ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆగస్టు 9, 10 తేదీల్లో డైమండ్ జూబ్లీ వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఏసీఏ ప్రధాన కార్యదర్శి, నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు తెలిపారు.
ఆగస్టు 9, 10 తేదీల్లో వైజాగ్ ఆతిథ్యం
విజయవాడ స్పోర్ట్స్: ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆగస్టు 9, 10 తేదీల్లో డైమండ్ జూబ్లీ వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఏసీఏ ప్రధాన కార్యదర్శి, నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు తెలిపారు. ఈ కార్యక్రమానికి విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి-ఏసీఏ క్రికెట్ స్టేడియం ఆతిథ్యం ఇస్తుందన్నారు.
ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.... ఆగస్టు 9వ తేదీ జరిగే కార్యక్రమాలకు టీమిండియా మాజీ క్రికెటర్లు అనిల్ కుంబ్లే, జవగళ్ శ్రీనాథ్, వీవీఎస్ లక్ష్మణ్... 10వ తేదీన జరిగే కార్యక్రమాలకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చైర్మన్ ఎన్.శ్రీనివాసన్ హాజరవుతారన్నారు. ఈ వేడుకలకు సీఎం చంద్రబాబును కూడా ఆహ్వానించామని తెలిపారు. ఎంతో ముందుచూపుతోనే 1953లో 13 జిల్లాలతో కూడిన ఆంధ్ర క్రికెట్ సంఘం ఏర్పాటైందన్నారు.
వేడుకల్లో ఆంధ్ర జట్టుకు ఆడిన మొత్తం 107 మంది మాజీ క్రికెటర్లకు రూ. 2.2 కోట్లు నగదు సాయం అందజేయనున్నట్లు తెలిపారు. ఏసీఏ 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాది అక్టోబరు, నవంబరులో భారత్‌లో పర్యటించే వెస్టిండీస్ జట్టుతో జరిగే వన్డే మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్‌ను బీసీసీఐ విశాఖపట్నానికి కేటాయించిందన్నారు. ఏసీఏ డైమండ్ జూబ్లీ పోస్టల్ స్టాంప్‌లను గంగరాజు సమావేశంలో ఆవిష్కరించారు. ఏసీఏ సర్వసభ్య సమావేశం అనంతరం గంగరాజును సభ్యులు సన్మానించారు.