ఆఫీసులో పనిలేదు. నేను ఒంటరిగా ఖాళీగా కూర్చుని కిటికీ బయటకు చూస్తున్నాను, అన్యమనస్కంగా. నా మనసు తేలిక పడినట్టనిపించింది. ఎంతో సంతోషంగా వుంది. అకారణంగా ఉల్లాసపడుతోంది మనసు. గాలి మధురంగా సుతిమెత్తగా వీస్తూంది. మనసు దూది పింజెలా గాలిలో తేలిపోతోంది. ఏవిటీ విచిత్రం? వసంత ఋతువు వచ్చేసిందా? ఇంత తొందరగానా? జనవరిలోనే వసంతమా? తొందరేమిటి? మకర సంక్రాంతి వచ్చేసింది గదా? ఇరవయ్యో తారీఖున వసంత పంచమి, అరె, నిజమేనా ఐతే వసంతం వచ్చేసింది!
కిటికీ లోంచి చూస్తుంటే తోటలోని ఓ మామిడి చెట్టు పూతమీద వుందని తెలుస్తూంది. నేను కిటికీ దగ్గరకు వెళ్లి నిలబడ్డాను. నాకు హుషారుగా ఉంది. చేతులు నలుపుకుంటూ ఆలోచించాను, సాయంత్రం యింటికి వెడుతుంటే ఏం తీసుకువెళ్లాలా అని. మల్లెపూలు తీసుకు వెడితే బాగుంటుంది. రాత్రంతా మొత్తం యిల్లంతా మల్లెల గుబాళింపుతో మత్తెక్కిపోతుంది. ఛ.. నాకు మతి గాని పోయిందా? ఏభై అయిదేళ్ల వయసులో ఈ ఆలోచనలేమిటి? కిటికీలు లేని వంట యింట్లో ఉడుకుతూన్న మాంసం వంటకాల వాసనతో నిండివుండే యింట్లో – ఎపుడు ఏ ఋతువు మారుతుందో తెలుస్తుందా? పిల్లల జంఝాటంలో వుండే ఆమెకు మల్లెలు ముడిచే తీరికా కోరికా ఎక్కడ? అటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా, చక్కగా బఠానీ, కాలీఫ్లవరూ తీసుకు వెడితే మంచిది.
∙∙
అంతలో తలుపు తోసుకు లోపలికి వచ్చి వార్తనందించారు స్టాఫు.‘‘అయ్యా! త్వరగా రండి. ఢిల్లీ డైరెక్టరేటు నుంచి మీకు ఫోనొచ్చింది. డైరెక్టరుగారు లైన్లో ఉండి, సేనాపతిగారిని పిలు– అంటున్నారు.’’ నా పేరు నిశాకర సేనాపతి. ప్రభుత్వంలో డెప్టీ డైరెక్టరుగా పనిచేస్తున్నాను. రిటైరవ్వడానికి యింకా రెండు సంవత్సరాల నాలుగు మాసాలు బాకీ వుంది.‘‘ఢిల్లీ నుంచా? నన్నెవరు పిలుస్తారు? అరె, ఆ కాల్ మరెవరిదో అయివుంటుందయ్యా!’’‘‘ఔన్సార్! మీకే ఫోన్..’’ ఢిల్లీ నుంచి నన్నెవరు పిలుస్తారు? అందులోనూ డైరెక్టరుగారు స్వయంగా ఫోను పట్టుకుని పిలుస్తున్నారు కాబట్టి వెళ్లక తప్పదు. మరో దారిలేదు.నేను మా డైరెక్టరుగారి గదిలోకి ప్రవేశించగానే డైరెక్టరుగారు అప్రయత్నంగానే కుర్చీలోంచి సగం లేచి నుంచున్నారు. నేనంటే ఆయనకొక ప్రత్యేకమైన గౌరవభావం ఉంది. ఆయన ప్రతీ మాటలో, కదలికలో అది ఇలా తొంగి చూస్తూ ఉంటుంది.
‘‘అహుజా గారు మిమ్మల్ని పిలుస్తూ లైన్లో ఉన్నారు’’అహుజా?నేను ఫోనులో ‘‘సేనాపతి స్పీకింగ్’’అటువైపు నుంచి అట్టహాసంగా నవ్వు వినిపించింది. – ‘‘అబె స్పీకింగ్ క్యా బోయ్.. మై జాన్ బోల్ రహా హూ...’’హఠాత్తుగా ముప్ఫై సంవత్సరాల క్రిందటి స్ఫురద్రూపం గుర్తుకొచ్చింది. నన్ను నేను మర్చిపొయి ‘‘అబె తూ జాన్ బోల్‌రహా హై? కహాసే?’’ఫోన్ పెట్టేసి నేను చూస్తుంటే డైరెక్టర్‌గారు నిలబడే ఉన్నారు. ఆయన ప్రక్కన మరో ముగ్గురు ఆఫీసర్లు నిలబడి ఉన్నారు. ముఖ్యమంత్రిగారు స్వయంగా వాళ్లను పంపించారు. చీఫ్ సెక్రెటరీగారు ఆజ్ఞాపించగా వారు వచ్చారు.‘‘అయ్యా! నమస్కారం ఢిల్లీ నుంచి వార్త వచ్చింది, ఆహుజా సాబ్ వస్తున్నారని. ఆయనతో మరో ఏడుగురు అధికార్లు కూడా వస్తున్నారు. ముగ్గురు ఆఫీసర్ల కోసం హోటలు ఓబెరాయ్‌లో రూములు బుక్ చేశాం. కానీ అందులో ఒకరు యిక్కడ తమ స్నేహితుల యింట్లో ఉంటామంటున్నారు.’’
‘‘నిశాకర్ బాబు. అహుజాసాహెబ్ మంచి స్నేహితులండి.’’ డైరెక్టరు గారు కలగజేసుకుని చెప్పేరు.‘‘కూర్చోండి సార్!’’ అంటూ ఆ వచ్చిన అధికార్లు నాకోసం ఒక కూర్చీని దగ్గరగా లాగేరు. నేను కూర్చునే వరకూ అంతా నిలబడే ఉన్నారు.డైరెక్టరుగారు బెల్ కొట్టి కాఫీ ఆర్డరు ఇచ్చి, నా గుణవర్ణనను సాగించేరు. ఈ వుదయం నేనొక ఫైలు విషయం మీద మాట్లాడాలనుకుని వచ్చి తిరిగి వెళ్లిపోయాను. కారణం డైరెక్టరుగారు అప్పుడు కాళ్లు బార జాపుకుని అమెరికాలో వున్న వాళ్ల అమ్మాయితో కష్టసుఖాలు మాట్టాడుకుంటున్నారు.
‘‘మీకు మరే రకమైన ఇబ్బంది వుండదు. నిశాకర్‌బాబు అహుజా సాహెబ్‌కి కొద్దిగా నచ్చచెబితే సరిపోతుంది. మీరా రకంగా నిశాకరబాబు గారికి చెప్పండి.’’
‘‘విషయం ఏవిటంటే సార్.. అహుజా సాహెబు కీలక వ్యక్తి. ఆయన ఎలా చెబితే అలా జరుగుతుంది. మేం వరదల గురించి ఒక నివేదికను పంపేము. ఆ తర్వాత లెక్క జూస్తే మేం ఇచ్చిన ఫిగరు సరికాదని తేలింది. అన్ని హెడ్స్ క్రిందా డిస్ట్రిబ్యూట్ చేయడానికి బొత్తిగా చాలడంలేదు. అందువల్ల కనీసం ఎంత లేదన్నా మరొక పదికోట్లు పెంచాల్సి వుంటుంది. ఈ విషయం అహుజాగారికి చెప్పడానికి ఎవరికి సాహసం రావడం లేదు. అలా చెప్పిన వాడిని అహుజాగారు నమిలి మింగేస్తారని వాళ్ల భయం. గతంలో ఒకసారి ఆ రుచి చూసిన వాళ్లే వీరంతా.’’
‘‘సామల్ బాబూ! మీరుండండి. సార్‌కి నేను వివరంగా చెబుతాను. అదేం లేదు సార్! అహుజా సాహెబు మీకు సన్నిహితులు. మా రివైజ్డు ఎస్టిమేటునొకసారి చూడమని చెప్పండి చాలు. నేను మీకు ఆ కాపీని యిస్తున్నాను. దానిని మీరాయనకు చూపించండి. చూస్తేచాలు ఆయనకు విషయం అర్థం అవుతుంది. ఒక వేళ ఏదైనా అడగాలనుకుంటే, నేను.. అంటే నిరంజన్ ఖుంతియా అక్కడే హాజరుగా వుంటాను.’
డైరెక్టరు అన్నారు ‘‘సార్ తమరు స్వయంగా వెళ్లకపోతే..’’‘‘ఉండండీ, మీకేం తెలుసు? నేను లేకపోతే అహుజా గారిని ఫేస్ చెయ్యలేరు. తర్వాత నాకేసి చూసి ‘‘అలా అయితే నడవండి సార్ ముందుగానే అంతా చూసి, మొత్తం ప్రోగ్రాం సిద్ధం చేసి ఉంచుదాం!’’నేను మా డైరెక్టరుగారి అనుమతి కోసం అడిగాను – ‘‘సార్ నేను వెళ్లనా?’’‘‘సార్! వెళ్లండి సార్! ఇది దేశం పని కదా?’’నాకు నమ్మబుద్ధి కావడం లేదు. బహుశా ఆయన వెళ్లమన్నది ఖుంతియా బాబునేమో! నాకు కాళ్లు తేలిపోతున్నట్టు అనిపించాయి. నన్ను వాళ్లు గాలిలో ఎక్కడికో నడిపిస్తున్నారనిపించింది.ఒబెరాయ్‌లో కూర్చోబెట్టి వాళ్లు తర్ఫీదు యిస్తుంటే, నేను గుడ్లగూబలా చూస్తూ అన్నింటికి ఔనంటూ ఉండాలన్న మాట.
ఖుంతియా అన్నారు – ‘‘సార్, నేను మీ అనుమతి లేకుండా డిన్నర్ కోసం ఆర్డరిచ్చాను’’ ‘‘ఐయామ్ సారీ! నేను కొంచెం ముందుగా వెళ్లకుంటే రేపటికోసం ఏర్పాట్లు జరగవు!’’ ‘‘ఔను.. ఆ మాట నిజమే’’ అన్నారు సామల్.ఖుంతియా కోపంగా అన్నారు – ‘‘హాత్, ఆ మాటా నిజమే! మనం వుండగా సార్ ఏర్పాట్లు చేయాలా? సార్! ఏమేం ఏర్పాటు చెయ్యాలో చెప్పండి. మేం చేస్తాం. రేపు లంచ్ యిక్కణ్ణుంచే తీసుకువెడితే ఎలా ఉంటుంది సార్? అంటే అహూజా సాబ్‌గారి ఇష్టాయిష్టాలు ప్రకారం.. కావలసినవన్నీను.’’
‘‘సార్‌ని యివన్నీ అడగడవేవిటి? మనం మొత్తం ఫ్యామిలీ కోసం తీసుకుంటాం. ఇంట్లో తయారైనట్లుగానే ఉంటాయి వంటకాలు. హోటల్ తిండిలా వుండనే ఉండదు. ఇవాల్టి నుంచి 5271 వెహికలు సార్ నిమిత్తం మూడురోజుల పాటు ఉంచండి. ఎగ్జిక్యూటివ్ యింజనీరు బిస్వాల్‌గారికి చెప్పండి. జీప్‌తో పాటు మరో యిద్దరు స్టాఫ్‌తో డ్యూటీలో సిద్ధంగా ఉండమని.’’నేను తాపీగా దృఢ స్వరంతో అన్నాను – ‘‘మీరు నన్ను కాస్తంత మా యింటి దగ్గర డ్రాప్ చెయ్యగలరా? అంతకన్నా మీరేం చెయ్యనక్కర్లేదు. తర్వాత రేపు ఏరోడ్రోమ్‌కి వెళ్లే ముందు నన్ను పికప్ చేస్తే చాలు, మీకు వీలయితే. లేకపోయినా ఫరవా లేదు. నా ఏర్పాట్లు నేను చేసుకుంటా.’’‘‘సార్! మీకు కోపం వచ్చిందనుకుంటాను. మా ఉద్దేశం అదికాదు! నేను సార్‌ని యింటి దగ్గర డ్రాప్ చేసి వస్తాను.’’‘‘అవసరం లేదు. మీరు మీ ఏర్పాట్లు చూసుకోండి. రానున్న యేడుగురు అధికార్లకూ కావాల్సిన ఏర్పాట్లు చేసుకోండి.
డ్రయివరుకి చెబితే అతను నన్ను డ్రాప్ చేసి వస్తాడు.’’5271 వెహికలు డ్రయివర్ని పిలిపించి ఖుంతియా చెప్పారు – ‘‘అరె సుదామ్! నువ్వు సార్ దగ్గర డ్యూటీలో ఉండు. బన్వారీ నుంచి నీకు కావాల్సిన పెట్రోలు తీసుకో!’’ నేను కార్లో కూర్చుని ఆలోచించాను.‘జ్ఞాన్ ప్రకాష్ అహూజా! నువ్వెంతగా ఎదిగిపోయేవు? ఇంత పవరుందా నీ చేతిలో? నిన్ను నా యింట్లో ఉంచుకోవడమంటే మహాప్రభువుని యింట్లో ఉంచుకున్నట్టేను. ఇవాల్టి నుంచే వీళ్లంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. రేపు ఏమవుతారో ఏమిటో?’‘‘సుదామ్! కొంచెం అలా బజార్లోకిపోనీ!’’
నిర్జన రాస్తాలో అదే చల్లని గాలి మెలమెల్లగా వీస్తూంది. ఆ ఎదురుగా రెక్కలు చాచుకున్న నీలాకాశం. కాలి ఫ్లవరు, బఠాణీ, టమాటా, కొద్దిగా కొత్తిమీర తీసుకున్నాను. రేపు రోజే వేరు. రేపు యిల్లంతా శుభ్రపరచుకోవాలి.మంచి ఉత్సాహంగా యింట్లోకి అడుగుపెట్టి, మాటల మధ్యలో అహూజా రాక గురించి చెప్పేను. ఢిల్లీ నుంచి ఎవరొస్తున్నారో మా పిల్లలు ఊహించలేకపోతున్నారు. మా ఆవిడ నిర్వికారంగా కూర్చుని నేలకేసి చూస్తు అంతా వింటూంది, మాటామంతీ లేకుండా. ఉత్కంఠ ఉత్సాహం బొత్తిగా ఉండవు ఆవిడ అంతే.‘‘నువ్వేమీ మాట్లాడవేవిటి? రేపు ఏమేం కావాలో చెబితేకదా అవి ఏర్పాటు చెయ్యచ్చును.’’
‘‘ఇంకేం చెప్పమంటారు? అక్కర్లేని తద్దినాన్ని నెత్తినేసుకుని వచ్చారు. అంత పెద్దాయన్ని చర్చల కోసం మన యింటికే ఎందుకు తెస్తున్నట్టు?వాళ్లందరి మంచీ మర్యాదా ఎవరు చూస్తారు? రాత్రి యింటికొచ్చి చల్లగా వార్త చెప్పికూర్చున్నారు. ప్రొద్దున్నే తీసుకొచ్చి నా నెత్తిన కూర్చోబెడతారు. ఇవన్నీ ఎలా చెయ్యాలి? మీరేం చేసుకుంటారో చేసుకోండి. నాకు రిక్షా ఏర్పాటు చెయ్యండి. ఓ మూడురోజులు మా మావయ్య యింట్లో వుండి వస్తాను, ఎన్నిసార్లో రమ్మని చెప్పాడు.’’నాకు చెమటలు పట్టేశాయి. నిజమే, నేననుకున్నంత సులువేంకాదు అంత పెద్దవాడికి ఆతిథ్యం యివ్వడం. నేను కళ్లు తేలేసుకుని కూర్చున్నాను. పిల్లలు చల్లగా జారుకున్నారు. పెద్ద విపత్తు యేదో మీదపడనుందని వాళ్లకు అర్థమయింది.అతి కష్టం మీద ఆవిడను రాజీకి తీసుకరాగలిగేను. ఇద్దరం కూర్చుని మాట్లాడుకుంటే ప్రణాళికను తయారు చేసుకోవచ్చును.
‘‘చూడు, అహూజా ఎంత పెద్ద అధికారి అయినా అతను నాకు స్నేహితుడు. అతనికి అంటూ ప్రత్యేక ఏర్పాట్లు యేమీ చెయ్యనవసరం లేదు. నేనాలోచిస్తున్నది అతని భార్య గురించి. నా భయమంతా ఆమెకు ఎలా మర్యాదలు చేయడమా అని!’’ ∙ ‘‘వాళ్లు రాంగానే కప్పు చాయి యిస్తావు. మన యింట్లో వున్న పెద్దకప్పులు సరిపోతాయా?’’‘‘ఎక్కడ కూర్చోబెట్టాలి? సోఫాదిళ్ల అవస్థ ఎలా వుందో చూస్తున్నారా? నేను ఎన్నిసార్లో మీకు చెప్పాను, విన్నారు కాదు. ఇప్పుడు మన దరిద్రమంతా బయటపెట్టుకోవాలి.’’
‘‘ఇంకా వినండి. వాళ్లు డైనింగు టేబిలుకి అలవాటుపడ్డవాళ్లు. మన టేబిలుకి ఒక కాలు లేదు. దాన్ని తీసుకొచ్చిన రోజు నుంచి దాని మీద అక్కర్లేని వస్తువులన్నీ పెట్టాం. క్రిందపెట్టెలూ. కుర్చీలు ఏనాడో విరిగి మూలన పడ్డాయి. పిల్లలు డైనింగ్ టేబిలు కావాలంటూ ఎప్పట్నుంచో చెబుతున్నారు, విన్నారా మీరు? ఇప్పుడు క్రింద పీటలు వేసి కూర్చోబెడతారా? పోనీ ఆ పీటలయినా ఉంటేను కొంపలో?’’
నా తల తిరిగిపోయింది.‘‘భోజనంలోకి ఏం వడ్డిస్తారు? అప్పడాలు, వడియాలు, తోటకూర వేపుడూనా? వాళ్లకు యిష్టమయిన వంటకాలు ఏమిటో మీకు తెలుసా? ఒక వేళ తెలుసున్నా అవన్నీ వండి వార్చడానికి మనుషులేరి? నా వల్లకాదు. ఎందులో పెడతారు? సీమవెండి కంచాల్లోనా?’’నేను కళ్లూ చెవులూ మూసుకున్నాను.
చెమటలతో నా నుదురు తడిసి ముద్దయింది. ఆవిడ మాట ప్రకారం అసంభవ కార్యక్రమం యిది. నిజంగా నాకు కోర్టులో మరణశిక్ష విధించినట్టుగా ఉంది. నేనీ రాత్రే చచ్చిపోతానా? ఉదయాన్నే అహూజా నాకు దండవేసి వెళ్లిపోతాడా? అలాగైతేనే నయం. అన్ని లోపాల్నీ దాచుకున్నట్టూ గౌరవాన్ని దక్కించుకున్నట్టూ అవుతుంది. ‘‘నా మాట విని, యేదో వంక చెప్పి వాళ్లని ఒక హోటల్లో దింపండి. ఒకసారి మన యింటికి తీసుకుని వస్తే, నేను పక్కింటి మంగతాయారు యింటి నుంచి కప్పులూ, ప్లేట్లూ పట్టుకొచ్చి టీ బిస్కెట్లు యిచ్చి సాగనంపుతాను.’’నా గొంతుక ఎండిపోయింది. అతి కష్టం మీద నా మనసులోని మాట చెప్పేను.‘‘వాళ్లు మన యింట్లో ఉంటారు.’’ ‘‘ఏవిటీ? ఇక్కడ ఉంటారా? ఎక్కడుంటారు? డాబాపైనా? మెట్లమీదనా? సాబ్ యిక్కడే మిగతా వారితో కలిసి వుండడమే మంచిది. మాయింట్లో వుంటే ఆయనకు యిబ్బందేను.’’
‘‘ఆ విషయం మేం ముందే ఆలోచించాం. ఆయన వ్యవహారశైలి మేం ఢిల్లీలో చూసేం కదా? అరెబాబా! ఎంత టిప్ టాప్ ఆఫీసరు? కాస్తంత తేడా వస్తే తినేస్తాడు. ఆయనతో వ్యవహారం మాటలుకాదు.’’‘‘సామల్ నీకు అర్థం కాలేదా? నీకు కామన్‌సెన్సు లేదు. సార్, మీరు మరొకలా అనుకోకండి. అతను కొంచెం తాగేడు. సార్, నేను ఊరికే కంపెనీ యిద్దామని కూర్చున్నాను. విషయం ఏవిటంటే, ఒకవేళ అహూజా సాహెబ్ మీ యింట్లో వుండేందుకు నిర్ణయించుకునే వుంటే, ఆయన రాజీపడేది ఉండదు. అహూజా గారి నిర్ణయం మారడమంటూ ఉండదు. అందువల్ల మీ యిబ్బందులు ఏవిటో చెబుతే వాటిని సవరిద్దాం.’’
‘‘ఒక యిబ్బంది అయితే చెప్పొచ్చు. అన్నీ యిబ్బంది గానే వున్నాయి. ఉండడానికి, తిండికీ, పడకకీ, స్నానానికి అన్నీ యిబ్బందులే. ఇల్లు కూడా ప్రభుత్వం వారిదేను. సీలింగు పెచ్చులూడి ఊసలు బయట పడి కనబడుతున్నాయి. తలుపులకు రంగు వేసి ఏనాడో అయింది. గోడలు నాచుపట్టి ఉన్నాయి. కిటికీలకు అద్దాలు లేవు. ాయిఖానాలో ఫ్లష్ అవుట్ లేదు. ఫ్యాను తిరగడం లేదు.’’‘‘అర్థమయింది. యు ఆర్ రైట్‌సార్! అహుజా సాబ్ అక్కడ ఉండలేరు. ఉంటే మాకు తలలు öట్టేసినట్టవుతుంది.’’సామల్ బుర్ర బరుక్కుని అన్నాడు– ఖుంతియాతో, ‘‘సార్, మీ ఇంట్లో ఉంటే యిబ్బంది ఉండదనుకుంటా.’’
ఖుంతియా ఎగిరి గంతేస్తూ అయిడియా అంటూ అరిచాడు. ‘‘ఐడియా! సామల్! ఐడియా! ఈ మూడు రోజులు సార్, తమ క్వార్టరు వదిలేస్తారు. నేను సర్క్యూట్ హౌస్‌కి వెళ్లిపోతాను. నేను ఒక్కణ్నే ఉంటున్నాను. మా ఆవిడ అస్సాం వెళ్లింది. నెల రోజుల తర్వాత గానీ రాదు. మంచి అయిడియా, తెలిసిందా సార్! మీరు మరేం ఆలోచించకుండా మా ఇంటికి మారిపోండి. అక్కడొక పని కుర్రాడిని ఫ్యూను లాగ కూర్చోబెడదాం. వాడే వంటా వార్పూ అన్నీ చేస్తాడు.’’
‘‘పిల్లలు, వాళ్ల పుస్తకాలు, మా యితరత్రా వాడుకునే సామాను వెళ్లినా ఫరావాలేదు కదా?’’‘‘నో ప్రాబ్లమ్! మూడు రోజులు మీరు ఒక పిక్నిక్‌కి వెడుతున్నారనుకోండి! ఆ విధంగా మీ సామానంతా ఓ రెండు పెట్టెల్లో సర్దుకుంటే సరి! త్వరపడండి..’’అతనికి కృతజ్ఞతలు ఎలా చెప్పాలో నాకర్థం కాలేదు– ‘‘మీ ఋణం తీర్చుకోలేను’’‘‘ఏమిటి మీరలా అంటారు? మీరు సరిగా అర్థం చేసుకోలేదు. మేం మీకోసం.. అదే అహుజా సాబ్ కోసం – యేదేనా చేయగలం!’’ఖుంతియా గారింట్లో రాత్రి ఒక గంట సమయం అటూ యిటూ తిరిగాం. మెరిసిపోయే టేబిలు, అద్దం, సోఫా, మూడు పరుపులు, పడక గదిలో డన్‌లప్ పరుపులు, ముందు గదిలో కార్పెట్టు.
పెద్ద బరువుని దించుకున్నట్లయింది నాకు. వీస్తున్న గాలి కూడా హాయి గొలుపుతూంది. కిటికీ లోంచి వస్తూన్న పూల వాసన యిల్లంతా నిండిపోయింది. వసంతపు వెల్లువ నిలువునా ముంచెత్తింది. నా శరీరం, మనసు, ప్రాణం పులకించిపోయేయి. ఇంతటి సౌభాగ్యానికి నోచుకున్న ఆనందంతో నాకు నిద్రపట్టలేదు ఆ రాత్రంతా.తెలతెలవారుతుండగానే వెచ్చటి తేనీటి వాసన మేలుకొలుపు పాడింది. పని కుర్రాడు కప్పు సాసరుతో టీని అందించాడు పడగ్గదిలో. పిల్లలు ఉత్సాహంగా తిరుగుతున్నారు యిల్లంతా. మా ఆవిడకు యిదంతా అలవాటు చేసుకునేందుకు కొంత సమయం పట్టింది.
ఇంటి చూట్టూ పెద్దతోట. తోటనిండా పూలు. ఇల్లంతా పూలవాసన. నాకు రెక్కలొచ్చినంత సంబరం కలిగింది. గాలిలో పక్షిలా తేలగలననిపించింది. పిల్లలు, బ్రెడ్డు, బట్టరు ఎగ్గు తింటూ కనిపిస్తున్నారు. వాళ్ల మొహాలు ఉదయాన్నే లేలేత ఎండకు వికసించిన మొగ్గల్లా మెరుస్తున్నాయి.ఉదయాన్నే స్నానపానాదులు ముగించుకున్న నా భార్యాపిల్లలు పెద్దింటి, కాదు గొప్పింటి గొప్ప వ్యక్తుల్లా యేదో కలలోలా చాలా సుకుమారంగా మనోహరంగా కనిపిస్తున్నారు.
అపూర్వ వసంతం యింటాబయటా లోలోపలా. ఏభైయేళ్ల మధ్యకాలంలో యిటువంటి మరచిపోలేని వసంతాన్ని అనుభవించి ఉండలేదు. నాకు తెలుసు.. ఈ వసంత ఋతువు మూడు రోజులేనని! ఇందులో కొంత దగా, కొంత మోసం, కొంత ఆత్మవంచన దాగివున్నాయని కూడా నాకు తెలుసు. ఇతరుల నాటకంలో మేం కొద్ది పాత్రలమేనని కూడా తెలుసు. కానీ వసంతానుభవం మాత్రం మి«థ్యకాదు. అయితే, మధ్యమధ్య ఎంతో కొంత అనుతాపం కూడా కలుగుతూంది కలుపుమొక్కల్లా.
దీని తరువాత ఏమైంది? అహూజ్‌సాబ్ వచ్చేరా? వెళ్లేరా? ఈ విషయాల గురించి మీరాలోచిస్తున్నారా? వాటికంత ప్రాధాన్యత ఉందా? నేను మూడు రోజులపాటు ఉచితంగా వాళ్లతో సమానంగా ధౌళి, కోణార్క్ తిరగడం, పక్షిలా ఎగిరినట్లు వేగంగా కదలడం, ముప్ఫై సంవత్సరాల గతాన్ని ఒక్క అంగలో దాటడం, సరిగ్గా ముప్ఫై సంవత్సరాల క్రిందటి చాపల్యాన్ని నా కళ్ల ముందుకు తెచ్చుకోవడం ప్రాధాన్య విషయం కాదా? మేం మాత్రం ఉద్వేగపూరిత ఉన్మత్త వసంతంలో నిమగ్నమై ఉంటిమి అన్న విషయం యదార్థం.వసంతం వెళ్లిపోయింది, మరిరాదు. కిటికీలు లేని వంటిల్లు జీవితం కూడా ముగిసిపోతున్నట్లేను.ఒడియా కథల సంకలనం ‘తరగని చీకటిరాత్రి’ సౌజన్యంతో..
Comments
Please login to add a commentAdd a comment