1929 తరువాత ఇదే తొలిసారి
ముంబై:ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా భారత్ తో ఇక్కడ జరుగుతున్న నాల్గో టెస్టులో ఇంగ్లండ్ లెగ్ స్పిన్నర్ ఆదిలో రషిద్ ఒక అరుదైన రికార్డును అధిగమించడానికి వికెట్ దూరంలో ఉన్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో ఆదిల్ రషిద్ నాలుగు వికెట్లను సాధించాడు. దాంతో ఒక సిరీస్లో 22 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.భువనేశ్వర్ కుమార్ను అవుట్ చేయడం ద్వారా రషిద్ ఈ సిరీస్లో 22వ వికెట్ సాధించాడు. ఇలా ఒక ఇంగ్లండ్ లెగ్ స్పిన్నర్ ఒక సిరీస్లో 22 వికెట్లను తీయడం 1929వ నుంచి చూస్తే ఇదే తొలిసారి. దాదాపు 87 ఏళ్ల క్రితం స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్లో లెగ్ స్పిన్నర్ టిచ్ ఫ్రీమెన్ ఒక సిరీస్లో 22 వికెట్లు సాధించగా.. ఆ తరువాత ఇంతకాలానికి ఫ్రీమెన్ సరసన రషిద్ నిలిచాడు.
రాజ్ కోట్ లో జరిగిన తొలి టెస్టులో రషిద్ ఏడు వికెట్లు సాధించాడు. తొలి ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు తీయగా, రెండో ఇన్నింగ్స్ లో మూడు వికెట్లు సాధించాడు. విశాఖలో జరిగిన రెండో టెస్టులో ఆరు వికెట్లను రషిద్ తీయగా, మూడో టెస్టులో ఐదు వికెట్లు సాధించాడు.