
న్యూఢిల్లీ: ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఈరోజు (గురువారం) నుంచి జరగనున్న మూడు వన్డేల సిరీస్‌లో దినేశ్ కార్తీక్‌కి భారత తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. మిడిల్ ఆర్డర్‌లో సురేశ్ రైనా కంటే దినేశ్ కార్తీక్ వైపే టీమ్ మేనేజ్‌మెంట్ మొగ్గు చూపే అవకాశం ఉందన్నాడు.
ఈ వన్డే సిరీస్ కోసం తొలుత సెలక్టర్లు అంబటి రాయుడుని జట్టులోకి ఎంపిక చేయగా.. అతను యో-యో ఫిట్‌నెస్ టెస్టులో ఫెయిలవడంతో సురేశ్ రైనాకి అవకాశం కల్పించారు. దీంతో.. రెండేళ్ల తర్వాత వన్డే జట్టులోకి రైనా పునరాగమనం చేసినా అతనికి తుది జట్టులో చోటు దక్కడం అనుమానమేనని సెహ్వాగ్ వివరించాడు.
‘వన్డే సిరీస్‌లో దినేశ్ కార్తీక్‌కి కచ్చితంగా తుది జట్టులో అవకాశం దక్కుతుందని నేను విశ్వసిస్తున్నా. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌తో పాటు.. అంతకముందు జరిగిన నిదహాస్ టోర్నీలో దినేశ్ కార్తీక్ అత్యుత్తమంగా రాణించాడు. అందుకే కార్తీక్‌ని ఆడించేందుకు ఇదే తగిన సమయమని నా అంచనా. అదే జరిగితే సురేశ్ రైనా మిడిలార్డర్‌లో కార్తీక్ కోసం తన స్థానాన్ని వదులుకోవాల్సిందే’ అని సెహ్వాగ్ వెల్లడించాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ను కచ్చితంగా టీమిండియానే గెలుస్తుందని సెహ్వాగ్ జోస్యం చెప్పాడు. వన్డే సిరీస్‌ను 3-0తో కానీ, 2-1తో కానీ విరాట్ గ్యాంగ్ గెలవడం ఖాయమన్నాడు. ఇంగ్లండ్ జట్టు కంటే కూడా భారత జట్టు బలంగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పాడు. మరొకవైపు భారత జట్టు బ్యాటింగ్ ఆర్డర్ కూర్పు కూడా ఎంతో చక్కగా ఉందని సెహ్వాగ్ పేర్కొన్నాడు. ఓపెనర్లుగా శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు ఇన్నింగ్స్ ఆరంభిస్తే, మూడో స్థానంలో కేఎల్ రాహుల్, నాల్గో స్థానంలో విరాట్ కోహ్లిలు ఆడటమే భారత బ్యాటింగ్ లైనప్ పటిష్టతకు అద్దం పడుతుందన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment