తమిళసినిమా: నటుడు కార్తీ మరోసారి పల్లెబాట పట్టారు. ఆయన గ్రామీణ నేపథ్యంలో నటించిన కొంబన్ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత నగర నేపథ్యంలో సాగే కథలను ఎంచుకుని నటిస్తున్న కార్తీ తాజా చిత్రం ధీరన్ అధికారం ఒండ్రు మంచి సక్సెస్‌ను సాధించింది. ప్రస్తుతం ఆయన తన అన్నయ్య సూర్య 2డీ ఎంటర్‌టెయిన్‌మెంట్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. దీనికి పసంగ పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ముగ్గురి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తొలి చిత్రం ఇదే. ఇందులో కార్తీకి జంటగా బాలీవుడ్ బ్యూటీ సాయేషాసైగల్ నటిస్తుండగా సత్యరాజ్, సూరి, నటి ప్రియ భవానీశంకర్, భానుప్రియ, మౌనిక ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. దీనికి కడైకుట్టి సింగం అనే టైటిల్‌ను నిర్ణయించారు.
ఈ చిత్రం తెలుగులోనూ విడుదల కానుంది. తెలుగులో చినబాబు అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను నటుడు సూర్య పొంగల్ పండుగ సందర్భంగా 14వ తేదీన విడుదల చేశారు. ఆ పోస్టర్‌లో కార్తీ ఎర్రచొక్కా, గళ్ల లుంగీ కట్టి, తలపాగా చుట్టి మోపెడ్ బండిలో స్టైలిష్‌గా కూర్చున్న దృశ్యం ఆయన అభిమానుల్ని ఖుషీ చేస్తోంది. ఈ చిత్రం నెడువాసల్ గ్రామంలో హైడ్రోకార్బన్ సమస్య ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కుతున్నట్లు సమాచారం. పుదుకోట్టై నేపథ్యంలో సాగే ఈ చిత్ర షూటింగ్ తొలి షెడ్యూల్‌ను ఇటీవలే తెన్‌కాశీ పరిసర ప్రాంతాల్లో పూర్తి చేశారు. దీనికి డి.ఇమాన్ సంగీత బాణీలు కడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment