
ఏడాది తర్వాత...
వెల్లింగ్టన్: దాదాపు ఏడాది తర్వాత న్యూజిలాండ్ టెస్టుల్లో తొలి విజయాన్ని నమోదు చేసింది. ట్రెంట్ బౌల్ట్ (మ్యాచ్‌లో 10 వికెట్లు)తో పాటు ఇతర బౌలర్లు సమష్టిగా రాణించడంతో... మూడు రోజుల్లోనే ముగిసిన రెండో టెస్టులో కివీస్ ఇన్నింగ్స్ 73 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. మూడో రోజు మొత్తం 16 వికెట్లు పడగొట్టి కివీస్ బౌలర్లు ఆకట్టుకున్నారు. బ్యాటింగ్‌లో విఫలమైన కరీబియన్ జట్టు 158/4 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించి 49.5 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఫాలోఆన్‌లో పడింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ శామ్యూల్స్ (60), దేవ్‌నారాయణ్ (22) కాసేపు పోరాడి విఫలమయ్యారు. బౌల్ట్ ఆరు బంతుల వ్యవధిలో నాలుగు వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును ఘోరంగా దెబ్బతీశాడు.
బౌల్ట్ 6, సౌతీ, అండర్సన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. తర్వాత ఫాలోఆన్ మొదలుపెట్టిన విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 54.5 ఓవర్లలో 175 పరుగులకు కుప్పకూలింది. ఎడ్వర్డ్స్ (35), పావెల్ (36), చందర్‌పాల్ (31 నాటౌట్) మినహా మిగతా వారు విఫలమయ్యారు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ బౌల్ట్ 4 వికెట్ల్లతో మరోసారి తన సత్తా చూపించగా, సౌతీ 3, వాగ్నేర్ 2 వికెట్లు తీశారు. ఇరుజట్ల మధ్య మూడో టెస్టు హామిల్టన్‌లో ఈనెల 19 నుంచి జరుగుతుంది.