వివిధ టోర్నీల్లో క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడిన 21 మంది క్రీడాకారులు, కోచ్‌లపై హాకీ ఇండియా (హెచ్‌ఐ) నిషేధం విధించింది. అఖిల భారత బాంబే గోల్డ్‌కప్ టోర్నీలో అనుచితంగా ప్రవర్తించిన పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ జట్టుకు చెందిన సర్వంజిత్‌సింగ్, కరంజిత్‌సింగ్, గురుప్రీత్‌సింగ్ ఆరు నెలలపాటు నిషేధానికి గురయ్యారు.
వీరితోపాటు గత ఏడాది మరో టోర్నీలో ఫీల్డ్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగిన వీరేందర్‌సింగ్, బచిత్తర్ సింగ్‌లపై ఆరు నెలలు, మరో సంఘటనకు సంబంధించి నాంధారి ఎలెవన్ జట్టు ఆటగాడు హర్‌ప్రీత్‌సింగ్‌పై మూడు నెలలు నిషేధం విధించింది. వీరేగాక గత ఫిబ్రవరిలో ఇండియా ఇన్విటేషన్ టోర్నీలో మైదానం వీడి నిరసన తెలిపిన నార్త్ సెంట్రల్ రైల్వేస్ మహిళల జట్టులోని మొత్తం 16 మందినీ ఆరు నెలలపాటు ఎటువంటి టోర్నీల్లోనూ పాల్గొనకుండా నిషేధించింది.
ఈ జట్టు మేనేజర్ పుష్పా శ్రీవాత్సవ మూడు నెలలు, కోచ్ శ్రద్ధా వర్మ ఆరు నెలలు నిషేధానికి గురయ్యారు. వీరందరిపైనా నిషేధం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని, ఆ తరువాత ఏడాదిపాటు వీరు మరోసారి అటువంటి చర్యలకు పాల్పడితే మరో ఏడాది నిషేధానికి గురికావాల్సివస్తుందని హెచ్‌ఐ హెచ్చరించింది. అయితే నిషేధం విషయంలో 30 రోజుల్లో అప్పీలు చేసుకోవచ్చని పేర్కొంది.