భారత ఫుట్‌బాల్ దిగ్గజం సునిల్ ఛెత్రి 39 ఏళ్ల వయసులో అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. ఈ మేరకు .. గురువారం (మే 16) ప్రకటన విడుదల చేశాడు. తన ఇంటర్నేషనల్ కెరీర్‌లో సునిల్ ఛెత్రి మొత్తంగా 150 మ్యాచ్‌లలో 94 గోల్స్ సాధించాడు. భారత ఫుట్‌బాల్ కెప్టెన్‌గానూ సునిల్ ఛెత్రి సేవలు అందించాడు.
సునిల్ ఛెత్రి వ్యక్తిగత జీవితం గురించి కొంతమందికి మాత్రమే తెలుసు. అతడి లవ్‌స్టోరీ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. సునిల్ ఛెత్రి తన కోచ్, భారత మాజీ ఆటగాడు సుబ్రతా భట్టాచార్య కుమార్తె సోనం భట్టాచార్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
తన ప్రేమ కథ గురించి సునిల్ ఛెత్రి గతంలో హ్యూమన్స్ ఆఫ్ బాంబేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ‘‘నాకు అప్పుడు 18 ఏళ్లు. ఆమెకు 15 ఏళ్లు. వాళ్ల నాన్న గురించి అందరితో గొప్పగా చెప్పేవారు.
ఆమె వాళ్ల నాన్న దగ్గరి నుంచి నా నా నెంబర్ దొంగతనం చేసి.. నాకు మెసేజ్‌లు పంపేది. ‘నేను సోనం.. నేను మీకు వీరాభిమానిని. మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నాను’ అని సందేశాలు పంపించేది.
నాకు మాత్రం అప్పటికి తనెవరో తెలియదు. అయితే, ఆమె మాట్లాడే విధానం నచ్చి ఓ రోజు తనను కలవాలని నిర్ణయించుకున్నా. తనని చూడగానే ఇంత చిన్నపిల్లా నాకు మెసేజ్‌లు పంపేది అనుకున్నా. ‘నువ్వింకా చిన్నదానివి. వెళ్లి బుద్ధిగా చదువుకో’ అని చెప్పి వెళ్లిపోయా.
అయితే, తన మెసేజ్‌లకు రిప్లై ఇవ్వడం మాత్రం మానలేకపోయా. రెండున్నర నెలల తర్వాత మా కోచ్ ఫోన్ పనిచేయడం లేదని.. ప్రాబ్లం ఏమిటో చూడాలని నాకు ఇచ్చారు. అప్పుడు మా కోచ్ వాళ్ల కూతురి నంబర్, నాకు మెసేజ్‌లు చేసే అమ్మాయి నంబర్ ఒకేలా అనిపించింది.
అప్పుడే నాకు అర్థమైంది తను మరెవరో కాదు మా కోచ్ కూతురేనని! వెంటనే సోనంకు కాల్ చేసి.. ఈ విషయం గురించి మీనాన్నకు తెలిస్తే నా కెరీర్ ముగిసిపోతుంది. ఇక చాలు అని చెప్పేశా.
అప్పుడు సోనం నాకు సారీ చెప్పింది. అయితే, విధి రాత మరోలా ఉంది. తను నా మనసులో అలాగే ఉండిపోయింది. ఆమెతో మాట్లాడాలని, మెసేజ్ చేయాలని మా మనసు తహతహలాడేది. సీక్రెట్‌గా కలిసేవాళ్లం. నా బిజీ షెడ్యూల్ కారణంగా ఏడాదిలో రెండు మూడుసార్లు మాత్రమే నేరుగా కలిసేందుకు వీలయ్యేది.
సినిమాకు వెళ్లి రెండు టికెట్లు కొని.. ఒకటి తనకోసం కౌంటర్ దగ్గరే వదిలేసి వెళ్తే తను వచ్చి తీసుకునేది. చాలా ఏళ్లపాటు అలాగే ప్రేమలో మునిగితేలాం.
నా కెరీర్‌తో పాటు మా ప్రేమ కూడా ట్రాక్‌లో పడింది. సరైన వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం.
ఈ విషయం గురించి మా కోచ్‌తో మాట్లాడాలని నిర్ణయించుకున్నా. కానీ ధైర్యం చాల్లేదు. ఎలాగోలా ధైర్యం తెచ్చుకుని ‘సర్.. నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నా’ అని చెప్పాను. ఆయన వెంటనే అవునా.. సరే అంటూ వాష్‌రూంలోకి వెళ్లిపోయారు. కాసేపటికి వచ్చి మాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు.
ఆతర్వాత కొన్ని నెలలకు మా పెళ్లి జరిగింది. 13 ఏళ్లు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాం. తనే నా ధైర్యం.సపోర్ట్ సిస్టం. ప్రతి అడుగులోనూ నా వెంటే ఉంటుంది. తను లేకుంటే నేను లేను. ఇప్పటికీ తను నాకు వీరాభిమానే!’’ అని సునిల్ ఛెత్రి తెలిపాడు. కాగా సునిల్- సోనం జంటకు 2023లో కుమారుడు జన్మించాడు.
Comments
Please login to add a commentAdd a comment