
ఆఖరిది ఆడేశాడా!
మూడేళ్లలో ఎంత తేడా? 2011 ప్రపంచకప్‌లో ఒంటిచేత్తో జట్టును గెలిపించి దేశం మొత్తానికి హీరోగా మారిన యువరాజ్... మూడేళ్లు తిరిగే సరికి ఇప్పుడు విలన్‌లా కనిపిస్తున్నాడు. అతను జట్టుకు భారమయ్యాడనే భావన ఒక్క మ్యాచ్‌తో తెప్పించాడు. 2014 టి20 ప్రపంచకప్ ఫైనల్ తన కెరీర్‌లోనే చివరి అంతర్జాతీయ మ్యాచ్ కానుందనే అనుమానం రేకెత్తించాడు.
కేవలం ఒక్క మ్యాచ్‌తో, ఒక్క ప్రదర్శనతో ఓ క్రికెటర్‌ను తీసిపారేయలేం. కానీ ఓ క్రికెటర్ ఫామ్ ఖరీదు ఒక ప్రపంచకప్ కాకూడదు. శ్రీలంకతో టి20 ప్రపంచకప్ ఫైనల్లో యువరాజ్ ఆట మొత్తం సీన్‌ను మార్చేసింది. భారత్ కచ్చితంగా టైటిల్ గెలుస్తుందన్న ధీమాలో ఉన్న అభిమానుల ఆశలపై యువరాజ్ నీళ్లుజల్లాడు. భారత జట్టు ఎప్పుడు ముందు బ్యాటింగ్ చేసినా 15 ఓవర్ల వరకు వికెట్లను కాపాడుకుని చివరి 5 ఓవర్లలో 60-70 పరుగులు చేయడం వ్యూహంగా పెట్టుకుంటుంది. ఫైనల్లోనూ అదే వ్యూహంతో ఆడారు. అయితే యువీ ఇన్నింగ్స్ మొత్తం వ్యూహాన్ని మట్టిపాలు చేసింది.
ఆ జోష్ ఏమైంది?
ఒక్క మాటలో చెప్పాలంటే మూడేళ్ల క్రితం యువరాజ్... ఇప్పుడు కోహ్లి ఎలా ఉన్నాడో అలా ఉండేవాడు. మైదానంలో చురుగ్గా కదిలేవాడు. ఎక్కడి నుంచైనా వికెట్లను కొట్టేవాడు. మిస్ ఫీల్డింగ్ అంటే ఏంటో తెలీదు.. జట్టు ఎప్పుడు కష్టాల్లో ఉన్నా ముందుకొచ్చి పోరాడేవాడు. కానీ మూడేళ్లలో ఎంతగా మారిపోయాడంటే... తను మైదానంలో ఏ మాత్రం చురుగ్గా కదలడం లేదు. క్యాచ్‌లు వదిలేస్తున్నాడు. బౌలర్‌గా ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేక ఉపయోగపడటం లేదు. ఇక మిగిలిన ఒకే ఒక్క బాధ్యత బ్యాటింగ్. కానీ అందులోనూ ఘోరంగా విఫలమయ్యాడు. వెస్టిండీస్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఇక ఒక్క పరుగు చేస్తే భారత్ గెలుస్తుందనే సమయంలో సింగిల్ తీయలేకపోయాడు. అప్పుడు తను అవుట్ కాకపోతే ఆ మ్యాచ్ టై అయినా ఆశ్చర్యం లేదనే పరిస్థితి కల్పించాడు. కానీ ఆస్ట్రేలియాతో లీగ్ మ్యాచ్‌లో అదరగొట్టాడు. దీంతో ఇక యువీకి ఢోకా లేదనే పరిస్థితి ఏర్పడింది. దక్షిణాఫ్రికాతో సెమీస్‌లో ఇబ్బంది పడ్డా... కోహ్లికి కావలసిన సహకారం అందించాడు. దీంతో ఫైనల్లోనూ అదే పాత్ర పోషించేందుకు అతణ్ని బ్యాటింగ్‌కు పంపించారు. కానీ ఉపయోగం లేకపోయింది. ఫైనల్లో తను అవుటైన బాల్ ఫుల్‌టాస్. మామూలుగా క్రీజులో కుదురుకున్న బ్యాట్స్‌మన్ ఎవరైనా దానిని సిక్సర్ కొడతారు. మూడేళ్ల క్రితం యువరాజ్‌కు అదే బంతి ఎదురైతే గ్రౌండ్ బయటకు పంపేవాడు. కానీ ఇప్పుడు మాత్రం బౌండరీ దగ్గర ఫీల్డర్ చేతుల్లోకి ఆడాడు.
ఎన్నాళ్లని అండ...
నిజానికి యువీ టోర్నీ ఆరంభం నుంచి ఇబ్బంది పడుతున్నాడు. దీనికి ముందు వన్డేల్లో స్థానం కోల్పోయాడు. అయితే తనతో పాటే రైనా కూడా వన్డే జట్టులో స్థానం కోల్పోయాడు. కానీ రైనా టి20ల ద్వారా మళ్లీ తన సత్తా నిరూపించుకున్నాడు. యువరాజ్ కూడా అదే చేయాల్సింది. నిజానికి జట్టు నుంచి యువీకి చాలా మద్దతు లభించింది. శిఖర్ ధావన్ ఒక మ్యాచ్‌లో బాగా ఆడినా, రెండు మ్యాచ్‌ల్లో విఫలం కాగానే కూర్చోబెట్టారు. కానీ యువరాజ్ లాంటి సీనియర్ క్రికెటర్‌ని తుది జట్టులోంచి తప్పించడం సులభం కాదు. జట్టు కూడా తనకి అండగా నిలబడింది. ప్రపంచకప్ సమయంలో మీడియా ముందుకు వచ్చిన ప్రతి భారత క్రికెటర్ తనకి మద్దతుగా మాట్లాడాడు. ‘తను మ్యాచ్ విన్నర్. ఒక్క ఇన్నింగ్స్‌తో గాడిలో పడతాడు’ అనే సమర్థించుకుంటూ వచ్చారు. కానీ సహచరుల నమ్మకాన్ని ఈసారి నిలబెట్టుకోలేకపోయాడు.
ఆ వ్యాఖ్యల మర్మమేమిటి?
సాధారణంగా ధోని ప్రతి ఆటగాడినీ వెనకేసుకొచ్చాడు. ఫైనల్ తర్వాత కూడా యువీకి మద్దతుగా మాట్లాడాడు. ‘అభిమానులు ఎంత నిరాశపడతారో, ఆటగాడు అంతకంటే ఎక్కువ నిరాశపడతాడు. ఏ క్రికెటర్ కూడా కావాలని చెత్తగా ఆడడు. కానీ ఆటలో ఇవన్నీ సహజం అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి’ అంటూ యువీకి మద్దతుగా మాట్లాడాడు. కానీ... అదే ధోని పరోక్షంగా యువీ కెరీర్ ముగిసినట్లే అనే సంకేతమిచ్చాడు. యువరాజ్ భవిష్యత్ ఏమిటి? అనే ప్రశ్నకు ‘ఈరోజు గురించి మాట్లాడుకుందాం. సెలక్షన్ గురించి ఇప్పుడు మాట్లాడి ప్రయోజనం లేదు. ఎందుకంటే భారత క్రికెట్‌కు సీజన్ అయిపోయింది. ఇక దేశవాళీ క్రికెట్, ఐపీఎల్ ఆడాలి.
దాని తర్వాత మళ్లీ భారత జట్టు ఎంపిక సమయం వచ్చినప్పుడు దీని గురించి మాట్లాడదాం’ అన్నాడు. సాధారణంగా ఇలాంటి ప్రశ్నకు అది సెలక్టర్ల పని అనే సమాధానం ఉంటుంది. కానీ ధోని పరోక్షంగా తన అసహనాన్ని వెల్లగక్కాడు. ధోనికి ఇష్టం లేకుండా ఎవరూ జట్టులో ఉండరనేది వాస్తవం. గతంలో సెహ్వాగ్, జహీర్, హర్భజన్ అందరి విషయంలోనూ ఇది ప్రూవ్ అయింది. ఒక ఆటగాడు చెత్తగా ఆడుతున్నప్పుడు కెప్టెన్ మద్దతు ఉంటే జట్టులో ఉంటాడు. సెలక్షన్ సమయంలో కెప్టెన్ మౌనంగా ఉంటే ఆ ఆటగాడిపై వేటు ఖాయం. బహు శా యువీకి ఇదే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది.
ఫిట్‌నెస్ ఉందా?
యువరాజ్ మొదటి నుంచీ టెస్టు జట్టులోకి అడపాదడపా వచ్చి వెళ్లాడు గానీ... స్థిరంగా ఎప్పుడూ టెస్టులు ఆడలేదు. కానీ వన్డేలకు మాత్రం అతను కీలక ఆటగాడు. అయితే ప్రస్తుతం తన ఫిట్‌నెస్ స్థాయి వన్డే క్రికెట్‌కు సరిపడా లేదేమో అనిపిస్తోంది. ఇప్పటికే వన్డే జట్టులో అతనికి స్థానం లేదు. తిరిగి రావడం కోసం ప్రయత్నించినా పోటీ తీవ్రంగా ఉంది. ముఖ్యంగా రైనా, రహానే, రాయుడు లాంటి యువ క్రికెటర్లు అవకాశాల కోసం కాచుక్కూర్చున్నారు. ఇక జాతీయ జట్టుకు ఆడే అవకాశం ఉన్న ఒకే ఒక్క ఫార్మాట్ టి20. దీనిని కూడా ఫైనల్‌తో చెడగొట్టుకున్నట్లే.
ఇక అదొక్కటే దారి...
అయితే యువీకి ఇంకా ఒక దారి మిగిలి ఉంది. అది ఐపీఎల్. ఈ సీజన్‌కు ముందు జరిగిన వేలంలో అందరికంటే ఎక్కువ మొత్తం లభించింది యువరాజ్‌కే. తమ కెప్టెన్ కోహ్లి కోరిక మేరకు విజయ్ మాల్యా ఏకంగా ఏడాదికి రూ.14 కోట్లు యువీకి చెల్లించబోతున్నారు. అయితే ఫైనల్లో యువీ బ్యాటింగ్ సమయంలో కోహ్లిలో కనిపించిన అసహనం చూస్తే... తను ఎలా యువీని ఉపయోగిస్తాడనేది ఆసక్తికరం. భారీ మొత్తం ఇచ్చి కొన్నారు కాబట్టి... కచ్చితంగా ఆరంభంలో యువరాజ్‌ను తుది జట్టులో ఉంచుతారు. అయితే ఇంత అనుభవం ఉన్న సీనియర్ క్రికెటర్ తనని తాను నిరూపించుకోవాల్సి వస్తోంది. ఇకపై బాగా ఆడితేనే జట్టులో. ఒకవేళ ఐపీఎల్-7లోనూ ఆరంభ మ్యాచ్‌ల్లో విఫలమై బెంగళూరు తుది జట్టులోనూ చోటు కోల్పోతే... ఇక మళ్లీ భారత జట్టు డ్రెస్‌లో యువీని చూడటం దాదాపుగా ‘అసాధ్యమే’..!