ఇంగ్లండ్ అండర్-19 జట్టు కెప్టెన్‌గా ఇంగ్లండ్ మాజీ సారధి మైఖేల్ వాన్ కొడుకు ఆర్కీ వాన్ (Archie Vaughan) ఎంపికయ్యాడు. 19 ఏళ్ల ఆర్కీ వాన్ త్వరలో సౌతాఫ్రికాలో పర్యటించబోయే ఇంగ్లండ్ యువ జట్టును సారధిగా వ్యవహరించనున్నాడు. ఆర్కీ వాన్ తన తండ్రి మైఖేల్ వాన్ బాటలోనే ఇంగ్లండ్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.
మైఖేల్ వాన్ హయాం ఇంగ్లండ్ జట్టుకు స్వర్ణ యుగం లాంటిది. మైఖేల్ వాన్ కెప్టెన్సీలో ఇంగ్లండ్ 2005 యాషెస్ సిరీస్ నెగ్గింది. 18 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌కు లభించిన తొలి యాషెస్ విజయం ఇది. మైఖేల్ వాన్ 51 టెస్ట్‌ల్లో, 60 వన్డేల్లో ఇంగ్లండ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు.
మైఖేల్ వాన్ తనయుడు ఆర్కీ వాన్ తొలిసారి ఇంగ్లండ్ అంతర్జాతీయ జట్టుకు సారధిగా ఎంపికయ్యాడు. ఇంగ్లండ్ అండర్-19 జట్టు సౌతాఫ్రికా పర్యటనలో మూడు వన్డేలు, రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. సౌతాఫ్రికా పర్యటన జనవరి 17న ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో తొలుత వన్డే సిరీస్ జరుగనుంది. తొలి వన్డేకు కేప్‌టౌన్ ఆతిథ్యమివ్వనుంది. అనంతరం జనవరి 27న స్టెల్లెన్‌బాష్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభమవుతుంది.
ఆర్కీ వాన్ ఇటీవలే ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లోకి కూడా అడుగుపెట్టాడు. వాన్ సోమర్‌సెట్ తరఫున నాలుగు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. ఆర్కీ వాన్ తన స్వల్ప ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో అదరగొట్టాడు. బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అయిన వాన్ 236 పరుగులు చేసి 15 వికెట్లు పడగొట్టాడు. సర్రేపై ఆర్కీ వాన్ రెండు ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశాడు. ఆర్కీ వాన్ ఇటీవలే లిస్ట్-ఏ క్రికెట్‌లో కూడా అరంగేట్రం చేశాడు. మెట్రో బ్యాంక్ కప్ ఆర్కీ వాన్ తన తొలి 50 ఓవర్ల మ్యాచ్ ఆడాడు.
ఇటీవలి కాలంలో ఇంగ్లండ్ అండర్-19 జట్టుకు ఎంపికైన రెండో మాజీ ఆటగాడి తనయుడు ఆర్కీ వాన్. కొద్ది రోజుల కిందట ఇంగ్లండ్ దిగ్గజ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాప్ తనయుడు రాకీ ఫ్లింటాఫ్ ఇంగ్లండ్ అండర్-19 జట్టుకు ఎంపికయ్యాడు. అయితే ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటన కోసం ఎంపిక చేసిన ఇంగ్లండ్ యువ జట్టులో రాకీ ఫ్లింటాఫ్‌కు చోటు దక్కలేదు.
సౌతాఫ్రికా పర్యటన కోసం ఇంగ్లండ్ అండర్-19 జట్టు: ఆర్కీ వాన్ (కెప్టెన్), ఫర్హాన్ అహ్మద్, తజీమ్ అలీ, బెన్ డాకిన్స్, కేష్ ఫోన్సేకా, అలెక్స్ ఫ్రెంచ్, అలెక్స్ గ్రీన్, జాక్ హోమ్, జేమ్స్ ఇస్బెల్, ఎడ్డీ జాక్, బెన్ మాయెస్, జేమ్స్ మింటో, హ్యారీ మూర్, జో మూర్స్, థామస్ రెవ్, ఆర్యన్ సావంత్, నావ్య శర్మ, అలెగ్జాండర్ వేడే.
Comments
Please login to add a commentAdd a comment