సూర్య ,కార్తీ ,విశాల్
సాక్షి సినిమా: ప్రస్తుతం కోలీవుడ్‌లో జరుగుతున్న సమ్మె మలుపునకు కారణమైందనే చెప్పాలి. ఇటీవలే రాజన్ అనే నిర్మాత అగ్రనటి నయనతార సహాయకులకవుతున్న ఖర్చుపై త్రీవంగా విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఆమె సహాయకుల వేతనాలే రోజుకు రూ.60 వేలు అవుతుందని మండిపడ్డారు. ఇది చాలామందిని ఆలోచనలో పడేసిందనే చెప్పాలి. ఇలాంటి తరుణంలో ఇటీవల నిర్మాతల మండలికి, నడిగర్‌సంఘం కార్యవర్గాల మధ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రస్తుతం జరుగుతున్న సమ్మె, తదితర అంశాలపై చర్చ జరిగింది. నిర్మాతలకు మంచి జరుగుతుందంటే సమ్మెను కొనసాగించడం సబబేనన్న అభిప్రాయాన్ని అందరూ వ్యక్తం చేశారు.
అదే విధంగా నటీనటుల పారితోషికాలు, వారి సహాయకుల వేతనాలకు సంబంధించిన విషయం చర్చకు వచ్చింది. నటీనటులు పారితోషికాలను తగ్గించుకోవాలని, వారి సహాయకులకు కూడా ఇకపై ఫెఫ్సీ సభ్యులకు ఇచ్చే విధంగా బేటాలు మాత్రమే నిర్మాతలు చెల్లిస్తారనే నిర్ణయాన్ని నిర్మాతల మండలి తీసుకుంది. ఆ సమావేశంలో నడిగర్‌సంఘం తరఫున పాల్గొన్న నటుడు సూర్య ఇకపై తన సహాయకులకు వేతనాలను తానే చెల్లించుకుంటానని తెలిపారు. వెంటనే ఆయన సోదరుడు, నటుడు కార్తీ కూడా అదే విధంగా స్పందించారు. నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ కూడా వారికి మద్దతుగా నిలిచారు. అయితే నటీనటుల పారితోషికాల విషయం మాత్రం వారి మార్కెట్‌కు తగ్గట్టే ఉంటుందనే అభిప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమైంది. ఇది ఆహ్వానించదగ్గ విషయమే కానీ, ఇతర నటీనటుల నుంచి ఈ విషయమై ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment