PC: IPL Twitter
మే 21న జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ చేతిలో ఓటమితో ఐపీఎల్ 2023లో ఆర్సీబీ ప్రస్థానం ముగిసింది. దీంతో వరుసగా ఆ జట్టు 16వ ఎడిషన్‌లోనూ రిక్త హస్తాలతోనే లీగ్ నుంచి నిష్క్రమించింది. ప్రతి ఏడాది ఈ సారి కప్ మాదే అంటూ ఊదరగొట్టే ఆర్సీబీ.. ఈ ఏడాది కనీసం ప్లే ఆఫ్స్‌కు కూడా చేరకుండానే నిరాశగా లీగ్ నుంచి వైదొలిగింది. గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్‌లో ఆర్సీబీ పరిస్థితి మరింత దారుణంగా ఉన్నప్పటికీ.. డుప్లెసిస్ (14 మ్యాచ్‌ల్లో 730 పరుగులు), కోహ్లి (14 మ్యాచ్‌ల్లో 639 పరుగులు)లు జాకీలు వేసి పైకి లేపడంతో గ్రూప్ స్టేజ్ ఆఖరి మ్యాచ్ వరకు నెట్టుకొచ్చింది.
డుప్లెసిస్, కోహ్లిల తర్వాత అడపాదడపా మ్యాక్స్‌వెల్ (14 మ్యాచ్‌ల్లో 400 పరుగులు), సిరాజ్ (14 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు) రాణించడంతో ఆర్సీబీ 14 మ్యాచ్‌ల్లో కనీసం 7 మ్యాచ్‌ల్లోనైనా గెలవగలిగింది. వాస్తవానికి పైన పేర్కొన్న నలుగురి ప్రదర్శనలతో పాటు మిగతా జట్టు సభ్యులు నామమాత్రంగా రాణించినా ఆర్సీబీ 14 మ్యాచ్‌ల్లో కనీసం 9 మ్యాచ్‌ల్లోనైనా గెలవగలిగేదే. అయితే ఆ నలుగురు మినహాయించి ఒక్కరు కూడా కనీస ప్రదర్శన చేయకపోవడంతో ఆ జట్టుకు ఈ దుస్థితి దాపురించింది.
బౌలింగ్‌లో కర్ణ్ శర్మ (9 వికెట్లు), హసరంగ (9 వికెట్లు), వేన్ పార్నెల్ (9 వికెట్లు), విజయ్‌కుమార్ వైశాఖ్ (9 వికెట్లు) కాస్త పర్వాలేదనిపించినప్పటికీ, వారి నుంచి ఈ ప్రదర్శనలు సరిపోలేదు. వీరు ఏదో టెయిలెండర్ల వికెట్లు సాధించారే తప్పించి, పరుగులను నియంత్రించలేకపోయారు. పలు మ్యాచ్‌ల్లో ఆర్సీబీ 200కు పైగా పరుగులు సాధించినప్పటికీ, ఆ స్కోర్లను డిఫెండ్ చేసుకోలేక చతికిలపడింది.
ఆర్సీబీ బౌలింగ్ విభాగంలో దారుణంగా విఫలమైన వారిలో ఆల్‌రౌండర్ అని చెప్పుకునే షాబాజ్ అహ్మద్ (10 మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్, 42 పరుగులు), హర్షల్ పటేల్ (8 వికెట్లు) ముఖ్యులు. వీరిలో మరి ముఖ్యంగా హర్షల్ పటేల్ తన స్థాయికి తగ్గట్టుగా రాణించకపోగా, ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు.
ఇక ఈ ఏడాది ఆర్సీబీ వైఫల్యాలకు ముఖ్య కారకులుగా చెప్పుకునే బ్యాటింగ్ హీరోల గురించి మాట్లాడుకోవాలి. గతేడాది ప్రదర్శనతో గ్రేట్ ఫినిషర్‌గా కీర్తించబడిన దినేశ్ కార్తీక్ (13 మ్యాచ్‌ల్లో 140 పరుగులు, 4 డకౌట్లు).. ఈ ఏడాది అత్యంత దారుణంగా విఫలమై, ఆర్సీబీ ఓటములకు ప్రత్యక్ష కారణమయ్యాడు. డీకే తన స్థాయికి తగ్గట్టుగా ఆడి ఉంటే ఆర్సీబీ సునాయాసంగా మరో 2 మ్యాచ్‌లు గెలిచేది.
బ్యాటింగ్ విభాగంలో ఘోరంగా విఫలమైన మరో 4 ఆటగాళ్లు.. మహిపాల్ లోమ్రార్ (12 మ్యాచ్‌ల్లో 135 పరుగులు), షాబాజ్ అహ్మద్ (10 మ్యాచ్‌ల్లో 42 పరుగులు), అనూజ్ రావత్ (9 మ్యాచ్‌ల్లో 91), సుయాశ్ ప్రభుదేశాయ్ (5 మ్యాచ్‌ల్లో 35). వీరు గల్లీ క్రికెటర్ల కంటే హీనంగా బ్యాటింగ్ చేసి జట్టు ఓటముల్లో కీలకపాత్ర పోషించారు. డుప్లెసిస్-కోహ్లి జోడీ తొలి వికెట్‌కు రికార్డు స్థాయి భాగస్వామ్యాలు నమోదు చేసినప్పటికీ.. వీరు కనీస స్థాయి ఆట కూడా ఆడకుండా విఫలమయ్యారు.
మొత్తంగా చూస్తే ఆ నలుగురు (డెప్లెసిస్, కోహ్లి, మ్యాక్స్‌వెల్, సిరాజ్) మినహాయించి జట్టు మొత్తం విఫలం కావడంతో ఈ ఏడాది ప్లే ఆఫ్స్‌కు చేరకుండానే ఆర్సీబీ ఖేల్ ఖతమైంది. ఈ ఏడాది ఆర్సీబీ వైఫల్యాల్లో ముఖ్య కారకులపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
చదవండి: సెమీ ఫైనల్‌కు వెళ్లే అర్హత ఆర్సీబీకి లేదు: డుప్లెసిస్ వ్యాఖ్యలు వైరల్
Comments
Please login to add a commentAdd a comment