విరాట్ సూపర్ షో!
ముంబై: భారత క్రికెట్ టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి మరోసారి విశ్వరూపం ప్రదర్శించాడు. ఇంగ్లండ్తో ఇక్కడ వాంఖేడ్ స్టేడియంలో జరుగుతున్న నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్ విరాట్ డబుల్ సెంచరీ సాధించాడు. 302 బంతుల్లో 23 ఫోర్ల సాయంతో డబుల్ మార్కును చేరాడు. ఇది అతని టెస్టు కెరీర్లో మూడో డబుల్ సెంచరీ కాగా, ఈ ఏడాదే వాటిని సాధించడం మరో విశేషం. ఇదిలా ఉండగా మూడు డబుల్ సెంచరీలు సాధించిన తొలి భారత క్రికెట్ కెప్టెన్గా విరాట్ రికార్డు నెలకొల్పాడు.
451/7 ఓవర్ నైట్ స్కోరుతో నాల్గో రోజు ఆదివారం ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్.. తొలి సెషన్లో పూర్తి ఆధిపత్యం చెలాయించింది.ఓవర్ నైట్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి-జయంత్ యాదవ్లో కీలక భాగస్వామ్యాన్ని సాధించి జట్టును మరింత పటిష్ట స్థితిలో నిలిపారు. ఈ ఇద్దరూ దాదాపు 190కు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో భారత్కు తిరుగేలేకుండా పోయింది. ఈ క్రమంలోనే విరాట్ డబుల్ సెంచరీ సాధించాడు. ఇందులో కేవలం 23 ఫోర్లు మాత్రమే ఉండగా, మిగతా వందకు పైగా పరుగులను సింగిల్స్, డబుల్స్ ద్వారానే సాధించాడు. మరొకవైపు విరాట్ డబుల్ పూర్తి చేసే సమయానికి జయంత్ 84 పరుగులతో క్రీజ్లో ఉన్నాడు.