ముంబై: భారత్తో ఇక్కడ జరుగుతున్న నాల్గో టెస్టు తొలి రోజు ఆటలో ఇంగ్లండ్ ఆధిపత్యం కొనసాగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ ఆట ముగిసే సమయానికి ఐదు వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసి పై చేయి సాధించింది. ఇంగ్లండ్ ఆటగాళ్లలో కీనట్ జెన్నింగ్స్(112;219 బంతుల్లో 13 ఫోర్లు) శతకం సాధించగా, అలెస్టర్ కుక్(46) తృటిలో హాఫ్ సెంచరీ కోల్పోయాడు. ఈ జోడి తొలి వికెట్ కు 99 పరుగులు జోడించిన తరువాత కుక్ పెవిలియన్ చేరాడు. రవీంద్ర జడేజా బౌలింగ్లో ముందుకొచ్చి ఆడబోయిన కుక్ను పార్థీవ్ పటేల్ స్టంపింగ్ చేశాడు. దాంతో లంచ్ కు ముందే ఇంగ్లండ్ వికెట్ ను కోల్పోయింది. కాగా, ఆ తరువాత జెన్నింగ్స్ తో కలిసిన జో రూట్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దే యత్నం చేశాడు.అయితే రూట్(21)ను అశ్విన్ పెవిలియన్ కు పంపడంతో ఇంగ్లండ్ కొద్దిగా కష్టాల్లో పడినట్లు కనిపించింది.
ఆ తరుణంలో జెన్నింగ్స్-మొయిన్ అలీల జోడి భారత బౌలర్లకు పరీక్షగా నిలిచింది. మూడో వికెట్కు 94 పరుగులు జోడించి ఇంగ్లండ్ను పటిష్ట స్థితిలో నిలిపింది. ఈ క్రమంలోనే అలీ(50) అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. కాగా, జట్టు స్కోరు 230 పరుగుల వద్ద ఉండగా అలీ మూడో వికెట్ గా అశ్విన్ అవుట్ చేశాడు. ఆ వెంటనే జెన్నింగ్స్ను కూడా అశ్విన్ పెవిలియన్ కు పంపి భారత్ కు చక్కటి బ్రేక్ ఇచ్చాడు. మరో 19 పరుగుల వ్యవధిలో బెయిర్ స్టో(14)కూడా అశ్విన్ కు చిక్కడంతో భారత్ పట్టు సాధించినట్లు కనబడింది. అయితే ఆ తరువాత బెన్ స్టోక్స్(25 బ్యాటింగ్), బట్లర్(18 బ్యాటింగ్)లు మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడటంతో మళ్లీ ఇంగ్లండ్దే పైచేయి అయ్యింది.
కుక్ అరుదైన ఘనత
ఇంగ్లండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. భారత్పై టెస్టుల్లో రెండువేల పరుగులకు పైగా సాధించిన విదేశీ క్రికెటర్ల జాబితాలో కుక్ స్థానం సంపాదించాడు. ఇప్పటివరకూ ఐదుగురు విదేశీ ఆటగాళ్లు మాత్రమే భారత్పై రెండు వేలు, అంతకు పైగా పరుగులు సాధించగా, కుక్ ఆరో స్థానంలో నిలిచాడు. అయితే టీమిండియాపై టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్(2555)తొలి స్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్లో కుక్(46) కొద్దిలో హాఫ్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు.
జెన్నింగ్స్ 'సెంచరీ' రికార్డు
ఇంగ్లండ్ ఓపెనర్ కీనట్ జెన్నింగ్స్ అరుదైన మైలురాయిని సొంతం చేసుకున్నాడు. ఈ స్టేడియంలో టెస్టు అరంగేట్రం చేసి సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. అంతకుముందు 2006లో ఇంగ్లండ్ ఆటగాడు ఓవై షా ఇక్కడ చేసిన 88 పరుగులే ఇక్కడ ఇప్పటివరకూ అరంగేట్రపు అత్యధిక వ్యక్తిగత స్కోరు. తాజాగా దాన్ని జెన్నింగ్స్ అధిగమించాడు. మరొకవైపు భారత్ లో 2006 నుంచి చూస్తే అరంగేట్రంలోనే 50కి పైగా సాధించిన ఐదో ఇంగ్లండ్ ఆటగాడిగా జెన్నింగ్స్ నిలిచాడు.