
సాక్షి, హైదరాబాద్: కెరీర్‌లో పలు మార్లు గాయాలు, ఫిట్‌నెస్ సమస్యలతో బాధ పడిన లెఫ్టార్మ్ పేసర్ ఆశిష్ నెహ్రా జట్టులోకి ఎన్నో సార్లు వచ్చి పోయాడు. కానీ ఏకంగా ఐదేళ్ళ విరామం తర్వాత 2016 జనవరిలో టి20 జట్టులోకి అతని పునరాగమనం ఆశ్చర్యం కలిగించింది. గత రెండేళ్ల కాలంలో అతనికి తుది జట్టులో చోటు లభించని మ్యాచ్ లేదు. ఇప్పుడు ఆసీస్‌తో తొలి రెండు మ్యాచ్‌లలో అతను ఆడలేదు. ఇప్పుడు ఇదే కారణంతో అతను రిటైర్మెంట్‌కు సిద్ధమయ్యాడు. నవంబర్ 1న సొంత మైదానం ఢిల్లీలో న్యూజిలాండ్‌తో జరిగే టి20 మ్యాచ్‌తో నెహ్రా అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నాడు. 1999లో అరంగేట్రం చేసిన నెహ్రా కెరీర్ 18 ఏళ్లు సాగడం విశేషం. ఈ నేపథ్యంలో గురువారం ఉప్పల్ స్టేడియంలో పలు అంశాలపై మీడియాతో నెహ్రా వెలిబుచ్చిన అభిప్రాయాలు అతని మాటల్లోనే...
►ఈ సిరీస్‌కు ఎంపికయ్యాక బౌలింగ్ చేసేందుకు నేను పూర్తి సన్నద్ధతతో వచ్చాను. నా ఆలోచనలు కెప్టెన్, కోచ్‌తో పంచుకున్నాను. ఎందుకంటే నెహ్రా జట్టుతో ఉన్నాడంటే తుది జట్టులో కచ్చితంగా ఉంటాడు. గత
రెండేళ్లలో నేను బయట కూర్చోవడం ఎప్పుడైనా చూశారా?
►అయితే ఏదో ఒక దశలో రిటైర్ కావాల్సి ఉంటుందని తెలుసు. ఇది ఒక్కసారిగా తీసుకున్న నిర్ణయం కాదు. ఎవరైనా ఇంకా ఎందుకు ఆడటం లేదు అంటే బాగుంటుంది కానీ ఇంకా ఆడుతున్నాడా అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. అయితే ఏం కష్టపడినా భారత జట్టుకు ఆడటం కోసమే. కాబట్టి నేను ఐపీఎల్ వైపు తిరిగి కూడా చూడను. భారత్‌కు ఆడనప్పుడు ఐపీఎల్‌లో ఆడటం అనవసరం అనేది నా ఉద్దేశం.