కెవిన్ ఓబ్రెయిన్ వన్ మ్యాన్ షో
నోయిడా: అఫ్గనిస్తాన్ తో జరుగుతున్న వన్డే సిరీస్‌ను ఐర్లాండ్ 2-2తో సమం చేసింది. గ్రేటర్ నోయిడాలో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన నాలుగో వన్డేలో ఐర్లాండ్‌ను కెవిన్ ఓబ్రెయిన్ ఒంటిచేత్తో గెలిపించాడు. మరో 19 బంతులు ఉండగానే మూడు వికెట్లతో అఫ్గనిస్తాన్ పై ఐర్లాండ్ నెగ్గింది. తొలుత టాస్ గెలిచిన అఫ్గాన్ జట్టు 49.5 ఓవర్లలో 220 పరుగులకే ఆలౌటైంది. 83 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన జట్టును టెయిలెండర్లు మహమ్మద్ నబీ(64 బంతుల్లో 41: 3 ఫోర్లు), షఫీఖుల్లా(42 బంతుల్లో 42: 8 ఫోర్లు), దౌలత్ జర్దాన్(53 బంతుల్లో 41 నాటౌట్: 3 ఫోర్లు, 1 సిక్సర్) ఆదుకోవడంతో రెండు వందల మార్కును చేరుకుంది. కెవిన్ ఓబ్రెయిన్ తొలి ఓవర్లో షహజాద్(1)ను, మూడో ఓవర్లో రహమత్ అలీని డకౌట్ చేశాడు. ఓవరాల్‌గా 4/26తో అఫ్గాన్ ప్లేయర్స్‌ను కట్టడిచేశాడు.
221 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ కు ఓపెనర్లు జాయిస్(24), స్టిర్లింగ్(28) శుభారంభాన్నిచ్చారు. 9.3 ఓవర్లలో 48 పరుగులు జోడించారు. జట్టు స్కోరు 73 పరుగుల వద్ద ఓబ్రెయిన్ రిటైర్డ్ హర్ట్ గా వెళ్లాడు. 6 వికెట్లకు 130 పరుగులు చేసి కష్టాల్లో ఉన్న ఐర్లాండ్‌ను ఓబ్రెయిన్ ఆదుకుని ఓంటిచేత్తో మ్యాచ్ గెలిపించాడు. కీపర్ విల్సన్(67 బంతుల్లో 41: 3 ఫోర్లు) తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు ఓబ్రెయిన్. 60 బంతుల్లో 72 పరుగులు చేసి అజేయంగా నిలిచి మరో 19 బంతులు ఉండగానే జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. దీంతో ఐదు వన్డేల సిరీస్ 2-2తో సమమైంది. మార్చి 24న ఇదే వేదికలో జరగనున్న నిర్ణయాత్మక ఐదో వన్డేలో నెగ్గిన జట్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది.