బెంబేలెత్తించిన మిలింద్, రవికిరణ్
ఆంధ్ర 190 ఆలౌట్
రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ మ్యాచ్
లక్నో: హైదరాబాద్ పేసర్లు సీవీ మిలింద్ (5/28), రవికిరణ్ (4/33) చెలరేగారు. ఆంధ్ర బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించారు. దీంతో మొదటిరోజు ఆటలోనే ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్‌స 59 ఓవర్లలో 190 పరుగుల వద్ద ముగిసింది. ప్రణీత్ (88 బంతుల్లో 63; 11 ఫోర్లు), అశ్విన్ హెబ్బర్ (63 బంతుల్లో 52; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. అకాశ్ భండారీకి ఒక వికెట్ దక్కింది. తర్వాత తొలి ఇన్నింగ్‌స ఆడిన హైదరాబాద్ ఆట నిలిచే సమయానికి వికెట్ కోల్పోకుండా 10 పరుగులు చేసింది. తన్మయ్ అగర్వాల్ (1 బ్యాటింగ్), అక్షత్ రెడ్డి (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
తడబడిన ఆంధ్ర
బుధవారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేపట్టిన ఆంధ్ర 4 పరుగుల వద్దే ఓపెనర్ శ్రీకర్ భరత్ (3) వికెట్‌ను కోల్పోయింది. అతన్ని క్లీన్‌బౌల్డ్ చేసిన రవికిరణ్ ఆంధ్ర పతనాన్ని శాసించాడు. తర్వాత మరో ఓపెనర్ ప్రశాంత్ (27), విహారి (17)తో కలిసి కాసేపు కుదురుగా ఆడారు. జట్టు స్కోరు 51 పరుగుల వద్ద రవికిరణ్ నిప్పులు చెరిగే బౌలింగ్‌తో విహారి, రికీ భుయ్ (0)లను ఔట్ చేశాడు. అదే స్కోరు వద్ద ప్రశాంత్ కూడా భండారీ బౌలింగ్‌లో నిష్క్రమించడంతో ఆంధ్ర 51 పరుగుల వద్ద 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
రాణించిన ప్రణీత్, అశ్విన్
ఈ దశలో ప్రణీత్, అశ్విన్ బాధ్యతాయుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరు అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఆరో వికెట్‌కు 91 పరుగులు జోడించిన అనంతరం 171 పరుగుల జట్టు స్కోరు వద్ద మొదట అశ్విన్‌ను రవికిరణ్ ఔట్ చేశాడు. తర్వాత రెండు పరుగుల వ్యవధిలో మిలింద్... ప్రణీత్, శివ కుమార్ (0), సీవీ స్టీఫెన్ (0)లను పెవిలియన్ పంపాడు. తర్వాత భార్గవ్ భట్ (12) కూడా మిలింద్ బౌలింగ్‌లోనే నిష్క్రమించడంతో ఆంధ్ర ఇన్నింగ్‌స 190 పరుగుల వద్ద ముగిసింది.