దినేశ్ కార్తిక్ (PC: IPL)
IPL 2023- Dinesh Karthik: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ దినేశ్ కార్తిక్ ఆట తీరును టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ విమర్శించాడు. ఐపీఎల్-2023లో ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌లలో కనీసం ఒక్కదాంట్లో కూడా స్థాయికి తగ్గట్లు రాణించలేదని పెదవి విరిచాడు. జట్టు తనపై ఆధారపడొచ్చనే భరోసా ఇవ్వలేకపోయాడంటూ విమర్శలు గుప్పించాడు.
అప్పుడు అదుర్స్. ..
గత సీజన్‌లో ఆర్సీబీ ఫినిషర్‌గా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించి.. ఐపీఎల్ ప్రదర్శన ద్వారా భారత జట్టులో పునరాగమనం చేశాడు వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్. కానీ పదహారో ఎడిషన్‌లో సీన్ రివర్స్ అయింది. గతేడాది ఐపీఎల్‌లో 16 ఇన్నింగ్స్‌లలో 330 పరుగులు చేసిన డీకే.. ఈ ఏడాది ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్‌లలో సాధించినవి కేవలం 83 పరుగులు.
ఇప్పుడేమో తుస్
ఈ గణాంకాలను బట్టి దినేశ్ కార్తిక్ ప్రదర్శన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతేడాది ఆర్సీబీకి బలంగా ఉన్న డీకే ఈసారి మాత్రం అంచనాలు అందుకోలేకపోతున్నాడు. ఒక్క మ్యాచ్‌లో కూడా తనదైన ముద్ర వేయలేకపోయాడు. మరోవైపు ఆర్సీబీ భారమంతా విరాట్ కోహ్లి, గ్లెన్ మాక్స్‌వెల్, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ మీదే పడుతోంది.
కేజీఎఫ్‌పైనే భారం
ప్రతిసారీ ఈ ముగ్గురిపైనే ఆధారపడటంతో వీరిలో ఒక్కరు విఫలమైనా ఆర్సీబీ విజయాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘కేజీఎఫ్ (కోహ్లి, గ్లెన్, ఫాఫ్) గనుక ఒకవేళ స్థాయికి తగ్గట్లు రాణించలేని పరిస్థితుల్లో ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలో ఆర్సీబీ యాజమాన్యం ప్రణాళికలు రచించుకోవాలి.
వాళ్లు గనుక విఫలమై జట్టు కష్టాల్లో కూరుకుపోతే బాధ్యతను నెత్తినవేసుకోగల ఆటగాళ్లను తయారుచేసుకోవాలి. ఆ ప్లేయర్ దినేశ్ కార్తికా లేదంటే మహిపాల్ లామ్రోరా అన్న విషయాన్ని పక్కనపెడితే.. ఆర్సీబీ మిడిలార్డర్ మాత్రం పూర్తి బలహీనంగా ఉంది.
ఇప్పటికైనా కళ్లు తెరవకపోతే
ముఖ్యంగా కార్తిక్ గత ఎనిమిది మ్యాచ్‌లలో కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా జట్టు తనపై ఆధారపడొచ్చు అనే భరోసాను ఇవ్వలేకపోయాడు. మేనేజ్‌మెంట్ కచ్చితంగా ఈ బ్యాటింగ్ లోపాలను సరిచేసుకోవాలి’’ అని సూచించాడు. లేనిపక్షంలో భారీ మూల్యం తప్పదంటూ ఇర్ఫాన్ హెచ్చరికలు జారీ చేశాడు.
కాగా గత మ్యాచ్‌లో సొంతమైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమిపాలైన ఆర్సీబీ.. మే 1న లక్నోలో సూపర్ జెయింట్స్‌తో పోటీకి సిద్ధమైంది. ఈ క్రమంలో గాయపడిన డేవిడ్ విల్లే స్థానంలో కేదార్ జాదవ్‌ను జట్టులోకి తీసుకున్నట్లు ప్రకటించింది.
చదవండి: Viral: మిస్టర్ కూల్‌కు ఆగ్రహం! నీకసలు బుద్ధుందా? జట్టులో నుంచి తీసిపారేయండి!
MI Vs RR: గ్రహణం వీడింది..! అతడు భవిష్యత్ సూపర్‌స్టార్.. నో డౌట్!
Comments
Please login to add a commentAdd a comment