మొహాలీ: సీజన్ ఆరంభం నుంచే ప్రతికూలతలు ఎదుర్కొంటున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోనుందా? కావేరీ ఆందోళనల కారణంగా సొంత గడ్డకు దూరం కావడం, కీలక ఆటగాడు కేదార్ జాదవ్ గాయంతో టోర్నీకి దూరంకావడం, తండ్రి మరణించడంతో సౌతాఫ్రికా బౌలర్ లుంగీ ఎంగిడి స్వదేశానికి వెళ్లిపోవడం కోలుకోలేని పరిణామాలు. అంతలోనే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడటం జట్టు యాజమాన్యాన్ని, అభిమానులను కలవరపెడుతోంది.
ఐపీఎల్ 2018లో భాగంగా ఆదివారం మొహాలీలో పంజాబ్ కింగ్స్ లెవెన్‌తో జరిగిన మ్యాచ్‌లో మహీ వెన్నునొప్పి తాళలేకపోవడం, ఇన్నింగ్స్ మధ్యలో ఫిజియోథెరపీ చేయించుకోవడం, ఆ నొప్పి కారణంగానే ఆఫ్ స్టంప్ అవతి నుంచి వెళ్లే బంతుల్ని ఆడలేకపోవడం, చివరికి 4 పరుగుల తేడాతో చెన్నై ఓటమిపాలుకావడం తెలిసిందే. కాగా, మ్యాచ్ ముగిసిన తర్వాత తన గాయంపై ధోనీ ఇచ్చిన వివరణ కాస్త ఉపశమనం కలిగించేలా ఉంది.
దేవుడు ఆ శక్తి ఇచ్చాడు: ‘‘అవును. వెన్నునొప్పి నన్ను బాధించింది. ఫిజియో సాయంతో కాస్త ఉపశమనం పొందాను. మళ్లీ నొప్పి తిరగబెడుతుందా లేదా ఇప్పుడే చెప్పలేను. అయితే ఇవేవీ నాకు కొత్తేంకాదు. ఒక మోస్తారు గాయాలైనప్పుడు కూడా నొప్పిని భరిస్తూ ఆడగలను. దేవుడు నాకా శక్తి ఇచ్చాడు. పైగా తర్వాతి మ్యాచ్‌కు కొంత గ్యాప్ వచ్చింది కాబట్టి బహుశా పూర్తిగా కోలుకోవచ్చని ఆశిస్తున్నా’’ అని ధోనీ ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ తన తర్వాతి మ్యాచ్‌లో శుక్రవారం(ఏప్రిల్ 20న) రాజస్తాన్ రాయల్స్‌తో తలపడనుంది. పుణె వేదికగా ఆ మ్యాచ్ జరుగనుంది.
ముజీబ్‌పై మహీ ప్రంసలు: ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో చివరికి పంజాబే గెలిచినప్పటికీ చెన్నై సారధి మహేంద్ర సింగ్ ధోని (44 బంతుల్లో 79 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) అద్భుత ప్రదర్శనకు ఫ్యాన్స ఫిదా అయిపోయారు. మహీని ఆకాశానికెత్తేస్తూ పలువురు కామెంట్లు చేశారు. ఇదిలా ఉంటే, మ్యాచ్ తర్వాత కామెంటేంటర్లతో మాటల సందర్భంగా ధోనీ.. పంజాబ్ బౌలర్, అఫ్ఘానిస్తాన్‌కు చెందిన ముజీబ్‌పై ప్రశంసలు కురిపించాడు. మిడిల్ ఓవర్స్‌లో ముజీబ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడని, అతని బంతుల్ని ఎదుర్కోవవడానికి కష్టపడాల్సి వచ్చిందని చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment