ఏబీ దూకుడు
బార్బాడాస్: కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో బార్బాడాస్ ట్రిడెంట్స్ స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ అదరగొట్టాడు. బుధవారం రాత్రి సెయింట్ కిట్స్-నేవిస్ పాట్రోయిట్స్ తో జరిగిన లీగ్ మ్యాచ్లో డివిలియర్స్ దూకుడుగా ఆడి జట్టు విజయంలో ప్రధాన భూమిక పోషించాడు. డివిలియర్స్(82; 54 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో బార్బాడాస్ 25 పరుగుల తేడాతో విజయం సాధించింది.
టాస్ గెలిచిన సెయింట్ కిట్స్ తొలుత బార్బాడాస్ ను బ్యాటింగ్ ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన బార్బాడాస్ కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు స్టీవ్ టేలర్(2), రీఫర్(1)లు నిరాశపరిచారు. ఆ తరుణంలో షోయబ్ మాలిక్(16)తో జతకలిసిన డివిలియర్స్ తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా డివీ మాత్రం దూకుడును కొనసాగించాడు.
38 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన ఏబీ.. ఆపై మరింత దాటిగా ఆడాడు. అయితే శతకానికి 18 పరుగుల దూరంలో కొట్రెల్ వేసిన స్లో బంతిని అంచనా వేయడంలో విఫలమైన డివీ ఆరో వికెట్ గా పెవిలియన్ కు చేరాడు. బార్బాడాస్ మిగతా ఆటగాళ్లలో పూరాంట్(38), పొలార్డ్(27)లు ఫర్వాలేదనిపించడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.
ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన సెయింట్ కిట్స్-నేవిస్ పాట్రోయిట్స్ 20.0 ఓవర్లలో 8 వికెట్లకు 155 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.సెయింట్ కిట్స్ జట్టులో డు ప్లెసిస్(42), కార్టర్(46) రాణించినా జట్టును ఓటమి నుంచి తప్పించలేకపోయారు. ఈ టోర్నీలో బార్బాడాస్ కు ఇది రెండో విజయం కాగా,సెయింట్ కిట్స్ ఇప్పటివరకూ ఒక గెలుపును మాత్రమే నమోదు చేసింది.