్యాబ్ బుక్ చేశాం. మిని హుండాయ్ ఎక్సెంట్ మా కోసం వచ్చింది. దాని డ్రైవర్ అసిఫ్ ఇక్బాల్ అబ్దుల్ గఫర్ పథాన్. మా ప్రయాణం ప్రారంభమైన కాసేపటికి వర్షం ప్రారంభమైంది. దాంతో పథాన్ తన భార్యకు ఫోన్ చేసి.. పిల్లలన్ని బయకు పంపకుండా ఇంట్లోనే ఉంచి జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. ఆ తర్వాత మేం కబుర్లు చెప్పుకుంటూ మా ప్రయాణాన్ని కొనసాగించాం. వర్షం కారణంగా ట్రాఫిక్ దారుణంగా ఉంది. ఎలాగో అలా మేం వెళ్లాల్సిన పబ్‌కు చేరుకున్నాం. తర్వాత స్నేహితులను కలిసి పిచ్చాపాటి ప్రారంభించాం. ఓ గంట గడిచిన తర్వాత నా వాలెట్ మిస్సయిందని గుర్తించాను’ అన్నారు దర్థ్ సియర్ర.
‘ఓ నిమిషం పాటు నాకు కాళ్లు చేతులు ఆడలేదు. దాంతో క్యాబ్‌లో మర్చిపోయానేమో అని భావించి పథాన్‌కు కాల్ చేశాను. అతను చెప్పిన సమాధానం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. నేను నా వాలెట్‌ను క్యాబ్‌లోనే మర్చిపోయానని.. అది గమనించిన పథాన్ దాన్ని తీసి భద్రం చేసినట్లు చెప్పాడు. అంతేకాక ఇంటికి వెళ్లేటప్పుడు.. నన్ను కలిసి వాలెట్ తిరిగి ఇవ్వాలని అనుకున్నట్లు చెప్పాడు. చెప్పడమే కాక సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వెళ్లేటప్పుడు నా దగ్గరకు వచ్చి వాలెట్ ఇచ్చాడు. అంతేకాక పుట్టిన రోజు శుభకాంక్షలు కూడా తెలియజేశాడు. నా పుట్టిన రోజు నాడే తన పుట్టిన రోజు కూడా కావడం నిజంగా అద్భుతం. అలా విషాదంగా ముగియాల్సిన నా పుట్టిన రోజు కాస్త పథాన్ నిజాయితీ వల్ల నా జీవితంలో మర్చిపోలేని రోజుగా మిగిలిపోయింది’ అన్నారు దర్థ్ సియర్ర.
‘ఈ సోషల్ మీడియా వేదికగా మనం కోపాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేస్తూంటా. కానీ మంచి విషయాలను కూడా ఈ వేదిక మీదగా షేర్ చేసుకుందాం. దీని వల్ల కొందరైనా ప్రేరణ పొందుతారు’ అంటూ దర్థ్ సియర్ర ట్వీట్ చేసిన ఈ స్టోరీకి జనాలు ఫిదా అయి పోయారు. క్యాబ్ డ్రైవర్ నిజాయితీని తెగ మెచ్చుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment