తమిళసినిమా: సినిమాలపై అసహ్యం కలిగితే మళ్లీ ఎలా ఇక్కడ? అంటోంది నటి కాజల్ అగర్వాల్. ఏమిటీ ఈమె గొడవ అనిపిస్తుందా? ఉత్తరాది నుంచి వచ్చిన కథానాయికల్లో ఒకరు కాజల్‌అగర్వాల్. మొదట్లో చాలా మంది హీరోయిన్ల మాదిరిగానే ఒడిదుడుకులు ఎదుర్కొన్నా, ఆ తరువాత కోలీవుడ్, టాలీవుడ్‌ల్లో కథానాయకిగా నిలదొక్కుకుని ప్రస్తుతం అగ్ర కథానాయికల్లో ఒకరిగా రాణిస్తున్నారు. తన భవిష్యత్ ప్రణాళికల గురించి ఈ బ్యూటీ ఏం చెబుతుందో చూద్దాం. నేను సినిమాలకు దూరం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదంతా వదంతే. ప్రస్తుతం నా చేతిలో చాలా చిత్రాలు ఉన్నాయి. ప్రస్తుతానికి నటనకు దూరం అవ్వాల్సిన అవసరం లేదు. అయితే కథానాయకిగా ఎక్కువ కాలం కొనసాగడం సాధ్యం కాదు. ఒక దశలో అవకాశాలు తగ్గిపోతాయి. ఇక్కడ హీరోల్గాగ హీరోయిన్లు ఎక్కువ కాలం రాణించలేరు. కొన్ని చిత్రాలతోనే ఇంటి ముఖం పట్టే హీరోయిన్లు అధికం. నాకూ రానురాను అవకాశాలు తగ్గుతాయి.
సినిమాను వదిలిపోవలసిన పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలన్న ఆలోచన ఇప్పటి నుంచే తలెత్తుతోంది. సినిమా నిరంతర వృత్తి కాదు. ఇక్కడ అనుకున్నది జరగదు. అందుకే వేరే వృత్తిని ఎంచుకోవాలనుకుంటున్నాను. నటిగా అవకాశాలు తగ్గితే నిర్మాతగా మారవచ్చుగా అని కొందరు స్నేహితులు సలహా ఇస్తున్నారు. సినిమాపై ఏహ్యాభావం కలిగితే మళ్లీ నిర్మాతగా చిత్రాలు ఎలా నిర్మించగలను. సినిమాకు దూరం అవ్వాల్సిన పరిస్థితి వస్తే మళ్లీ సినిమాల గురించి ఆలోచించను. మొత్తంగా వదిలేయడమే. అందుకే వ్యాపారంపై దృష్టి సారించాలని నిర్ణయించుకున్నాను అని కాజల్ చెప్పుకొచ్చింది. విజయ్, అజిత్ ఇద్దరితో నటించారు వారి గురించి చెప్పమనగా, వారిద్దరూ నాకు ఇష్టమైన నటులు. విజయ్ చాలా ప్రతిభావంతుడు. నటుడిగా చాలా శ్రమిస్తారు. ఎంత కష్టమైన సన్నివేశాన్నైనా ఈజీగా చేసేస్తారు. ఇక అజిత్ దర్శకుడి నుంచి లైట్‌మ్యాన్ వరకూ అందరితోనూ స్నేహంగా మెలుగుతారు. సహ నటీనటులకు సాయం చేస్తారు అని కాజల్ బదులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment