
సెంచూరియన్: దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు రసకందాయంలో పడింది. 376 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఇంగ్లండ్ శనివారం ఆట ముగిసే సమయానికి 41 ఓవర్లలో వికెట్ నష్టపోయి 121 పరుగులు చేసింది. ఇంగ్లండ్ విజయానికి మరో 255 పరుగులు కావాలి. ఇటు దక్షిణాఫ్రికా విజయం సాధించాలంటే మాత్రం మిగిలిన 9 వికెట్లను కూల్చాల్సిన పరిస్థితి. ఇంకో రెండు రోజుల ఆట మిగిలి ఉంది. ప్రస్తుతం బర్న్స్ (77 బ్యాటింగ్; 11 ఫోర్లు), డెన్లీ (10 బ్యాటింగ్, ఫోర్) క్రీజులో ఉన్నారు. అంతకుముందు 72/4తో మూడో రోజు ఆటను కొనసాగించిన దక్షిణాఫ్రికా 61.4 ఓవర్లలో 272 పరుగులకు ఆలౌటైంది. డస్సెన్ (51; 5 ఫోర్లు), ఫిలాండర్ (46; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. జోఫ్రా ఆర్చర్ (5/102)తో ఆకట్టుకున్నాడు.