మహిళల క్రికెట్‌లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఇద్దరు ఇంగ్లండ్ బ్యాటర్లు సెంచరీలు చేసి రికార్డులు సృష్టించారు. ఈ మ్యాచ్‌లో మయా బౌచియర్ (126), నాట్ సీవర్ బ్రంట్ (128) మూడంకెల మార్కును అందుకున్నారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 395 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ట్యామీ బేమౌంట్ 21, హీథర్ నైట్ 20, డేనియెల్ వ్యాట్ హాడ్జ్ 12, ఆమీ జోన్స్ 39, చార్లోట్ డీన్ 8, సోఫీ ఎక్లెస్టోన్ 21, ర్యానా మెక్ డోనాల్డ్ గే 2 పరుగులు చేసి ఔట్ కాగా.. లారెన్ ఫైలర్ (0), లారెన్ బెల్ (0) అజేయంగా నిలిచారు. సౌతాఫ్రికా బౌలర్లలో మ్లాబా నాలుగు వికెట్లు పడగొట్టగా.. అయాండా హ్లుబి 2, తుమీ సెఖుఖునే, మారిజన్ కాప్ తలో వికెట్ దక్కించుకున్నారు.
అరంగేట్రంలోనే సెంచరీ
మయా బౌచియర్ అరంగేట్రంలోనే సెంచరీ చేసి రికార్డుల్లోకెక్కింది. అరంగేట్రంలో సెంచరీ చేసిన 14వ మహిళా క్రికెటర్‌గా బౌచియర్ రికార్డు సృష్టించింది. బౌచియర్ తన సెంచరీ మార్కును కేవలం 124 బంతుల్లో అందుకుంది. తద్వారా మహిళల క్రికెట్‌లో ఫాస్టెస్ట్ టెస్ట్ సెంచరీ చేసిన ఐదో బ్యాటర్‌గానూ రికార్డు నెలకొల్పింది.
ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన నాట్ సీవర్
మహిళల క్రికెట్‌లో ఫాస్టెస్ట్ టెస్ట్ సెంచరీ చేసిన ఘనత నాట్ సీవర్ బ్రంట్ దక్కింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో బ్రంట్ ఈ ఫీట్‌ను సాధించింది. బ్రంట్ కేవలం 96 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకుంది. మహిళల క్రికెట్‌లో ఎవ్వరూ 100లోపు బంతుల్లో టెస్ట్ సెంచరీ పూర్తి చేయలేదు. మహిళల క్రికెట్‌లో టాప్-5 ఫాస్టెస్ట్ సెంచరీల్లో నాలుగు దక్షిణాఫ్రికాపైనే నమోదు కావడం విశేషం.
మహిళల క్రికెట్‌లో ఫాస్టెస్ట్ టెస్ట్ సెంచరీలు..
నాట్ సీవర్ బ్రంట్-96 బంతుల్లో సౌతాఫ్రికాపై
చమానీ సెనెవిరతన-106 బంతుల్లో పాకిస్తాన్‌పై
షఫాలీ వర్మ-113 బంతుల్లో సౌతాఫ్రికాపై
స్మృతి మంధన-122 బంతుల్లో సౌతాఫ్రికాపై
మయా బౌచియర్-124 బంతుల్లో సౌతాఫ్రికాపై
Comments
Please login to add a commentAdd a comment