
లండన్: ఆదిల్ రషీద్ టెస్టు మ్యాచ్ ఆడి దాదాపు రెండేళ్లు అవుతోంది. 10 మ్యాచ్‌ల కెరీర్‌లో అతి పేలవమైన 42.78 సగటుతో అతను తీసింది 38 వికెట్లు. వారు వీరనే తేడా లేకుండా ప్రతీ బ్యాట్స్‌మెన్ అతడిని చితక్కొట్టారు. దాంతో ఈ ఎర్ర బంతితో బౌలింగ్ చేయడం తన వల్ల కాదంటూ గత ఫిబ్రవరి నుంచి కౌంటీల్లో వన్డేలు, టి20లకే పరిమితమయ్యాడు. సంవత్సర కాలంగా ఫస్ట్ క్లాస్ క్రికెట్ పూర్తిగా మానేశాడు. అయినా సరే రషీద్ వన్డే ఫామ్ చూసిన తర్వాత ఇంగ్లండ్ సెలక్టర్లు అతను టెస్టుల్లో కూడా భారత జట్టును ఇబ్బంది పెట్టగలడని భావించినట్లున్నారు! అందుకే టీమిండియాతో జరిగే తొలి టెస్టు కోసం ప్రకటించిన జట్టులో రషీద్‌ను ఎంపిక చేశారు. 13 మంది సభ్యుల ఈ టీమ్‌లో ఆఫ్‌స్పిన్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీకి కూడా కూడా చోటు దక్కింది. గత మూడేళ్లుగా కౌంటీల్లో రాణిస్తున్న పేస్ బౌలర్ జేమీ పోర్టర్‌కు తొలి అవకాశం దక్కింది.
తొలి టెస్టుకు ఇంగ్లండ్ జట్టు: రూట్ (కెప్టెన్), అలీ, అండర్సన్, బెయిర్‌స్టో, బ్రాడ్, బట్లర్, కుక్, స్యామ్ కరన్, జెన్నింగ్స్, మలాన్, పోర్టర్, రషీద్, స్టోక్స్.