అష్గబాత్ (తుర్క్‌మెనిస్తాన్): ప్రపంచ బిలియర్డ్స్ మాజీ చాంపియన్ ప్రప్‌రుట్ చైతనాసకున్ (థాయ్‌లాండ్)పై సంచలన విజయం సాధించిన భారత ప్లేయర్ సౌరవ్ కొఠారి ఆసియా ఇండోర్ క్రీడల్లో భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించాడు. సోమవారం జరిగిన బిలియర్డ్స్ సింగిల్స్ ఫైనల్లో సౌరవ్ కొఠారి 3–1 (100–80, 101–0, 29–101, 101–88) ఫ్రేమ్‌ల తేడాతో చైతనాసుకున్‌ను ఓడించాడు. ఈ క్రీడల్లో క్యూ స్పోర్ట్స్ (బిలియర్డ్స్, స్నూకర్) విభాగంలో భారత్‌కిది తొలి పతకం కావడం విశేషం.
మరోవైపు టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ విష్ణువర్ధన్ రజత పతకం సాధించాడు. ఫైనల్లో విష్ణువర్ధన్–ప్రార్థన తొంబారే (భారత్) ద్వయం 7–5, 4–6, 2–6తో నటనన్ కద్‌చాపనాన్–నిచా లెర్ట్‌పితాక్‌సిన్‌చాయ్ (థాయ్‌లాండ్) జంట చేతిలో ఓడిపోయింది. తొలి సెట్‌ను నెగ్గిన భారత జోడీ ఆ తర్వాత అదే జోరును కొనసాగించలేకపోయింది. పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్‌కు స్వర్ణ, రజత పతకాలు ఖాయమయ్యాయి. భారత ఆటగాళ్లు సుమీత్ నాగల్, విజయ్ నటరాజన్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. సెమీఫైనల్స్‌లో సుమీత్ 6–4, 7–5తో ఫరూఖ్ దస్తోవ్ (ఉజ్బెకిస్తాన్)పై, విజయ్ 6–4, 6–2తో ఫెజీవ్ (ఉజ్బెకిస్తాన్)పై గెలుపొందారు.
మరోవైపు పురుషుల డబుల్స్ విభాగంలో విష్ణువర్ధన్–విజయ్ జంట స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. సెమీఫైనల్లో విష్ణు–విజయ్ ద్వయం 6–4, 3–6, 6–1తో చున్ హున్ వోంగ్–హాంగ్ కిట్ వోంగ్ (హాంకాంగ్) జోడీపై విజయం సాధించింది. బుధవారం ముగియనున్న ఈ క్రీడల్లో భారత్ ఇప్పటివరకు ఏడు స్వర్ణాలు, ఎనిమిది రజతాలు, 14 కాంస్య పతకాలు సాధించి మొత్తం 29 పతకాలతో 12వ స్థానంలో ఉంది.
సౌరవ్ కొఠారికి స్వర్ణం
Published Mon, Sep 25 2017 11:49 PM | Last Updated on Tue, Sep 26 2017 2:17 AM
Advertisement