టైటిల్‌ వేటలో తెలుగు టైటాన్స్‌ | Abozar Mighani to captain Telugu Titans | Sakshi
Sakshi News home page

టైటిల్‌ వేటలో తెలుగు టైటాన్స్‌

Published Fri, Jul 19 2019 4:57 AM | Last Updated on Fri, Jul 19 2019 5:24 AM

Abozar Mighani to captain Telugu Titans - Sakshi

కబడ్డీ... కబడ్డీ... అంటూ ఆరేళ్లుగా తెలుగు టైటాన్స్‌ ఆడుతోంది. కానీ టైటిల్‌ వేటలో కనీసం ఫైనల్‌ మెట్టయినా ఎక్కలేకపోయింది. ఈ సారైనా ఆ ముచ్చట తీర్చుకునేందుకు టైటాన్స్‌ కష్టపడుతోంది. జట్టులో మార్పులు కూడా చేసింది. కొత్త కెప్టెన్, కొత్త కోచ్‌లతో జట్టు కూత పెట్టేందుకు సిద్ధమైంది. మరీ ఈ కూత ఎందాకో తెలియాలంటే మనం మూడు నెలలు ఆగాలి! ఎందుకంటే ఫైనల్‌ అక్టోబర్‌లో కదా జరిగేది!!  

సాక్షి, హైదరాబాద్‌: ఈ సీజన్‌లో కసిదీరా ఆడేందుకు తెలుగు టైటాన్స్‌ సన్నద్ధమైంది. ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) ఏడో సీజన్‌ ఆరంభమే హైదరాబాద్‌లో జరగనుండటంతో తొలి అంచె పోటీల్లో స్థిరమైన విజయాలు సాధించాలని ఆశిస్తోంది. ఆరేళ్లుగా టైటాన్స్‌ ఆశల పల్లకి మోసిన స్టార్‌ రైడర్‌ రాహుల్‌ చౌదరి  జట్టును వీడాడు. అతని స్థానంలో మరో స్టార్‌ రైడర్‌ సిద్ధార్థ్‌ దేశాయ్‌ రాగా... సారథ్య బాధ్యతల్ని ఇరానీ డిఫెండర్‌ అబొజర్‌ మిఘానికి అప్పగించింది. చీఫ్‌ కోచ్‌గా ఇరాన్‌కు చెందిన గోలమ్‌ రెజాను నియమించింది. ఇలా జట్టుకు కొత్త దిశను చూపిన యాజమాన్యం తమ దశమారాలని గంపెడాశతో బరిలోకి దిగుతోంది.  

డిఫెండర్లపై విశ్వాసం
ఈ సారి జట్టు కుర్రాళ్లపై నమ్మకముంచింది. దీంతో అనుభవజ్ఞులకంటే యువ ఆటగాళ్లే తొడగొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా డిఫెన్స్‌లో విశాల్‌ భరద్వాజ్, కెప్టెన్‌ అబొజర్‌ మిఘానిలు ఓ పట్టుపడితే ప్రత్యర్థులకు కష్టాలు తప్పవు. గత సీజన్‌లో విశాల్‌ చక్కగా రాణించాడు. 60 టాకిల్‌ పాయింట్లు సాధించిన అతడు సగటున మ్యాచ్‌కు మూడున్నర పాయింట్లు తెచ్చిపెట్టాడు. ఆరో సీజన్‌లో మూడో ఉత్తమ ప్రదర్శన అతనిదే. ఇక రైట్‌ కార్నర్‌లో మెరుగైన డిఫెండర్‌ అబొజర్‌. కీలక సమయంలో ప్రత్యర్థులను, పాయింట్లను ఒడిసి పట్టాడు. ఆరో సీజన్‌లో అతను విశాల్‌కు కాస్త తక్కువగా 57 పాయింట్లు సాధించాడు. 2.7 సగటు నమోదు చేశాడు. రైడర్ల పాలిట వీళ్లిద్దరు టైటాన్స్‌కు బ్రహ్మాస్త్రాలైతే తెలుగు జట్టుకు తిరుగుండదు. యు ముంబా మాజీ కోచ్‌ అయిన గొలమ్‌ రెజాను చీఫ్‌ కోచ్‌గా నియమించడం, కెప్టెన్‌ కూడా ఇరానీ ఆటగాడే కావడం... ఇద్దరి సమన్వయం జట్టుకు దోహదం చేసే అవకాశముంది.

కలిసిరాని హైదరాబాద్‌
టైటాన్స్‌కు ఇప్పటివరకు సొంత మైదానం కలిసిరాలేదు. ఆరు సీజన్‌లలో మూడు వైజాగ్‌లో ఆడగా మరో మూడు ఇక్కడే ఆడింది. ఆడిన మూడు సీజన్లూ హైదరాబాదీ అభిమానుల్ని టైటాన్స్‌ నిరాశపరిచింది. ఓవరాల్‌గా 16 మ్యాచ్‌లాడిన తెలుగు టైటాన్స్‌ కేవలం ఐదే మ్యాచ్‌లు గెలిచింది. 9 మ్యాచ్‌లో ఓటమి ఎదురవగా... రెండు టైగా ముగిశాయి. ఈ సారైనా తమ తలరాత మారాలని జట్టు ఆశిస్తోంది.  

సెమీసే అత్యుత్తమం
తెలుగు టైటాన్స్‌ 6 సీజన్లు పోరాడినా టైటిల్‌ వేటలో ఒక్కసారి కూడా నిలువలేకపోయింది. పీకేఎల్‌లో తెలుగు టీమ్‌ అత్యుత్తమ ప్రదర్శన సెమీఫైనలే! రెండు, నాలుగో సీజన్‌లలో రెండు సార్లు సెమీస్‌ చేరింది. గత రెండు సీజన్‌లలోనూ పేలవమైన ప్రదర్శనతో జోన్‌ ‘బి’లో ఐదో స్థానంలో నిలిచింది.  మొత్తమ్మీద ఈ ఆరేళ్లలో గెలిచిన మ్యాచ్‌లకంటే ఓడిన మ్యాచ్‌లే ఎక్కువ! 104 మ్యాచ్‌లాడిన టైటాన్స్‌ జట్టు 45 మ్యాచ్‌ల్లో గెలుపొందగా... 47 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. మరో 13 టైగా ముగిశాయి.  

తెలుగు టైటాన్స్‌ జట్టు
అబొజర్‌ (కెప్టెన్‌), విశాల్, అరుణ్, కృష్ణ, మనీశ్, ఆకాశ్, ఆకాశ్‌ దత్తు (డిఫెండర్లు); సిద్ధార్థ్‌ దేశాయ్, అమిత్, అంకిత్, కమల్, ముల శివ, రజనీశ్, రాకేశ్, సూరజ్, మల్లికార్జున్, (రైడర్లు); అర్మాన్, ఫర్హాద్‌ మిలగర్దన్‌ (ఆల్‌రౌండర్లు).

అందరి కళ్లు సిద్ధార్థ్‌పైనే
సిద్ధార్థ్‌ దేశాయ్‌... ఒక్క సీజన్‌తో స్టార్‌ అయిన మహారాష్ట్ర ఆటగాడు. గతేడాది యు ముంబా తరఫున కూత పెట్టించాడు. సంచలన రైడింగ్‌ ప్రదర్శనతో ప్రత్యర్థులను హడలెత్తించాడు. లీగ్‌లో గత సీజన్‌ మాత్రమే ఆడిన ఈ మహారాష్ట్ర కబడ్డీ ప్లేయర్‌పై తెలుగు టైటాన్స్‌ భారీ ఆశలే పెట్టుకుంది. అందుకనే ఏకంగా సుమారు రూ. కోటిన్నర (రూ.1.45 కోట్లు) వెచ్చించి మరీ అతన్ని కొనుక్కుంది. ప్రొ కబడ్డీ వేలంలోనే ఇది అత్యధిక మొత్తం కావడం విశేషం. రాహుల్‌ చౌదరి తరలిపోయిన లోటును దేశాయ్‌ సమర్థంగా భర్తీ చేయగలడనే విశ్వాసంతో టైటాన్స్‌ యాజమాన్యం ఎంత మొత్తానికైనా వెనుకాడలేదు. నిజంగా సిద్ధార్థ్‌కు అంత సీనుందా అంటే... గత సీజన్‌ ప్రదర్శన చూస్తే ఔననాల్సిందే.


పీకేఎల్‌–6లో ఆడిన 21 మ్యాచ్‌ల్లో ఏకంగా 218 పాయింట్లు సాధించాడు. సగటున మ్యాచ్‌కు 10 పాయింట్లు తెచ్చిపెట్టిన రైడర్‌గా నిలిచాడు. అందుకే ‘ఎమర్జింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’ అవార్డును ఎగరేసుకుపోయాడు. గత సీజన్‌లో కేవలం ముగ్గురు రైడర్లే ఈ ఘనత సాధించారు. ఇక ప్రస్తుత తెలుగు టైటాన్స్‌ రైడర్లంతా కలిపి చేసిన పాయింట్లు (69), సిద్ధార్థ్‌ ఒక్కడే చేసిన పాయింట్లకూ ఎంతో వ్యత్యాసముంది. అతని సగం పాయింట్లకు సరిపోని దూరంలో ఉన్నాయి.  ఈ ఖరీదైన ఆటగాడు మంచి పాటగాడు (గాయకుడు) కూడా! అంతేనా... డ్యాన్సర్‌ కూడా. బరిలో కూత పెట్టడమే కాదు... మ్యాచ్‌లు గెలిస్తే ఆటపాటలతో హోరెత్తిస్తానంటున్నాడు సిద్ధార్థ్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement