మాస్కో: ఫిఫా ప్రపంచకప్ అందరి సరదాను తీరుస్తుందంటారు. అనుకోని జట్లు అద్బుత విజయాలతో దూసుకపోతుంటే.. ఫేవరేట్‌గా బరిలోకి దిగిన జట్లు చతికిలపడుతుంటాయి. సాకర్ సమరంలో ఒక ఘట్టం(గ్రూప్ దశ) పూర్తయింది. ఇక ప్రతీ మ్యాచ్ అన్ని జట్లకు చావోరేవో. చిన్నచితకా జట్లు, ఆగ్రశ్రేణి జట్లను మట్టి కరిపించి ఇంటికి పంపించిన ఈ మెగా టోర్నీలో ఆఫ్రికా అభిమానుల కోరిక మాత్రం తీరకుండా అలాగే మిగిలి ఉంది. తమ ఖండపు జట్టు కనీసం సెమీస్‌కు చేరాలనుకున్న ఆఫ్రికన్ అభిమానుల ఆశలు ఈసారి కూడా ఆవిరయ్యాయి. రష్యాలో జరుగుతున్న ఈ ప్రపంచకప్‌లో ఏ ఆఫ్రికా జట్టు రౌండ్16కు చేరలేకపోయింది. 1982 తర్వాత ఆఫ్రికా ఖండపు జట్టు నాకౌట్‌కు చేరకపోవడం ఇదే తొలిసారి.
రష్యాలో జరుగుతున్న ఈ మెగా టోర్నీకి ఈసారి అత్యధికంగా ఐదు ఆఫ్రికా జట్లు(నైజీరియా, మొరాకో, ట్యూనీషియా, ఈజిప్ట్, సెనెగల్) అర్హత సాధించాయి. అయితే ఈ దఫా విశ్వసమరంలో ఆఫ్రికా జట్లకు అదృష్టం కలిసి రాలేదు. గ్రూప్ హెచ్‌లో జపాన్, సెనెగల్ జట్లకు సమాన పాయింట్లు లభించినా ఫెయిర్ ప్లే కింద జపాన్(ఆసియా నుంచి ఏకైక జట్టు) రౌండ్ 16లోకి అడుగుపెట్టగా.. సెనెగల్ టోర్నీ నుంచి నిష్ర్కమించింది. దీంతో ఒక్క జట్టైనా నాకౌట్‌కు చేరుతుందనుకున్న ఆఫ్రికా అభిమానుల ఆశలు ఆవిరయ్యాయి.
28 సంవత్సరాల తర్వాత ప్రపంచకప్‌కు అర్హత సాధించిన ఈజిప్ట్ తీవ్రంగా నిరాశ పరిచింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓటమి చవిచూసింది. మొరాకో కూడా 20 సంవత్సరాల తర్వాత సాకర్‌లోకి అడుగుపెట్టి రెండు ఓటములు, ఒక డ్రాతో టోర్నీ నుంచి నిష్ర్కమించింది. ఆఫ్రికన్ అభిమానులు, క్రీడా పండితులు ఎంతో నమ్మకం పెట్టుకున్న నైజీరియా ఒక్క విజయం రెండు ఓటములతో టోర్నీ నుంచి వైదలొగింది. ట్యూనీషియా కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఆఫ్రికా దేశాలు ఫిఫా ప్రపంచకప్ నుంచి నిష్ర్కమించి అభిమానులను తీవ్ర నిరుత్సాహపరిచాయి. సెమీఫైనల్ చేరాలనుకున్న ఆఫ్రికన్ అభిమానుల కల రష్యాలో కుదరలేదు.. కనీసం ఖతార్‌లోనైనా సాధ్యపడుతుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment