
అశ్విన్ అదుర్స్!
ముంబై: టీమిండియా విజయం సాధించాలంటే స్సిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ చేయి పడాల్సిందే. తన టెస్టు కెరీర్ ఆరంభించిన ఐదేళ్లలో భారత్ సాధించిన విజయాల్లో అశ్విన్దే కీలకపాత్ర. అశ్విన్ అరంగేట్రం చేసిన తరువాత భారత్ ఎనిమిది టెస్టు సిరీస్లు గెలిచింది. అందులో ఏడుసార్లు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులను అశ్విన్ గెలుకున్నాడంటే అతని పాత్ర ఏమిటో అర్థమవుతోంది. ఈ క్రమంలోనే అతని ఖాతాలో ఎన్నో రికార్డులు చేరాయి.
అయితే తాజాగా ఇంగ్లండ్తో జరుగుతున్న నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్లో కూడా అశ్విన్ అదరగొట్టాడు. ఇంగ్లండ్ కోల్పోయిన ఏడు వికెట్లలో ఐదు వికెట్లను సాధించి సత్తా చాటుకున్నాడు. తద్వారా భారత్ తరపున ఐదు వికెట్లను 23 సార్లు సాధించి మాజీ దిగ్గజ బౌలర్ కపిల్ దేవ్ సరసన నిలిచాడు. ఈ ఘనతను సాధించి అత్యధికంగా 5 వికెట్లు తీసిన భారత బౌలర్లలో మూడో స్థానంలో నిలిచాడు. అంతకుముందు కపిల్ తన టెస్టు కెరీర్లో కూడా 23 సార్లు ఐదు వికెట్లను సాధించిన సంగతి తెలిసిందే. కాగా, అత్యధికంగా ఐదు వికెట్లు తీసిన భారత బౌలర్లలో అనిల్ కుంబ్లే(35)తొలిస్థానంలో ఉండగా, హర్భజన్ సింగ్(25) రెండోస్థానంలో ఉన్నాడు.
ఇదిలా ఉండగా, 288/5 ఓవర్ నైట్ స్కోరుతో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ ఆదిలోనే బెన్ స్టోక్స్(31)వికెట్ ను కోల్పోయింది. బెన్ స్టోక్స్ను అశ్విన్ పెవిలియన్ కు పంపి భారత్ కు మంచి ఆరంభాన్నిచ్చాడు. అనంతరం వోక్స్(11), రషిద్(4) లను జడేజా అవుట్ చేయడంతో ఇంగ్లండ్ 334 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ ను నష్టపోయింది.