ప్రత్యర్థి బౌలర్లకు దీటుగా మన బౌలర్లు స్వింగ్ చేశారు! ఇంగ్లండ్ టాపార్డర్‌ను టపటపా పడగొట్టారు! ... మిగిలిన వికెట్లు తీయడం ఇక లాంఛనమే అనుకుంటే అవే కొరకరాని కొయ్యలయ్యాయి. అంతే... టీమిండియా పట్టు అంతకంతకూ చేజారుతుంటే, ఆతిథ్య జట్టు ఆధిక్యం పైపైకి వెళ్లింది. మారిన వాతావరణంతో పేసర్ల బంతుల్లో పస తగ్గడం... స్పిన్నర్లు నామమాత్రం కావడంతో వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ బెయిర్‌స్టో, పేస్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ పరుగుల పండుగ చేసుకున్నారు. బంతి బ్యాట్‌పైకి చక్కగా వస్తుండటంతో చెలరేగిపోయారు. భారీ భాగస్వామ్యంతో ఇంగ్లండ్‌ను సురక్షిత స్థితికి చేర్చారు. ప్రత్యామ్నాయ ఆటగాడిగా జట్టులోకి వచ్చిన వోక్స్... విలువైన ఇన్నింగ్స్‌తో కెరీర్‌లో తొలి శతకం నమోదు చేసుకున్నాడు. ఇప్పటికే 250 పరుగులు వెనుకబడిపోయిన భారత్ ఈ టెస్టును కాపాడుకోవాలంటే చివరి రెండు రోజుల్లో విశేషంగా రాణించాల్సిందే.
లండన్: లార్డ్స్ టెస్టులో టీమిండియా నిండా కష్టాల్లో మునిగింది. ప్రత్యర్థిని మోస్తరు స్కోరుకే పరిమితం చేసే దశ నుంచి భారీ ఆధిక్యం కోల్పోయిన స్థితికి చేరింది. పుంజుకుని ప్రతాపం చూపిన భారత పేసర్లు... కీలక దశలో తేలిపోయారు. టెయిలెండర్ల ఆట కట్టిస్తారనుకున్న స్పిన్నర్లూ చేతులెత్తేశారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ (159 బంతుల్లో 120 బ్యాటింగ్; 18 ఫోర్లు) అజేయ శతకంతో చెలరేగాడు. అతడికి అండగా నిలుస్తూ జట్టును గట్టెక్కించిన వికెట్ కీపర్ బెయిర్‌స్టో (144 బంతుల్లో 93; 12 ఫోర్లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. మూడో రోజు శనివారం వెలుతురు మందగించి ఆట నిలిపి వేసే సమయానికి ఇంగ్లండ్ 6 వికెట్లకు 357 పరుగులతో పటిష్టస్థితిలో నిలిచింది. వోక్స్‌తో పాటు స్యామ్ కరన్ (24 బంతుల్లో 22 బ్యాటింగ్; 4 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. నాలుగు వికెట్లు చేతిలో ఉన్న ఇంగ్లండ్ 250 పరుగుల ఆధిక్యంలో ఉంది. భారత బౌలర్లలో షమీ (3/74), హార్దిక్ పాండ్యా (2/66) ఫర్వాలేదనిపించారు.
చిక్కినట్లే చిక్కి...
తొలి రెండు రోజుల్లా కాక శనివారం చక్కగా ఎండ కాయడంతో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపించింది. దీనికి తగ్గట్లే ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు కుక్ (21), జెన్నింగ్స్ (11) సాధికారికంగా ప్రారంభించారు. షమీ, ఇషాంత్ లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడకపోవడంతో పరుగులు తేలికగా వచ్చాయి. అయితే, వెంటనే లయ అందుకున్న షమీ... దాదాపు యార్కర్ అనదగ్గ బంతితో జెన్నింగ్స్‌ను ఎల్బీడబ్ల్యూ చేశాడు. దీనిపై సమీక్షకు వెళ్లినా ఫలితం బ్యాట్స్‌మన్‌కు వ్యతిరేకంగానే వచ్చింది. మరో ఐదు బంతుల వ్యవధిలోనే ఇషాంత్... కుక్ కథ ముగించాడు. దూసుకొచ్చిన బంతి అతడి బ్యాట్ అంచును రాసుకుంటూ కీపర్ చేతుల్లోకి వెళ్లింది. ప్రత్యర్థి స్కోరు 32/2తో ఉన్న దశలో భారత కెప్టెన్ కోహ్లి ప్రధాన బౌలర్లిద్దరినీ తప్పించి కుల్దీప్, హార్డిక్ పాండ్యాలను ఒకేసారి బౌలింగ్‌కు దించాడు. ఇంగ్లండ్ కెప్టెన్ రూట్ (19; 2 ఫోర్లు) ఇబ్బంది పడినా, కొత్త కుర్రాడు పోప్ (28; 3 ఫోర్లు) తడబాటు లేకుండా ఆడాడు. కానీ, అతడిని పాండ్యా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. రివ్యూ కోరినా అవుట్‌గానే తేలింది. లంచ్‌కు ముందటి ఓవర్లో షమీ... రూట్‌ను ఎల్బీ చేయడంతో ఆతిథ్య జట్టు 89/4తో విరామానికి వెళ్లింది. ఆ తర్వాత ఓవైపు బట్లర్ (22 బంతుల్లో 24; 4 ఫోర్లు), మరోవైపు బెయిర్ స్టో చకచక బౌండరీలు బాదడంతో భారత తొలి ఇన్నింగ్స్ స్కోరును అధిగమించేందుకు ఇంగ్లండ్‌కు ఎక్కువసేపు పట్టలేదు. ఐదో వికెట్‌కు వీరిద్దరూ 40 బంతుల్లోనే 42 పరుగులు జోడించగా... అందులో ఏడు ఫోర్లు ఉండటం గమనార్హం. ఈ దశలో షమీ మళ్లీ ప్రతాపం చూపాడు. దూకుడుగా కనిపించిన బట్లర్‌ను ఎల్బీడబ్ల్యూ చేసి బ్రేక్ ఇచ్చాడు. అప్పటికి స్కోరు 131/5. పరిస్థితి చూస్తే ఇంగ్లండ్‌ను 200లోపే కట్టడి చేయొచ్చనిపించింది.
ఆ ఇద్దరూ ముంచారు...
అటు టీమిండియా బౌలర్లు పదునుగా బంతులేస్తున్నారు. ఇటు ఇంగ్లండ్ ప్రధాన బ్యాట్స్‌మెన్ ఔటయ్యారు. మ్యాచ్‌లో రెండు జట్లూ సమాన స్థితిలో ఉన్నాయి. కొంత ఆధిక్యం కోల్పోయినా, ప్రత్యర్థి టెయిలెండర్లను చుట్టేస్తే తక్కువలో తక్కువ నష్టంతో భారత్ బయటపడేది. కానీ, ఈ అవకాశాన్ని చెదరగొట్టింది బెయిర్‌స్టో, క్రిస్ వోక్స్ ద్వయం. రన్‌రేట్‌ను 4కు తగ్గకుండా స్కోరును ముందుకు తీసుకెళ్లారు. 39వ ఓవర్లో అశ్విన్‌ను దించినా, మిగతా బౌలర్లను మార్చిమార్చి ప్రయోగించినా, ఆఖరికి కుల్దీప్‌ను తెచ్చినా ఈ జంట ఎక్కడా అసౌకర్యంగా కనిపించలేదు. స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తూ, అలవోకగా బౌండరీలు కొడుతూ భాగస్వామ్యాన్ని అంతకంతకూ పెంచుకుంటూ వెళ్లారు. జట్టు స్కోరును 200, 300కు దాటించారు. ఈ క్రమంలో మొదట బెయిర్‌స్టో అర్ధ శతకం పూర్తిచేసుకున్నాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో బౌండరీతో వోక్స్ సైతం ఫిఫ్టీ అందుకున్నాడు. ఇక్కడి నుంచి పరుగులు మరింత సులువుగా వచ్చాయి. ముఖ్యంగా వోక్స్... ఇషాంత్, స్పిన్నర్ అశ్విన్‌ల బౌలింగ్‌లో రెండేసి ఫోర్లు కొట్టి బెయిర్‌స్టోను దాటి ముందుకెళ్లాడు. తర్వాత సైతం బౌండరీలు బాదుతూ 90ల్లోకి వెళ్లిపోయాడు. పాండ్యా బౌలింగ్‌లో బంతిని మిడ్ వికెట్ దిశగా
పంపి టెస్టుల్లో తొలి శతకాన్ని (129 బంతుల్లో) పూర్తిచేసుకున్నాడు. జట్టు స్కోరు 300 దాటింది. అప్పటికీ ఇంకా తొంభైల్లోనే ఉండిపోయిన బెయిర్‌స్టో... హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో దినేశ్ కార్తీక్ పట్టిన అద్భుతమైన డైవింగ్ క్యాచ్‌తో నిరాశగా పెవిలియన్ చేరాడు. దీంతో వోక్స్‌తో ఆరో వికెట్‌కు 189 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. వోక్స్‌కు జత కలిసిన కరన్... వస్తూనే బౌండరీలు బాదాడు. వోక్స్ సైతం ఊపు కొనసాగించడంతో ఇంగ్లండ్ 350 చేసేసింది. వెలుతురు లేమి కారణంగా మరో 16 ఓవర్లు ఉండగానే మూడో రోజు ఆటను ముగించారు.
►నాలుగో రోజు ఆట మధ్యాహ్నం గం.3.30 నుంచి సోనీ సిక్స్, సోనీ టెన్–3లలో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment