photo credit: IPL Twitter
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 23, మధ్యాహ్నం 3:30 గంటలకు) జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ గతంలో మాదిరే మరోసారి భారీ స్కోర్ చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. డుప్లెసిస్ (39 బంతుల్లో 62; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), మ్యాక్స్‌వెల్ (44 బంతుల్లో 77; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో చెలరేగినా ఆ జట్టు భారీ స్కోర్ చేయలేక చతికిలపడింది. మ్యాక్సీ, డుప్లెసిస్ విజృంభించడంతో ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది.
13 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసి పటిష్టమైన స్థితిలో ఉండిన ఆ జట్టు ఒక్కసారిగా పేకమేడలా కూలిపోయింది. 45 పరుగుల వ్యవధిలో 7 వికెట్లు కోల్పోయి ఉసూరుమనిపించింది. కోహ్లి (0), షాబాజ్ అహ్మద్ (2), లోమ్రార్ (8), దినేశ్ కార్తీక్ (16), ప్రభుదేశాయ్ (0), హసరంగ (6) విజయ్‌కుమార్ వైశాఖ్ (0) గల్లీ క్రికెటర్ల కంటే హీనంగా బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా దినేశ్ కార్తీక్ అత్యంత దారుణంగా ఆడటమే కాకుండా ఇద్దరు రనౌట్ కావడంతో కీలకపాత్ర పోషించాడు.
బంతిని టచ్ చేసేందుకు కూడా ఇబ్బంది పడిన దినేశ్ కార్తీక్‌పై ఆర్సీబీ ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వీడెక్కడ దొరికాడు రా బాబు అంటూ తలలు బాదుకుంటున్నారు. కోహ్లి, డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్ లేకపోతే తమ పరిస్థితి ఏంటని బాధపడుతున్నారు. ప్రతి మ్యాచ్‌లో KGF (కోహ్లి, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఫాఫ్ డుప్లెసిస్) పైనే ఆధారపడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వీరు మినహాయించి ఒక్కరంటే ఒక్కరు కూడా బ్యాటింగ్‌లో రాణించలేకపోవడాన్ని సహించలేకపోతున్నారు.
మిగతా జట్లలో దేశీయ ఆటగాళ్లు పోటీపడి రాణిస్తుంటే, తమ జట్టులోని ఆటగాళ్లు పెవిలియన్‌కు క్యూకట్టడంతో పోటీపడుతున్నారని వాపోతున్నారు. షాబాజ్ అహ్మద్, మహిపాల్ లోమ్రార్, దినేశ్ కార్తీక్, సుయాశ్ ప్రభుదేశాయ్‌లను తూర్పారబెడుతున్నారు. వీరి కంటే గల్లీ క్రికెటర్లు వెయ్యి రెట్లు నయమని అంటున్నారు. వెంటనే వీరిని జట్టు నుంచి తప్పించి, టాలెంటెడ్ యంగ్ ప్లేయర్లను తీసుకోవాలని ఫ్రాంచైజీ యాజమాన్యాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment