
ప్రముఖ దర్శకుడు శంకర్ వారసురాలు అదితి శంకర్ విరుమాన్ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయిన విషయం తెలిసిందే. నటుడు కార్తీతో జతకట్టిన ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. దీంతో అదితి శంకర్‌కు అవకాశాలు వరుస కడుతున్నాయి. విరుమాన్ చిత్రం తర్వాత శివకార్తికేయన్ సరసన మావీరన్ చిత్రంలో నటించారు. ఆ చిత్రం విజయవంతం అయ్యింది. ప్రస్తుతం దివంగత నటుడు మురళి రెండో కొడుకు మురళీ ఆకాశ్‌తో జత కడుతున్నారు.
విష్ణువర్ధన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నిర్మాణ దశలో ఉంది. కాగా త్వరలో నటుడు సూర్య సరసన నటించడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తొలుత కార్తీతో నటించిన అదితి శంకర్ తదుపరి ఆయన అన్నయ్యతో జత కట్టనున్నారన్నమాట. అయితే సూర్య సరసన నటించే విషయమై ఇంకా అధికారిక ప్రకటన రాలేదన్నది గమనార్హం. ఇలాంటి పరిస్థితుల్లో అదితి శంకర్‌ను తాజాగా మరో అవకాశం వరించింది.
శ్రీవారి ఫిలిం పతాకంపై పి రంగనాథన్ నిర్మిస్తున్న చిత్రంలోని నటుడు అధర్వ మురళి కథానాయకుడుగా నటించనున్నారు. దీనికి ఎం రాజేష్ దర్శకత్వం వహించనున్నారు. ఇందులో అదితి శంకర్ కథానాయకిగా నటించనున్నట్లు చిత్రవర్గాలు అధికారికంగా ప్రకటించారు. దీని గురించి మీడియాతో నటుడు అధర్వ పేర్కొంటూ శ్రీవారి ప్రిలిమ్స్ సంస్థ అధినేత పి రంగనాథన్ చిత్ర పరిశ్రమలో ఎంతో అనుభవం గడించిన నిర్మాత, పంపిణీదారుడు అని అన్నారు.
ప్రేక్షకులకు నచ్చేలా చిత్రాలను నిర్మించడంలో ఈయనకు అందేవేసిన చెయ్యి అని అన్నారు. అలాంటి నిర్మాత వద్ద పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. మంచి జనరంజకమైన కథనం ఎంపిక చేసి, అందుకు అవసరమైన ఖర్చు పెట్టడంలో ఆయనకు ఆయనే సాటి అని పేర్కొన్నారు.
దర్శకుడు ఎం రాజేష్ దర్శకత్వంలో పి రంగనాథన్ నిర్మిస్తున్న చిత్రంలో తాను నటించడం గర్వంగా భావిస్తున్నట్లు నటుడు అధర్వ మురళి పేర్కొన్నారు. మంచి ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాలను ఆశించే ప్రేక్షకులకు ఈ చిత్రం కచ్చితంగా నిరాశ పరచదనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. లేకపోతే విష్ణువర్ధన్ దర్శకత్వంలో మురళీఆకాష్ సరసన నటిస్తున్న నటి అదితి శంకర్ ఇప్పుడు ఆయన అన్నయ్య అధర్వ మురళితో జతకట్టబోతున్నారన్నమాట.