హైదరాబాద్ 81/5
ఆంధ్రతో రంజీ ట్రోఫీ మ్యాచ్
లక్నో: బౌలర్ల ప్రదర్శనతో తొలి రోజు ఆటలో పైచేయి సాధించిన హైదరాబాద్... బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో రెండో రోజు విలవిలలాడింది. ఆంధ్ర జట్టుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో 10/0 ఓవర్‌నైట్ స్కోరుతో గురువారం ఆటకొనసాగించిన హైదరాబాద్ ఆట నిలిచే సమయానికి 45 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. ఆంధ్ర పేసర్లు విజయ్ కుమార్ (2/18), శివ కుమార్ (2/30) టాపార్డర్ బ్యాట్స్‌మెన్‌ను వణికించారు. దీంతో క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆట నిలిచే సమయానికి అనిరుధ్ (26 బ్యాటింగ్), కె. సుమంత్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఉదయం పొగమంచు కారణంగా ఆట సాధ్యపడలేదు. దీంతో తొలి సెషన్ అంతా తుడిచిపెట్టుకుపోయింది. లంచ్ విరామం తర్వాతే ఆట కొనసాగగా... కేవలం 38 ఓవర్లే జరిగాయి.
తన్మయ్ విఫలం
గత మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్‌సల్లో సెంచరీలు సాధించిన ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (12) విఫలమయ్యాడు. అతనితో కలిసి రెండో రోజు ఆట కొనసాగించిన అక్షత్ రెడ్డి (10) మొదట పెవిలియన్ చేరాడు. ఆట మొదలైన మరుసటి ఓవర్లోనే అక్షత్‌ను విజయ్ కుమార్ ఔట్ చేశాడు. తర్వాత కెప్టెన్ బద్రీనాథ్ (5)ను పెవిలియన్ చేర్చాడు. దీంతో 21 పరుగులకే రెండు కీలక వికెట్లను కోల్పోయింది. అనంతరం కాసేపటికే శివకుమార్ బౌలింగ్‌లో తన్మయ్ క్లీన్‌బౌల్డయ్యా డు. మరో రెండు పరుగులు చేరాయో లేదో... జట్టు స్కోరు 36 పరుగుల వద్ద మళ్లీ శివ కుమార్ హైదరాబాద్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు. బావనక సందీప్ (2)నూ పెవిలియన్‌కు పంపాడు. ఈ దశలో అనిరుధ్, హిమాలయ్ అగర్వాల్ (22) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఐదో వికెట్‌కు 45 పరుగులు జోడించాక హిమాలయ్ రనౌటై వెనుదిరిగాడు. హైదరాబాద్ చేతిలో ఇంకా 5 వికెట్లుండగా... 109 పరుగుల వెనుకంజలో ఉంది.
స్కోరు వివరాలు
ఆంధ్ర తొలి ఇన్నింగ్స్: 190
హైదరాబాద్ తొలి ఇన్నింగ్‌స: తన్మయ్ (బి) శివకుమార్ 12; అక్షత్ (సి) భరత్ (బి) విజయ్ 10; బద్రీనాథ్ (సి) ప్రశాంత్ (బి) విజయ్ 5; అనిరుధ్ బ్యాటింగ్ 26; సందీప్ (సి) భరత్ (బి) శివకుమార్ 2; హిమాలయ్ రనౌట్ 22; కె. సుమంత్ బ్యాటింగ్ 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (45 ఓవర్లలో 5 వికెట్లకు) 81.
వికెట్ల పతనం: 1-11, 2-21, 3-34, 4-36, 5-81
బౌలింగ్: విజయ్ 16-8-18-2, శివకుమార్ 15-5-30-2, భార్గవ్ 5-2-15-0, స్టీఫెన్ 9-3-17-0.