లండన్: ఎవరి తలరాతైనా మారడానికి ఒకే ఒక్క క్షణం చాలు. అదే విధంగా ఒక క్రికెటర్ వికెట్, క్యాచ్, ఆఖరికి ఒక్క పరుగు సాధించి కూడా హీరో అయిన సందర్భాలు అనేకం. నిదహాస్ ట్రోఫీలో బంగ్లాదేశ్‌తో జరిగిన పైనల్ మ్యాచ్‌లో వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ఆఖరి బంతికి సిక్స్ కొట్టి టీమిండియాకు కప్పు అందించి.. నమ్మదగిన ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.
ఇలాంటి అనుభూతినే ఇంగ్లండ్ లెగ్ స్పిన్నర్ అదిల్ రషీద్ ఆస్వాదిస్తున్నాడు. టీమిండియాతో జరిగిన నిర్ణయాత్మకమైన మూడో మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ కైవసం చేసుకున్నవిషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో సాఫీగా సాగుతున్న భారత్ ఇన్నింగ్స్‌ను దెబ్బతీసింది అదిల్ రషీదే. జోరు మీదున్న టీమిండియా సారథి విరాట్ కోహ్లి ని అద్భుత బంతితో క్లీన్ బౌల్డ్ చేసి ఇన్నింగ్స్ స్వరూపాన్నే మార్చేశాడు. ఇదే ఇప్పుడు రషీద్ పాలిట అదృష్టంగా మారింది.. టెస్టుల్లో పునరాగమనానికి మార్గం సుగమం చేసింది.
సుమారు రెండేళ్ల తర్వాత?
అదిల్ రషీద్ ఇప్పటివరకు ఆడిన పది టెస్టుల్లో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో ఇంగ్లండ్ సెలక్టర్లు టెస్టులకు ఈ ఆటగాడిని పక్కకు పెట్టి వన్డే, టీ20లకే పరిమితం చేశారు. ఈ లెగ్ స్పిన్నర్ ఆడిన చివరి టెస్టు 2016లో భారత్ పైనే. ఇప్పుడు సుమారు రెండు సంవత్సరాల తర్వాత టెస్టు జట్టులో చోటు దక్కే అవకాశం లభించింది. భారత్‌తో వన్డే సిరీస్‌లో రాణించడంతో సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఇంగ్లండ్‌కు టెస్టుల్లో సీనియర్ స్పిన్నర్ లేకపోవడం, వన్డేల్లో అదరగొట్టిన ఈ ముప్పై ఏళ్ల ఆటగాడిని టెస్టుల్లో ఎంపిక చేయాలనే ఆలోచనలో సెలక్టర్లు ఉన్నట్టు సమాచారం.
తొలి లెగ్‌స్పిన్నర్..
స్పిన్ బౌలింగ్‌ను అవలీలగా ఎదుర్కొని పరుగులు సాధించే టీమిండియా సారథిని రషీద్ ఔట్ చేసి అరుదైన ఘనతన సాధించాడు. ఇప్పటివరకు లెగ్ స్పిన్నర్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లి క్లీన్‌బౌల్డ్ కాలేదు. ఇంగ్లండ్‌తో నిర్ణయాత్మకమైన మ్యాచ్‌లో కోహ్లిని రషీద్ క్లీన్‌బౌల్డ్ చేసి ఆ రికార్డును తుడిచిపాడేశాడు.
చదవండి: ఆ బంతికి బిత్తరపోయిన కోహ్లి
Comments
Please login to add a commentAdd a comment