కోహ్లికి కోపమొచ్చింది!
సెంచూరియన్: తరచూ వివాదాలతో సహవాసం చేసే విరాట్ మరోసారి తన ఆగ్రహాన్ని వెళ్లగక్కాడు. వివరాల్లోకెళితే...అద్భుతమైన ఫామ్‌తో, రికార్డులతో దక్షిణాఫ్రికాలో అడుగు పెట్టిన కోహ్లి తొలి రెండు వన్డేల్లోనూ విఫలమయ్యాడు. కీపర్, స్లిప్స్‌లో క్యాచ్‌లు ఇచ్చి సునాయాస పద్ధతిలో నిష్ర్కమించాడు. వాండరర్స్‌లో జరిగిన తొలి వన్డేలో భీకరమైన స్టెయిన్ బౌలింగ్‌ను ఎదుర్కొనే క్రమంలో ఒక బంతి వేగంగా దూసుకొచ్చింది. పుల్ షాట్ ఆడే క్రమంలో అది పక్కటెముకలకు బలంగా తాకడంతో విరాట్ విలవిల్లాడిపోయాడు.
అయితే అసలు కథ ఇక్కడే మొదలైంది. బుధవారం మూడో వన్డే సందర్భంగా మ్యాచ్ ప్రసారకర్త ‘సూపర్ స్పోర్ట్స్’ ఈ విజువల్స్‌ను పదేపదే ప్రసారం చేసింది. ‘కోహ్లి మెత్తబడ్డాడా...’అంటూ వ్యాఖ్యను కూడా జోడించింది. అంతటితో ఆగిపోకుండా సదరు మ్యాచ్‌లో అవుటైన తర్వాత కోహ్లి డ్రెస్సింగ్ రూమ్‌లో ఐస్ ప్యాక్‌తో చికిత్స చేయించుకోవడం, పుల్ షాట్‌ను ప్రాక్టీస్ చేయడం స్లో మోషన్‌లో మళ్లీ మళ్లీ చూపించింది. ఇది కోహ్లికి తీవ్ర ఆగ్రహం తెప్పించడంతో జట్టు సభ్యులతో చర్చించాడు. దాంతో కోచ్ డంకన్ ఫ్లెచర్ నేతృత్వంలో టీమ్ మేనేజ్‌మెంట్... ప్రసారకర్త సూపర్ స్పోర్ట్స్ డెరైక్టర్‌ను నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌కే పిలిపించి వివరణ కోరింది. దానిని అనుచిత చర్యగా పేర్కొంటూ ఇకపై ‘క్రికెట్‌కే కట్టుబడాలని’ సలహా ఇచ్చింది. అందులో తప్పేమీ లేదంటూ చెప్పబోయిన అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
అందుకు కాదు!
సూపర్ స్పోర్ట్ డెరైక్టర్‌ను భారత టీమ్ మేనేజ్‌మెంట్ హెచ్చరించినట్లు వచ్చిన వార్తలను జట్టు ఖండించింది. ‘సూపర్ స్పోర్ట్ ప్రతినిధిని కలిసిన మాట వాస్తవమే. అయితే అది కోహ్లి క్లిప్ గురించి కాదు. మరో విషయం చర్చించడానికే. అది ఏమిటనేది మాత్రం చెప్పలేను’ అని జట్టు మీడియా మేనేజర్ ఆర్‌ఎన్ బాబా వివరణ ఇచ్చారు.