ఒకే రోజు 18 వికెట్లు...
ఛత్తీస్‌గఢ్ 188 ఆలౌట్
రెండో ఇన్నింగ్‌సలో హైదరాబాద్ 115/9
రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ మ్యాచ్
వల్సాడ్: హైదరాబాద్, ఛత్తీస్‌గఢ్ జట్ల మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో మూడో రోజు ఆటలో ఇరు జట్ల బౌలర్లు మెరిశారు. దీంతో ఒక్క రోజే 18 వికెట్లు నేలకూలారుు. మొదట హైదరాబాద్ బౌలర్లు సమష్టిగా రాణించడంతో ఛత్తీస్‌గఢ్ 85.1 ఓవర్లలో 188 పరుగులకే కుప్పకూలింది. అనంతరం రెండో ఇన్నింగ్‌స ఆడిన హైదరాబాద్ కూడా తడబడింది. ఆట నిలిచే సమయానికి 47 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోరుు 115 పరుగులు చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ 278 పరుగుల ఆధిక్యంలో ఉంది.
రాణించిన ఆకాశ్, మిలింద్
మూడో రోజు లభించిన పిచ్ సహకారాన్ని హైదరాబాద్ బౌలర్లు ఆకాశ్ భండారి (3/27), సీవీ మిలింద్ (3/47), సిరాజ్ (2/36), మెహదీ హసన్ (2/39) సద్వినియోగం చేసుకున్నారు. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను క్రీజులో కుదురుకోకుండా దెబ్బతీశారు. దీంతో బుధవారం 124/1 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన ఛత్తీస్‌గఢ్ అనూహ్యంగా మరో 64 పరుగులు మాత్రమే జోడించి మిగతా 9 వికెట్లు కోల్పోరుుంది. ఆట మొదలైన తొలి ఓవర్ రెండో బంతికే మిలింద్... అభిమన్యు చౌహాన్ (55)వికెట్ తీయడంతో ఛత్తీస్‌గఢ్ పతనం ప్రారంభమైంది. ఆ తర్వాత వచ్చిన వారిలో కాంత్ సింగ్ 22, అశుతోష్ సింగ్ 17, మహ్మద్ కైఫ్ 11 పరుగులు చేశారు. మిగతా బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. దీంతో హైదరాబాద్‌కు తొలి ఇన్నింగ్‌సలో 163 పరుగుల ఆధిక్యం లభించింది.
విజృంభించిన పంకజ్, అభిషేక్
ప్రత్యర్థి జట్టును కట్టడి చేసిన ఆనందంతో రెండో ఇన్నింగ్‌స ప్రారంభించిన హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ కూడా క్రీజులో నిలిచేందుకు అపసోపాలు పడ్డారు. పంకజ్ (4/37), అభిషేక్ తమ్రకర్ (4/19) క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టడంతో హైదరాబాద్ కోలుకోలేదు. ఓపెనర్ తన్మయ్ గాయం కారణంగా బెంజమిన్ థామస్ (19)తో కలిసి అక్షత్ రెడ్డి (4) ఇన్నింగ్‌స ఆరంభించాడు. అరుుతే 34 పరుగులకే ఓపెనర్లిద్దరిని పంకజ్ పెవిలియన్ చేర్చాడు. కెప్టెన్ బద్రీనాథ్ (11) సహా ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. లోయర్ మిడిలార్డర్లో భండారి (29 బ్యాటింగ్) టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. ఆట నిలిచే సమయానికి ఇతనితో పాటు రవికిరణ్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.
తన్మయ్ తలకు గాయం
హైదరాబాద్ ఆటగాడు తన్మయ్ అగర్వాల్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. మనోజ్ సింగ్ కొట్టిన పుల్ షాట్ ఫార్వర్డ్ షార్ట్ లెగ్‌లో ఉన్న తన్మయ్ తలకు బలంగా తగిలింది. వెంటనే అతడిని అంబులెన్‌సలో ఆస్పత్రికి తరలించి పరీక్షలు నిర్వహించారు. అయితే కోలుకొని తిరిగి బ్యాటింగ్‌కు వచ్చిన తన్మయ్ ఐదు బంతులాడి డకౌట్ అయ్యాడు.