photo credit: IPL Twitter
సొంత మైదానంలో పరాజయాల (లక్నో, సీఎస్‌కే, కేకేఆర్ చేతుల్లో) నేపథ్యంలో ఆర్సీబీ అభిమానులు తెగ ఫీలైపోతున్నారు. తమ ఆటగాళ్ల చెత్త ప్రదర్శన కారణంగా వారు తలెత్తుకోలుకపోతున్నారు. సొంత ఇలాకాలో ఇదేం కర్మ రా బాబు అనుకుంటూ అవమాన భారంతో కుంగిపోతున్నారు. సొంత జట్టుకే వ్యతిరేకంగా సోషల్‌మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. KGFను (కోహ్లి, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఫాప్ డుప్లెసిస్) మినహాయించి మిగతా ఆటగాళ్లందరిపై దుమ్మెత్తిపోస్తున్నారు.
ముఖ్యంగా దినేశ్ కార్తీక్, షాబజ్ అహ్మద్‌లపై తారా స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. వీరి వల్లే ఆర్సీబీ విజయాలకు దూరమవుతుందని మండిపడుతున్నారు. వీరు సరిగ్గా ఆడకపోగా.. ఇతరులను కూడా భ్రష్ఠుపట్టిస్తున్నారని (రనౌట్లు, మిస్ ఫీల్డింగ్‌లు, క్యాచ్‌లు జారవిడచడం వంటివి) తూర్పారబెడుతున్నారు. నిన్న కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్ గురించి ప్రస్తావిస్తూ.. దినేశ్ కార్తీక్‌ను (18 బంతుల్లో 22, సుయాశ్ రనౌట్‌కు కారకుడు), షాబాజ్ అహ్మద్‌ను (5 బంతుల్లో 2, ఒకే ఓవర్‌లో 25 పరుగులు సమర్పించుకున్నాడు) పరుష పదజాలంతో దూషిస్తున్నారు.
చదవండి: #JasonRoy: 4 బంతుల్లో నాలుగు సిక్సర్లు.. షాబాజ్ అహ్మద్‌ను ఉతికారేశాడు
వీరి వల్లే తాము సొంత మైదానంలో తలెత్తుకోలేకపోతున్నామని వాపోతున్నారు. ఇక చాలు.. మీరు వెళ్లండ్రా బాబు అంటూ కామెంట్లు చేస్తున్నారు. హర్షల్ పటేల్, సుయాశ్ ప్రభుదేశాయ్, విజయ్ కుమార్ వైశాఖ్‌లు కూడా తమ ఆటతీరును మెరుగుపర్చుకోవాలని, లేకపోతే స్వచ్ఛందంగా జట్టును తప్పుకోవాలని సూచిస్తున్నారు. పనిలో పనిగా సరైన జట్టును (దేశీయ ఆటగాళ్లను) ఎంపిక చేసుకోలేదని ఫ్రాంచైజీ యాజమాన్యంపై మండిపడుతున్నారు. ఆ నలుగురిని (KGF, సిరాజ్) తప్పిస్తే, ఐపీఎల్ చరిత్రలో ఇంత బలహీనమైన జట్టే ఉండదని అంటున్నారు.
కాగా, చిన్న స్వామి స్టేడియంలో (బెంగళూరు) కేకేఆర్‌తో నిన్న (ఏప్రిల్ 26) జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. సిరాజ్ (4-0-33-1), హసరంగ (4-0-24-2), విరాట్ కోహ్లి (37 బంతుల్లో 54) మినహాయించి ఆ జట్టు మూకుమ్మడిగా విఫలమై ఓటమిపాలైంది.
చదవండి: #ViratKohli: అరుదైన ఘనత.. టి20 చరిత్రలో తొలి ఆటగాడిగా
తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. జేసన్ రాయ్ (29 బంతుల్లో 56; 4 ఫోర్లు, 5 సిక్సర్లు), నితీశ్ రాణా (21 బంతుల్లో 48), వెంకటేశ్ అయ్యర్ (26 బంతుల్లో 31) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసి, 21 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో డుప్లెసిస్ (17), మ్యాక్స్‌వెల్ (5) సహా అందరూ విఫలమయ్యారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3, సుయాశ్ శర్మ, ఆండ్రీ రసెల్ తలో 2 వికెట్లు పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment