బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం రొమరియో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 58 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ నిర్ణయం వెనక్కు తీసుకున్నట్లు ప్రకటించాడు. స్థానిక టోర్నీలో ఉనికి కోల్పోయిన తన క్లబ్‌కు (అమెరికా ఆఫ్ రియో డి జనైరో) ఊపు తెప్పించేందుకు తిరిగి బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు. ఇదే క్లబ్‌కు రొమారియో కుమారుడు రొమారిన్హో (30) కూడా ప్రాతినిథ్యం వహిస్తుండటం ఆసక్తికరం. బ్రెజిల్ బేస్డ్ ఫుట్‌బాల్ క్లబ్ అయిన అమెరికా ఆఫ్ రియో డి జనైరోకు రొమారియో అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు.
80, 90 దశకాల్లో స్టార్ స్ట్రయికర్‌గా పేరొందిన రొమారియో 15 ఏళ్ల కిందట (2008) ప్రొఫెషనల్ ఫుట్‌బాల్‌కు గుడ్‌బై చెప్పాడు. ఆతర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి సెనేటర్‌గా పలు మార్లు ఎన్నికయ్యాడు. రొమారియో 1994 వరల్డ్‌కప్ విన్నింగ్ జట్టులో (బ్రెజిల్) కీలక సభ్యుడిగా ఉన్నాడు.
ప్రస్తుతం రొమారియో సెనేటర్‌గా ఉంటూనే తన క్లబ్‌ను కష్టాల్లో నుంచి గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్న విషయాన్ని రొమారియో ఇన్‌స్టా ద్వారా వెల్లడించాడు. అమెరికా ఆఫ్ రియో డి జనైరో తరఫున ఆటగాడిగా బరిలోకి దిగేందుకు తన పేరును రిజిస్టర్ చేసుకున్నట్లు ప్రకటించాడు. అయితే తాను ఎన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటానన్న విషయాన్ని మాత్రం రొమారియో పేర్కొనలేదు.
కాగా, బ్రెజిల్‌లో ప్రస్తుతం జరుగుతున్న రియో స్టేట్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో అమెరికా ఆఫ్ రియో డి జనైరో క్లబ్ తడబతుంది. గతమెంతో ఘనంగా ఉన్న ఈ క్లబ్ ప్రస్తుతం పేలవ ప్రదర్శనలకు పరిమితమై ఉనికి కోల్పోయింది. రియో క్లబ్‌లో ఉత్సాహం నింపి పూర్వవైభవం తెచ్చేందుకే రొమారియో తిరిగి బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment