
'మా పిల్లలు విరాట్ ఆటను ఆస్వాదించారు'
న్యూఢిల్లీ:వరల్డ్ టీ 20 టోర్నీలో టీమిండియానే ఫేవరెట్ జట్టని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మరోసారి పునరుద్ఘాటించాడు. ప్రస్తుత వరల్డ్ కప్ను గెలవడానికి కావాల్సిన అన్ని వనరులు భారత జట్టులో ఉన్నాయని, అందుచేత నూటికి తొంభై తొమ్మిది శాతం టైటిల్ మనదేనని జోస్యం చెప్పాడు. పాకిస్తాన్ తో మ్యాచ్ జరుగుతున్న సమయంలో తమ పిల్లలు టీవీకి అతుక్కుపోయారన్నాడు. ప్రత్యేకంగా విరాట్ కోహ్లి ఆడుతున్నప్పుడు ఎక్కడికి కదలకుండా అతని ఆటను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేశారన్నాడు. పాకిస్తాన్ తో మ్యాచ్లో మొత్తం క్రెడిట్ అంతా విరాట్కే దక్కుతుందన్నాడు. తీవ్రమైన ఒత్తిడిలో విరాట్ ఆడిన తీరు నిజంగా అద్భుతమని సెహ్వాగ్ కొనియాడాడు.
ఇదిలా ఉండగా, నాగ్ పూర్ లో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో భారత జట్టు ఓటమి చెందిన విషయాన్ని ఈ సందర్భంగా సెహ్వాగ్ ప్రస్తావించాడు. 2011 వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఇదే నాగ్ పూర్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో భారత్ ఓటమి చెందినా , ఆ తరువాత టైటిల్ సాధించిన విషయాన్ని గుర్తు చేశాడు. మళ్లీ అదే రిపీట్ అవుతుందని సెహ్వాగ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. మార్చి 23 వ తేదీన బంగ్లాదేశ్ తో జరిగే మ్యాచ్లో భారత్ సునాయాసంగా విజయం సాధించే అవకాశం ఉందన్నాడు.