
కేకేఆర్ చేతిలో ఆర్సీబీ ఓటమి (PC: iplt20.com)
IPL 2023 KKR Vs RCB: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ల ఆట తీరుపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శలు గుప్పించాడు. ప్రతిసారీ విరాట్ కోహ్లి, డుప్లెసిస్‌పై ఆధారపడటం సరికాదంటూ చురకలు అంటించాడు. మిగతా వాళ్లు కూడా కాస్త బ్యాట్ ఝులిపించాలంటూ హితబోధ చేశాడు. ముఖ్యంగా గ్లెన్ మాక్స్‌వెల్, దినేశ్ కార్తిక్ తమ వంతు పాత్ర పోషించాలని వీరూ భాయ్ సూచించాడు.
ఐపీఎల్-2023లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ 81 పరుగుల భారీ తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన కేకేఆర్ శార్దూల్ ఠాకూర్, రింకూ సింగ్ మెరుపు ఇన్నింగ్స్‌తో సొంత మైదానంలో 204 పరుగులు స్కోరు చేసింది.
అంతా చేతులెత్తేశారు
లక్ష్య ఛేదనకు దిగిన ఆర్సీబీకి శుభారంభం అందించిన ఓపెనర్లు విరాట్ కోహ్లి (21), ఫాఫ్ డుప్లెసిస్ (23) త్వరగానే పెవిలియన్ చేరడంతో కష్టాలు మొదలయ్యాయి. వన్‌డౌన్‌లో వచ్చిన మైకేల్ బ్రేస్‌వెల్ 19 పరుగులు చేయగా.. గ్లెన్ మాక్స్‌వెల్(5) పూర్తిగా నిరాశపరిచాడు.
సింగిల్ డిజిట్ స్కోర్లు
ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్ చేసిన హర్షల్ పటేల్(0), షాబాజ్ అహ్మద్ (1), దినేశ్ కార్తిక్ (9), అనూజ్ రావత్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం అయ్యారు. తొమ్మిదో స్థానంలో వచ్చిన పేస్ ఆల్‌రౌండర్ 20 పరుగులతో అజేయంగా నిలవగా.. ఆకాశ్ దీప్ 17 పరుగులు చేయగలిగాడు. ఈ క్రమంలో 123 పరుగులకే ఆలౌట్ అయిన ఆర్సీబీ పదహారో ఎడిషన్‌లో తొలి పరాజయం నమోదు చేసింది.
డీకే, మాక్సీ ఏం చేస్తున్నారు?
ఈ నేపథ్యంలో క్రిక్‌బజ్ షోలో మాట్లాడిన వీరేంద్ర సెహ్వాగ్.. ‘‘ప్రతిసారి ఇద్దరు ఆటగాళ్ల మీద ఆధారపడటం సరికాదు. విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ రాణిస్తే మాత్రమే ఆర్సీబీ గెలుస్తుందనిపిస్తోంది. ఇలా జరుగకూడదు కదా! గ్లెన్ మాక్స్‌వెల్, దినేశ్ కార్తిక్ కూడా పరుగులు సాధించాలి. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన అనూజ్ రావత్ కూడా బాధ్యతగా వ్యవహరించాలి. ఆర్సీబీ ఇప్పటికైనా అతడి కంటే బెటర్ ఆప్షన్ ఉంటే చూసుకోవాలి’’ అని అభిప్రాయపడ్డాడు.
ఏదేమైనా మంచే జరిగింది
‘‘ఏదేమైనా టాపార్డర్ విఫలమైతే, బ్యాటింగ్ ఆర్డర్ కుదేలైతే ఆ జట్టు పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పటికే జట్లన్నింటికీ అవగతమే. గతంలో ఎన్నోసార్లు ఆయా జట్లు ఇలాంటి చేదు అనుభవాలు ఎదుర్కొన్నాయి.
ఈసారి ఆర్సీబీకి రెండో మ్యాచ్‌లోనే ఇలా జరగడం మంచిదైంది. ఒకవేళ 8-9 మ్యాచ్‌ల తర్వాత ఇలా జరిగి ఉంటే కష్టమైపోయేది. ఆదిలోనే లోపాలు సరిదిద్దుకుంటే మిగతా మ్యాచ్‌లలో మరింత మెరుగ్గా రాణించే అవకాశాలు ఉంటాయి’’ అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.
చదవండి: కోహ్లి వచ్చాడు.. కోపంగా బ్యాట్ విసిరేశాడు.. పక్కనే కూర్చున్న నాతో..
నీరజ్‌చోప్రా తమ్ముడిలా ఉన్నాడు.. 'ఇంపాక్ట్'ను భలే వాడింది పో!
ఎందుకు వస్తున్నాడో తెలియదు.. చెత్త బ్యాటింగ్! ప్రతీసారి ఇంతే
A memorable first victory of #TATAIPL 2023 at home.@KKRiders secure a clinical 81-run win over #RCB ⚡️⚡️
— IndianPremierLeague (@IPL) April 6, 2023
Scorecard - https://t.co/J6wVwbsfV2#TATAIPL | #KKRvRCB pic.twitter.com/0u57nKO57G