ఇక నిద్రలేని రాత్రులు
ఫుట్‌బాల్ ప్రపంచకప్, బ్రెజిల్
మరో 10 రోజుల్లో
ఆకుపచ్చని అందమైన మైదానం... చుట్టూ హోరెత్తించే అభిమానులు.. ఎటూ చూసిన ఈలలు... కేరింతలు... యుద్ధానికి సిద్ధమైన ఓ సైన్యంలా ఆటగాళ్లు అలా నడుచుకుంటూ వస్తుంటే... ఎన్నడూ లేని ఉత్కంఠ... అలలా మొదలవుతూ... ప్రవాహంలా పెరుగుతూ... ఉప్పెనలా చుట్టిపడేస్తూ... యుద్ధంలా సాగే ‘సాకర్’ పండుగ వచ్చేసింది. క్షణక్షణం ఎదురుచూపులు... అనుక్షణం అప్రమత్తత... రెప్పపాటులో తారుమారయ్యే ఫలితాలు... ప్రతి జట్టుకో వ్యూహం... ప్రతి ఆటగాడికో ప్రత్యేక శైలి... పాదరసంలా కదం తొక్కుతూ... 90 నిమిషాల పాటు చేసే ఫుట్‌బాల్ విన్యాసాల కోసం భూగోళం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
32 జట్లు... 32 రోజులు... 64 మ్యాచ్‌లు... వందల సంఖ్యలో ఆటగాళ్లు... వేల సంఖ్యలో నిర్వాహకులు... లక్షల్లో అభిమానులు... కోట్లల్లో ప్రేక్షకులు...
నాలుగేళ్లకోసారి ప్రపంచాన్ని ఊపేసే
ఫుట్‌బాల్ మాంత్రికుల మాయాజాలాన్ని చూడాలంటే నిద్రకు గుడ్‌బై చెప్పాల్సిందే. మరో 10 రోజుల్లో ‘ఫిఫా’ ప్రపంచకప్ బ్రెజిల్‌లో ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం మ్యాచ్‌లన్నీ అర్ధరాత్రిపూటే ఉంటాయి. కాబట్టి భారత దేశంలో ఫుట్‌బాల్ అభిమానులకు రాబోయేవి నిద్రలేని రాత్రులే.